సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 04:14:42

డిజిటల్‌ పేమెంట్స్‌తో జాగ్రత్త

డిజిటల్‌ పేమెంట్స్‌తో జాగ్రత్త

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రస్తుతం ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరిగిన దృష్ట్యా డిజిటల్‌ పేమెంట్స్‌ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ సూచించారు. సైబర్‌ మోసగాళ్ల వలలో పడొద్దని హెచ్చరించారు. సురక్షిత ఆన్‌లైన్‌ చెల్లింపులపై అవగాహన కల్పించేందుకు ‘డిజిటల్‌  పేమెంట్స్‌ అభియాన్‌' కార్యక్రమాన్ని జయేశ్‌రంజన్‌ మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించడంలో సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌, డీఎస్‌సీఐ కీలకపాత్ర పోషిస్తున్నాయని ప్రశంసించారు. సురక్షిత వెబ్‌సైట్లు, వ్యాలెట్ల ద్వారానే చెల్లింపులు చేపట్టాలని ప్రజలకు సూచించారు. డిజిటల్‌ సాంకేతికతను ప్రోత్సహించడంలో తెలంగాణ దేశంలోనే ముందువరుసలో నిలుస్తున్నదని చెప్పారు. డిజిటల్‌ పేమెంట్స్‌ను ప్రోత్సహించేందుకు దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘టీ-వ్యాలెట్‌' పేరుతో ఆన్‌లైన్‌ చెల్లింపుల పోర్టల్‌ను ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. కేంద్రం ప్రారంభించిన డిజిటల్‌ పేమెంట్స్‌ అభియాన్‌లో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉన్నది. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు రమా వేదశ్రీ, శ్రీరామ్‌, అమన్‌ జైన్‌, పుల్కిత్‌ త్రివేది, మదన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


logo