e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home News భూములు, ఆస్తుల ర‌క్ష‌ణకే డిజిట‌ల్ స‌ర్వే : సీఎం కేసీఆర్

భూములు, ఆస్తుల ర‌క్ష‌ణకే డిజిట‌ల్ స‌ర్వే : సీఎం కేసీఆర్

భూములు, ఆస్తుల ర‌క్ష‌ణకే డిజిట‌ల్ స‌ర్వే : సీఎం కేసీఆర్

హైద‌రాబాద్ : ప్రజల భూములకు ఆస్తులకు రక్షణ కల్పించేందుకే డిజిట‌ల్ స‌ర్వే చేప‌డుతున్నామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. రేపటి భవిష్యత్తు తరాలకు భూ తగాదాలు లేకుండా, శాశ్వతంగా పరిష్కారం చూపాలనే ఉద్దేశ్యంలో భాగంగానే డిజిటల్ సర్వే నిర్వ‌హ‌ణ‌కు నిర్ణ‌యం తీసుకున్నామ‌ని సీఎం పేర్కొన్నారు. భూముల‌ డిజిటల్ సర్వే నిర్వహణ అంశాన్ని చర్చించేందుకు, ప్రగతి భవన్‌లో బుధవారం సీఎం కేసీఆర్ డిజిటల్ సర్వే ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న భూపరిపాలనలో గుణాత్మక మార్పులు రోజు రోజుకూ చోటుచేసుకుంటున్నాయని ఈ సందర్భంగా సీఎం వివరించారు. మనిషి ఆదిమానవుడుగా బతుకు ప్రారంభించినప్పుడు భూమిమీద హక్కులు లేవు. మనిషి వ్యవసాయం నేర్చుకున్న అనంతర పరిణామాల్లోనే భూమి మీద హక్కు ప్రారంభమైంది. అటు తర్వాత రాజుల కాలం నుంచి నేటి ప్రజాస్వామిక దశ వరకు భూమి హక్కుల ప్రక్రియలో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటూ వస్తున్నయి. మారుతున్న కాలంలో ప్రభుత్వాలు కూడా ప్రజల భూములు ఆస్తుల రక్షణ విషయంలో అప్ డేట్ అవుతూ వుండాలి. అందివస్తున్న నూతన సాంకేతిక విధానాలను అనుసరిస్తూ ప్రజల భూములకు ఆస్తులకు రక్షణ కల్పించే చర్యలు చేపట్టాలి. అదే పని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశ్యాన్ని లక్ష్యాన్ని అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా కార్యాచరణను రూపొందించుకుంటరనే నీను మీకు ఈ చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తున్నాను అని సీఎం స‌ర్వే ప్ర‌తినిధుల‌కు తెలిపారు.


భూ త‌గాదాలు లేని దేశాల్లో జీడీపీ వృద్ధి

భూ తగాదాలు నూటికి నూరు శాతం లేకుండా పరిష్కరించుకున్న దేశాల్లో ఆదాయం (జీడిపీ) మూడు నుంచి నాలుగు శాతం పెరిగిందని గణాంకాలు నిరూపిస్తున్నాయని సీఎం అన్నారు. తెలంగాణను సాధించుకున్న తర్వాత గత పాలకులు విస్మరించిన ప్రజా సమస్యలలో భూ సర్వే కూడా మిగిలిపోయిందన్నారు. చిన్న తప్పు జరిగినా భవిష్యత్తు తరాలు మూల్యం చెల్లించుకుంటాయన్నారు. ప్రభుత్వాలు చేసే తప్పులకు పేద ప్రజలు ఇబ్బందులు పడొద్దనే గత పాలకుల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందు చూపుతో తెలంగాణ ప్రభుత్వం భూ సర్వే కోసం చర్యలు చేపట్టిందన్నారు. రైతు బంధు వంటి పంటసాయాన్ని అందిస్తూ, సాగునీరు అందిస్తూ రైతును బాగు చేసుకుంటూ, వ్యవసాయాన్ని స్థిరీకరించుకున్నామన్నారు. విద్య‌, వైద్యం, తాగునీరు వంటి రంగాలను సక్కదిద్దుకుంటూ వస్తున్న ప్రభుత్వం రేపటి భవిష్యత్తు తరాలకు భూ తగాదాలు లేకుండా శాశ్వతంగా పరిష్కారం చూపాలనే ఉద్దేశ్యంలో భాగంగానే డిజిటల్ సర్వేను చేపడుతున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
భూములు, ఆస్తుల ర‌క్ష‌ణకే డిజిట‌ల్ స‌ర్వే : సీఎం కేసీఆర్

ట్రెండింగ్‌

Advertisement