మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 17:01:08

తొమ్మిది చేసిన‌వాళ్లం ప‌ద‌వ ప‌ని చేయ‌మా?

తొమ్మిది చేసిన‌వాళ్లం ప‌ద‌వ ప‌ని చేయ‌మా?

సిద్దిపేట : ఇప్ప‌టికి తొమ్మిది ప‌నులు పూర్తి చేసిన‌వాళ్లం ప‌ద‌వ ప‌ని చేయ‌మా? అని మంత్రి హ‌రీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం తోగుట మండల కేంద్రంలో శివసేన‌ జిల్లా అధ్యక్షుడు హన్మంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, తోగుట మాజీ సర్పంచ్, మాజీ పీఏసీఎస్‌ చైర్మన్ విద్యా కర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, చిక్కుడు లింగం, బీజేవైఎం నాయకులు, తదితరులు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరంద‌రికి గులాబీ కుండువాలు క‌ప్పి మంత్రి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్ మాట్లాడుతూ... దుబ్బాకలో 18 సబ్ స్టేషన్లు నిర్మించాం. నాణ్య‌మైన క‌రెంటు ఇచ్చి బావులు, బోర్లా కాడ మోటార్లు కాలకుండా చేశాం. నాణ్యమైన కరెంటు అందేలా చూసింది రామలింగన్న కాదా? అని అడిగారు. అభివృద్ధి కళ్ళ ముందు ఉన్నది. అందరూ ఇల్లు కావాలని కోరుతున్నారు. త్వరలోనే అర్హులను గుర్తించి ఆ ప్ర‌క్రియ‌ను చేప‌డ‌తాం. తొమ్మిది పనులు చేసిన వాళ్ళం పదవ పని చేయమా? అని అన్నారు. 

కరోనా విపత్కర సమయంలో ఉచితంగా పప్పు, అదనంగా బియ్యం పంపిణీ చేశాం. చెప్పినవ‌న్నీ చేశాం. ఇంకా చేస్తాం. రూ. 2 వేల పెన్ష‌న్ ఇస్తున్నాం. ఏడాది రూ. 10 వేల రైతు బంధు ఇస్తున్నాం. పేదింటి ఆడ‌బిడ్డ‌ల‌కు పెండ్లికి రూ. ల‌క్ష నూట‌ప‌ద‌హార్లు ఇస్తున్నాం. 24 గంటల ఉచిత‌ కరెంటు, కేసీఆర్ కిట్ ద్వారా రూ. 12 వేలు ఇంకా ఎన్నో చెప్పిన‌వి, చెప్ప‌నివి చేస్తున్నాం. రామలింగన్న 2500 ఇల్లు నిర్మించాడు. అవి కాలనీలుగా మీక‌ళ్ల‌ముందే గ్రామాల్లో ఉన్నాయి. ఇప్పుడు గుడిసెలు, గునా పెంకలు, ఖాళీ స్థలం ఉన్న మహిళలు ఇల్లు అడుగుతున్నారు. వాళ్లకు కూడా త్వరలోనే ఇల్లు మంజూరు చేస్తాం. లక్ష ఇల్లు నిర్మాణానికి తానే ఆర్థికమంత్రిగా నిధులు మంజూరు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. రూ. 25 వేల రుణ‌మాఫీ చేశాం. ఇంకా రూ. 25 నుండి రూ. లక్ష వరకు కూడా నాలుగు కిస్తీల చొప్పున మాఫీ చేస్తామ‌ని పేర్కొన్నారు. logo