గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Aug 07, 2020 , 01:51:55

పల్లెలో డీజిల్‌ జిల్‌

పల్లెలో  డీజిల్‌ జిల్‌

  • వ్యవసాయ పనులతో పెరిగిన అమ్మకాలు
  • పట్టణాల్లో సగానికి పడిపోయిన డీజిల్‌, పెట్రోల్‌ విక్రయాలు 
  • సాగుపనుల జోరుతో అధికంగా డీజిల్‌ వినియోగం
  • కాళేశ్వరం కొత్త ఆయకట్టులో భూమి చదును పనులు
  • జూన్‌ వరకు 28,814 ట్రాక్టర్లు, హార్వెస్టర్ల రిజిస్ట్రేషన్‌ 

గత ఏడాది ఏప్రిల్‌-జూన్‌తో పోల్చితే  ఈసారి 10 జిల్లాల్లో డీజిల్‌ విక్రయాలు పెరిగాయి. నారాయణపేట్‌ జిల్లాలో అత్యధికంగా 55.19% పెరుగుదల నమోదైంది.జనగామలో 21.50, నాగర్‌కర్నూల్‌లో 20.04, ములుగులో 15.36, జోగుళాంబ గద్వాల, కామారెడ్డిలో 15, వనపర్తిలో 11.21, సిరిసిల్లలో 9.90, మహబూబాబాద్‌లో 2.67, మెదక్‌లో 0.27% చొప్పున విక్రయాలు పెరిగాయి. ఇదే సమయంలో హైదరాబాద్‌లో ఏకంగా 61% తగ్గాయి. రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో విక్రయాలు 51% పడిపోయాయి. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో వ్యవసాయ సీజన్‌ జోరుగా సాగుతున్నది. ఓవైపు వర్షాలు విస్తారంగా కురువడం, ముందుగానే ప్రాజెక్టులకు నీరు చేరడం, మరోవైపు కాళేశ్వరం జలాలతో చెరువులు, కుంటలు నిండటంతో గతంతో పోల్చితే పంటల సాగు రెట్టింపు జోరుతో సాగుతున్నది. అన్నిరకాల పంటలతోపాటు వరినాట్లు ముమ్మరమయ్యాయి. పల్లెల్లో ట్రాక్టర్ల చప్పుళ్లతో సందడి నెలకొన్నది. యాసంగిలో వరికోతలతో హార్వెస్టర్లు క్షణం తీరికలేకుండా నడవగా.. ప్రస్తుతం పొలం దమ్ములతో ట్రాక్టర్లు హోరెత్తిస్తున్నాయి. దీంతో పల్లెల్లో డీజిల్‌ వినియోగం భారీగా పెరిగిపోయింది. గతేడాదితో పోల్చితే  ఈసారి ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు హైదరాబాద్‌, దానిచుట్టూ ఉన్న రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో డీజిల్‌ విక్రయాలు భారీగా తగ్గితే.. గ్రామీణ ప్రాంత జిల్లాల్లో మాత్రం ఆ తగ్గుదల స్వల్పంగానే ఉన్నది. గతేడాది, ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు పెట్రో విక్రయాలను పరిశీలిస్తే డీజిల్‌ విక్రయాలు 28.47%, పెట్రోల్‌లో 32.47% తగ్గాయి. గతేడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు 4.23 లక్షల కిలోలీటర్ల పెట్రోల్‌ విక్రయించగా, ఈసారి ఆ మూడు నెలల్లో కేవలం 2.85 లక్షల కిలోలీటర్ల మాత్రమే అమ్మడయింది. డీజిల్‌ విక్రయం గతేడాది 8.64 లక్షల కిలోలీటర్లు ఉండగా.. ఈ యేడాది 6.18 లక్షల కిలోలీటర్లకు పడిపోయింది. జూలై నెలలో డీజిల్‌ విక్రయాల్లో తగ్గుదల 14.22 మాత్రమే ఉన్నది. వ్యవసాయపనులు ముమ్మరం కావడం వల్లనే డీజిల్‌ విక్రయాలు పెరిగాయని పెట్రోల్‌ బంకుల యాజమానులు తెలిపారు. 

28,814 కొత్త ట్రాక్టర్లు, హార్వెస్టర్లు

కరోనా కారణంగా జనం పట్నం నుంచి పల్లెలకు పయనమయ్యారు. వారిలో ఎక్కువశాతం మంది వ్యవసాయం బాట పట్టారు. సాగునీటి వసతి మెరుగవడంతో బీడుభూములను వ్యవసాయయోగ్యంగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ఆయకట్టు కింద భూముల చదును పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తరాలుగా పనికిరాని భూములను సైతం సాగులోకి తెచ్చుకుంటున్నారు. అందుకనుగుణంగా కొత్త ట్రాక్టర్ల కొనుగోలు కూడా పెరుగుతున్నది. ఈ ఏడాది జూన్‌ వరకు రాష్ట్రంలో ఏకంగా 28,814 కొత్త ట్రాక్టర్లు, హార్వెస్టర్లు రిజిస్ట్రేషన్‌ కావడం గమనార్హం. వ్యవసాయరంగానికి సంబంధించి కొత్త వాహనాలు పెరగడం కూడా డీజిల్‌ విక్రయాల్లో పెరుగడానికి కారణమైంది.

వ్యవసాయం లేకుంటే సంక్షోభమే 

కరోనా, లాక్‌డౌన్‌తో పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలు సగానికిపైగా పడిపోయాయి. గ్రామాలతో పోల్చితే పట్టణాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయపనులు జోరుగా సాగుతుండడంతో డీజిల్‌ విక్రయాల్లో కనీసం 10 శాతం మెరుగుదల నమోదైంది. వ్యవసాయరంగమే లేకుంటే పెను సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది.

- అమరేందర్‌రెడ్డి, పెట్రోల్‌ బంకుల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడుlogo