గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 31, 2020 , 18:23:43

డిజిటల్ తరగతులు సజావుగా నిర్వహించాలి : మంత్రి సత్యవతి రాథోడ్

 డిజిటల్ తరగతులు సజావుగా నిర్వహించాలి : మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్ : గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్, గిరిజన పాఠశాలలన్నింటిలో డిజిటల్ తరగతులు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగాలని గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. డిజిటల్ తరగతుల నిర్వహణ, ఏర్పాట్లు, ఉపాధ్యాయులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి ఆ శాఖ కమిషనర్, కార్యదర్శి క్రిస్టినా, ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, గిరిజన గురుకులాల అదనపు సంచాలకులు నవీన్ నికోలస్, ఇతర అధికారులతో హైదరాబాద్ సంక్షేమ భవన్ లో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డిజిటల్ తరగతుల నిర్వహణలో ఉపాధ్యాయులు, అధికారులు మరింత శ్రద్థతో పనిచేయాలని మంత్రి  కోరారు. విద్యార్థులను స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్స్, కంప్యూటర్లు ఉన్న వారిని ఒక గ్రూపుగా, టీ సాట్, దూరదర్శన్ ద్వారా డిజిటల్ తరగతులకు హాజరయ్యే విద్యార్థులను ఒక గ్రూపుగా గుర్తించి వారికి క్లాసులు బోధించాలన్నారు. 

టీ సాట్, దూరదర్శన్ ద్వారా తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు అంతరాయం కలగకుండా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు విద్యుత్ అధికారులు, టెలికమ్ అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. డీడీ, టిసాట్ ద్వారా తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు క్లాస్ అనంతరం టీచర్లు ఫోన్లు చేసి వారి సందేహాలను తీర్చాలని, వారి హోమ్ వర్క్ ను పర్యవేక్షించాలని ఆదేశించారు. గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఓక్స్ యాప్ ద్వారా లాక్ డౌన్ నుంచే డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు.

అదేవిధంగా ఏకలవ్య మోడల్ స్కూల్స్ లో స్టెప్ యాప్ ద్వారా 4049 మంది విద్యార్థులకు డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఏప్రిల్ 24 నుంచి టీ సాట్ ద్వారా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు  మనటీవీలో పాఠాలు చెబుతున్నట్లు వివరించారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు జూమ్ యాప్ ద్వారా రెగ్యులర్ గా డిజిటల్ తరగతులు కొనసాగించామన్నారు. నీట్, ఐఐటీ కోచింగ్ విద్యార్థులకు డిజిటల్ మాధ్యమంలో సిలబస్ కంప్లీట్ చేశామన్నారు. logo