శనివారం 16 జనవరి 2021
Telangana - Dec 28, 2020 , 20:09:51

కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు.. పీసీసీ అధికార ప్రతినిధిపై దాడి

కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు.. పీసీసీ అధికార ప్రతినిధిపై దాడి

నాగర్‌కర్నూల్‌ : కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో పీసీసీ అధికార ప్రతినిధి సతీశ్‌పై అదేపార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ వర్గీయులు దాడి చేశారు. బోగస్‌ ఓట్లు నమోదు కాకుండా చూడాలని వినతిపత్రం ఇచ్చేందుకు సోమవారం సాయంత్రం పీసీసీ అధికార ప్రతినిధి సతీశ్‌ అచ్చంపేట తాసిల్దార్‌ కార్యాలయానికి కాంగ్రెస్‌ కండువా వేసుకొని వచ్చాడు. వచ్చిరాగానే కొందరు అతడిపై దాడి చేసి చొక్కా చింపారు.

తనపై మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ వర్గీయులే దాడి చేశారని సతీశ్‌ మండిపడ్డారు. నియోజకవర్గంలో కొన్నిరోజులుగా సతీశ్‌ విస్తృతంగా పర్యటిస్తుండటం, గ్రామాల్లో డీఎస్‌ మాస్‌ పేరుతో కార్యక్రమాలు చేస్తుండటంతో ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందనే భయంతో వంశీకృష్ణ తన వర్గీయులతో దాడి చేయించినట్లు సతీశ్‌ వర్గీయులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు.  ఇరువర్గాలు పరస్పరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది.     

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.