బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Aug 06, 2020 , 03:21:23

స్కూళ్లు, కాలేజీల్లో డిజిటల్‌ పాఠాలు

స్కూళ్లు, కాలేజీల్లో డిజిటల్‌ పాఠాలు

  • రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం
  • టీశాట్‌, టీవీ చానెళ్ల ద్వారా బోధన
  • త్వరలో షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలలో డిజిటల్‌ పాఠాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్నిరకాల పాఠశాలల్లో ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్‌ను అమలుచేయాలని సీఎం కేసీఆర్‌ నేతృత్వంతో బుధవారం సమావేశమైన క్యాబినెట్‌ తీర్మానించింది. రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలలో ఆన్‌లైన్‌/డిజిటల్‌ పాఠాలను అందించాలని నిర్ణయించింది. దీనివల్ల విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరం నష్టపోకుండా కాపాడనున్నది. టీశాట్‌, యాదగిరి, ఇతర టీవీ చానెళ్లు/ప్రసార మాధ్యమాల ద్వారా విద్యార్థులకు డిజిటల్‌ పాఠాలను అందుబాటులోకి తేనున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహించాలని, ఇందుకోసం యాదగిరి (దూరదర్శన్‌) చానెల్‌ను వినియోగించుకోవాలని, సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారుచేయాలని అధికారులను ఆదేశించింది.  జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజినీరింగ్‌తోపాటు ఇతర వృత్తి విద్యా కాలేజీలలో కూడా ఆన్‌లైన్‌/డిజిటల్‌ పాఠాలను అందించడానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీనిపై విద్యాశాఖ తయారుచేసిన డిజిటల్‌ బోధన మార్గదర్శకాలను క్యాబినెట్‌ ఆమోదించింది. త్వరలోనే ఆ మార్గదర్శకాలను అమలుచేయాలని కోరుతూ డీఈవోలకు ఆదేశాలు జారీ చేయనున్నారు. 

ప్రవేశపరీక్షలకు త్వరలో షెడ్యూల్‌

రాష్ట్రంలో అన్ని ప్రవేశ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ రూపొందించాలని పేర్కొన్నది. డిగ్రీ, పీజీ ఫైనలియర్‌ పరీక్షల నిర్వహణ విషయంలో కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలని నిర్ణయించింది. 

వలస కార్మికుల సంక్షేమానికి విధానం

లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికుల కష్టాలను ప్రపంచమంతా కళ్లారా చూసిందని, భవిష్యత్తులో వారికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని క్యాబినెట్‌ అభిప్రాయపడింది. రాష్ట్రంలో పెద్దఎత్తున ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన కార్మికులు పనిచేస్తున్నారని, వారి సంక్షేమానికి ప్రత్యేక పాలసీ తయారుచేయాలని నిర్ణయించింది. పుట్టిన ఊరిని, కన్న వారిని, కుటుంబాన్ని వదిలి పనికోసం తెలంగాణకు వచ్చే కార్మికులు.. ఇదే తమ ఇల్లు అనే భావన, భరోసా కలిగించేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది. వలస కార్మికుల సంక్షేమ పాలసీని రూపొందించాలని అధికారులను ఆదేశించింది.