e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home Top Slides ఐదున్నర ఎకరాల్లోనే హరిత క్షేత్రం

ఐదున్నర ఎకరాల్లోనే హరిత క్షేత్రం

  • 140 రకాల దేశ, విదేశీ పండ్ల జాతుల సాగు
  • 300 గజాల్లో 140 మామిడి మొకలు
  • సూపర్‌ హైడెన్సిటీ విధానంలో మామిడి
  • క్షేత్రం చుట్టూ కలపనిచ్చే చెట్ల పెంపకం
  • దేశీ, విదేశీ పండ్ల జాతుల సాగు
  • బాడర్‌క్రాప్‌గా కలప మొక్కల సాగు
  • పండ్ల ప్రయోగశాలగా ‘స్ఫూర్తివనం’
  • ఆదర్శంగా వరంగల్‌ జిల్లా రైతు శౌరిరెడ్డి

ఏ సీజన్‌లో వచ్చే పండ్లను ఆ సీజన్‌లో తినాలనే తపన.. ఎప్పుడైనా పది రకాల పండ్లు ఇంట్లో ఉండాలనే కోరిక ఆ రైతును పండ్ల సాగువైపు నడిపించింది. ఒక్క ఎకరంలోనే 16 పండ్ల రకాల చెట్లు వేశాడు. ఆ చెట్లు పెరుగుతున్న కొద్దీ వాటి రకాలనూ పెంచుకుంటూపోయాడు. తనకున్న ఐదున్నరెకరాల్లో ఏకంగా 140 పండ్ల రకాలను సాగు చేస్తున్నాడు. ఇందులో స్థానికంగా దొరికేవాటితోపాటు, దేశ, విదేశీ పండ్ల జాతులు ఉన్నాయి. తన పండ్లక్షేత్రాన్ని ఓ ప్రయోగశాలగా మార్చిన వరంగల్‌ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన రైతు సింగారెడ్డి శౌరిరెడ్డి తోటి రైతులకు ‘స్ఫూర్తి వనం’గా నిలుస్తున్నారు.

హైదరాబాద్‌, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): నిత్య దిగుబడి.. నిలకడైన ఆదాయం, సేంద్రియ విధానంలో సేద్యం, తీరొక్క పండు.. తియ్యదనం మెండు.. ఒకే క్షేత్రంలో 10 రకాల పంటలు పండిస్తే ఏడాది పొడవునా ఆదాయంతోపాటు, ఆర్థిక భరోసా ఎలా కలుగుతుందో నిరూపిస్తున్నారు వరంగల్‌ జిల్లా ఖాజీపేట మండలం తరాలపల్లి గ్రామానికి చెందిన రైతు సింగారెడ్డి శౌరిరెడ్డి. ఈ మౌలిక సూత్రం ఆధారంగానే సమగ్ర వ్యవసాయానికి రూపకల్పన చేసిన ఆ రైతు తనకున్న ఐదున్నర ఎకరాల్లో హరితక్షేత్రాన్ని సృష్టించారు. పండ్లు, కూరగాయలు, సుగంధం, కలప మొకలుగా విభజించి సేద్యం చేస్తున్నారు. ఐదున్నర ఎకరాల్లోనే దేశ, విదేశీ జాతులకు చెందిన 140 రకాల పండ్లను పండిస్తూ తన క్షేత్రాన్ని ప్రయోగశాలగా మార్చారు. చుట్టూ ఫెన్సింగ్‌గా కలపనిచ్చే చెట్లు.. మధ్యలో కూరగాయాలు, సుగంధ మొక్కలనూ సాగు చేస్తూ ఆదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ప్రతిరోజూ ఏదో ఒక చెట్టునుంచి దిగుబడి తీస్తున్న ఈ క్షేత్రం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నది. 2012లో ప్రయోగబాట ప్రారంభించిన శౌరిరెడ్డి తొమ్మిదేండ్లలో అనేక రకాల జాతుల మొకలకు ప్రాణంపోశారు. తోట చుట్టూ మహాఘని, కొబ్బరి, వెదురు చెట్లు నాటాడు. పూర్తిగా సేంద్రియ ఎరువులనే వాడటంతో పండ్ల మొకలు కనువిందు చేస్తున్నాయి.

- Advertisement -

సంప్రదాయ పండు.. విదేశీ హంగు
వ్యవసాయక్షేత్రంలో దేశీయంగా దొరికే పండ్లలో పలు రకాలను శౌరిరెడ్డి సాగు చేస్తున్నారు. వీటిల్లో సపోటలో 4 రకాలు, చెర్రీలో 4 రకాలు, కాఫీ మొక, 2 జీడిమొకలు, 9 రకాల జామ మొకలు, నల్లజామ ఉన్నాయి. 3 రకాల మామిడి మొక్కలను సూపర్‌ హైడెన్సిటీ విధానంలో 300 గజాల్లో 140 మామిడి మొకలు నాటారు. వీటితోపాటు, రాంబూటాన్‌, చెర్రీస్‌, లిచీ, పీనట్‌ బటర్‌, బిలింబి, ఐస్‌క్రీమ్‌ బీన్‌, బరాభా, అంబరిల్లా, కుమ్‌ క్వాట్‌, నోని తదితర అనేక జాతుల పండ్ల మొకలు ఇకడ ఉన్నాయి. వీటిలో దాదాపు 20 రకాలు విదేశాల్లో పండేవే. ఒకో చెట్టుకు 5 -6 కిలోల దేశీ ఆవులపేడ, మూత్రంతో తయారుచేసిన జీవామృతం వినియోగిస్తున్నారు. కాఫీ, ఇలాచీ, మిరియాలు, డ్రాగన్‌ ఫ్రూట్‌, పింక్‌ వెరైటీ, దాల్చినచెక్క, లవంగాలు, ఆల్‌ స్పైసెస్‌, ఆలీవ్‌, సాన్‌టాల్‌, థాయ్‌ లిచీ, అవకాడో వంటి మొక్కలు ఉన్నాయి.

10 రకాల పండ్లు ఉండాలనే కోరికతోనే..
ఏ సీజన్‌లోనైనా 10 రకాల పండ్లు సొంతంగా పండించుకొని తినాలనే కోరికతోనే స్ఫూర్తివనం సాగు మొదలుపెట్టా. మొదట ఎకరంలో 16 రకాల మామిడి చెట్లు పెంచా. సేంద్రియ పద్ధతిలో ఆరోగ్యకరమైన పంటలు పండించాలని నిర్ణయించి.. బర్రెలు, ఆవుల పేడతో జీవామృతం తయారుచేసి వినియోగిస్తున్నా. మొదట వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం రెడ్డిపాలెంలో 16 ఎకరాల తోట ఉండగా.. వ్యవసాయం చేయలేక దాన్ని అమ్ముకున్నాం. తర్వాత మా నాన్నగారు వరంగల్‌కు సమీపంలో కొనుగోలు చేసిన ఐదున్నర ఎకరాల్లో వైవిధ్యమైన పంటలను పండించడం ప్రారంభించా. మొక్కలను ఆన్‌లైన్‌ ద్వారా, వివిధ ప్రాంతాల నుంచి కొన్నాం. నేను స్థాపించిన బాలవికాస స్వచ్ఛంద సంస్థ ద్వారా చేపట్టిన కార్యక్రమాలను ఆరు రాష్ర్టాల్లో విస్తరించాం. సేంద్రియ వ్యవసాయంపై రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాం. వివిధ దేశాల్లోని కార్పొరేట్‌ కంపెనీలకు కూడా మా సంస్థ ద్వారా శిక్షణ ఇస్తున్నాం. రైతుబిడ్డగా పుట్టి పిల్లలకు వ్యవసాయం నేర్పాలనేది లక్ష్యం.

రైతు సింగారెడ్డి శౌరిరెడ్డి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana