శనివారం 30 మే 2020
Telangana - May 12, 2020 , 02:22:12

కష్టార్జితం కాలిపాయె..

కష్టార్జితం కాలిపాయె..

  • అగ్నిప్రమాదంలో రూ.13 లక్షల నగదు దగ్ధం
  • విలపించిన బాధితుడు నాగభూషణం

అక్కన్నపేట: నోరు కట్టుకొని.. కడుపు మాడ్చుకొని, ఇన్నాండ్లు కష్టపడి కూడబెట్టిన సంపాదనంతా కాలి బూడిదైపోయింది.. పదేండ్ల కష్టమంతా వృథా అయ్యింది.. ప్రమాదవశాత్తు ఇంట్లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో సూట్‌కేస్‌లో దాచిపెట్టిన రూ.13 లక్షల నగదు, 12 తులాల బంగారం దగ్ధమైంది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గొల్లకుంటలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకున్నది. గొల్లకుంటకు చెందిన కాశబోయిన నాగభూషణం, సమ్మయ్య అన్నదమ్ములు. ఇద్దరు ఒకే ఇంట్లో వేర్వేరుగా ఉంటున్నారు. నాగభూషణం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. 11 గంటల సమయంలో సమ్మయ్య తన మనుమడితో ఇంటికి వచ్చాడు. లోపలి నుంచి పొగలు వస్తుండటంతో సమ్మయ్య తన ఇంటివైపు ఉన్న తాళం తీసి లోపలికి వెళ్లాడు. దీంతో తన తమ్ముడి ఇంట్లోని ఓ గది నుంచి పొగలు వస్తుండటంతో బయటకు వచ్చి నాగభూషణంకు ఫోన్‌ చేసి సమాచారమిచ్చాడు. నాగభూషణం కుటుంబ సభ్యులతో ఇంటికి వచ్చాడు. అప్పటికే ఓ గదిలో నుంచి పొగలు, మంటలు వస్తుండటంతో బిందెలతో నీళ్లు పోసి మంటలార్పాడు. అనంతరం గదిలోకి వెళ్లి చూడగా సూట్‌కేసు సహా అందులో ఉన్న రూ.13 లక్షల నగదు, 12 తులాల బంగారం, పట్టాదారు పాస్‌పుస్తకాలు, భూమి రిజిస్ట్రేషన్‌ పేపర్లు, ద్విచక్ర వాహనాల పేపర్లు, అప్పులు ఇచ్చి రాయించుకున్న పలు ప్రామిసరీ నోట్‌లు, ఆవరణలోని డోజర్‌ ట్రాక్టర్‌, మినీ టాటా ఏస్‌ బండి పూర్తిగా కాలిపోవడంతో లబోదిబోమన్నారు.logo