శుక్రవారం 10 జూలై 2020
Telangana - Mar 25, 2020 , 00:54:35

డయల్‌ 100కి ఫోన్‌ చేయండి

డయల్‌ 100కి ఫోన్‌ చేయండి

  • ప్రభుత్వమే సహాయంచేస్తుంది
  • నేటినుంచి రాత్రి కర్ఫ్యూ.. పూర్తిగా అమలు
  • వైద్యులను, పోలీసులను కాపాడుకోవాలి
  • ప్రజలకు సీఎం కేసీఆర్‌ పిలుపు
  • మీడియాను ఆపొద్దని అధికారులకు ఆదేశాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం ఏడు నుంచి మరుసటి ఉదయం 6 గంటలవరకు పూర్తిస్థాయి కర్ఫ్యూ విధిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఒక్క మనిషి కూడా ఇల్లు వదిలి బయటకు రావొద్దని హెచ్చరించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఎట్‌ ఎనీ కాస్ట్‌. ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా 100కు ఫోన్‌ చేయండి. మీ ఇంటి దగ్గరికే వాహనం వస్తది మీకు సాయం చేస్తది. కానీ, మనిషి వీధిలోకి వస్తే చాలా కఠిన చర్యలుంటయ్‌. బతిమిలాడే పరిస్థితి ఉండదిక. నిన్నటిదాకా పోలీసులు దండాలు పెట్టి చెప్పిన్రు. ఇక దండాలు అందుకోవాల్సి ఉంటుంది. షాపులు సాయంత్రం ఆరుగంటల వరకే క్లోజ్‌ చేయాలి. ఏడు వరకూ ఉండకూడదు. ఆరుకే పూర్తిచేసుకొని ఏడు గంటల్లోపు ఇండ్లకుచేరాలి. 

ఆరు గంటల ఒక్క నిమిషానికి షాపు తెరిచి ఉంచినా షాపును క్లోజ్‌చేస్తాం. స్ట్రిక్ట్‌ యాక్షన్‌ తీసుకుంటాం. అనుమతించిన పనులు ఏమిటంటే.. గ్రామాల్లో వ్యవసాయం జరగాలి.. పాలు పితకాల్సిందే. పొలానికి నీళ్లు పెట్టేవారు పెట్టాల్సిందే. పండిన పంటను కోయాల్సినవాళ్లు కోయాల్సిందే. లేకపోతే ధాన్యం మన చేతికి రాదు. తిండిగింజలు లేకుండా అవుతుంది. కాబట్టి, గ్రామీణ ప్రాంతాల్లో జరగాల్సిన వ్యవసాయ పనులను ప్రభుత్వం అనుమతిస్తుంది. ప్రస్తుతం యాభై లక్షల ఎకరాల్లో పంటలున్నయ్‌. అదంతా వస్తేనే తిండిగింజలు దొరుకుతాయి. అవి కూడా గుంపులుగుంపులుగా  చేయకూడదు. నరేగా పనులు కొనసాగించవచ్చు. నీటిపారుదల ప్రాజెక్టు పనులు దూరంగా జరుగుతున్నాయి కాబట్టి వాటిని కొనసాగించవచ్చు. లేబర్‌ క్యాంపుల వద్ద హై శానిటైజేషన్‌కు చర్యలు తీసుకుని వారి ఆరోగ్యాన్ని కాపాడాలి. 

పల్లెలు కంచె వేసుకొన్నాయి

చాలా గ్రామాలు సరిహద్దుల్లో కంచెలు వేసుకొన్నాయి. మేం వేరే ఊరికి రాము.. మా ఊరికి వేరేవారు రావొద్దంటున్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ ప్రాంతాలు కంట్రోల్లోకి వచ్చినాయి. భగవంతుడి దయవల్ల ఇప్పటికి వ్యాధి కంట్రోల్లోనే ఉన్నది. మరీ ఎక్స్‌పాండ్‌ అవ్వడం లేదు. ఇయ్యాల లోకల్గా ట్రాన్స్‌మిట్‌ అయిన ఒక్క కేసు కూడా రాలేదు. ఇయ్యాల వచ్చినది కూడా ఫారిన్‌ కేసే. ఇప్పుడు కత్రా తలాయించింది. ఎయిర్‌పోర్టులు, రైళ్లు బందయినయి. రాత్రి నుంచి డొమెస్టిక్‌ ఫ్లైట్లు బందవుతయి. వేరే దేశం నుంచి, వేరే రాష్ట్రంనుంచి  జబ్బు వచ్చే అవకాశమే లేదు. మన వద్దకు ఫారిన్‌ రిటర్నుల ద్వారా చేరిన జబ్బు వ్యాప్తి కాకుండా కాపాడుకోవాలి. రాష్ట్రంలో కరోనా ఎక్కువమందిలో లేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. దీన్ని ఇట్లనే నియంత్రించగలిగితే తెలివికలోళ్లమవుతం. ప్రాణాల్ని కాపాడుకుంటాం. రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుంటాం.

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు మనుమరాలి పెండ్లికి నలభై వేల పెండ్లి పత్రికలను పంచినారు. ఈ సిట్యుయేషన్‌ని చూసి పెండ్లి వాయిదా వేసుకున్నారు. నేను ఆయన్ని అభినందిస్తున్నాను. జిల్లా కలెక్టర్లు, పోలీసుశాఖ, వైద్యశాఖ, మున్సిపల్‌, గ్రామాల్లో శానిటేషన్‌ విభాగం అద్భుతంగా పనిచేస్తున్నాయి. ప్రపంచమంతా పరేషాన్‌లో ఉన్నది కాబట్టి డాక్టర్లు ఎగ్జాస్ట్‌ కాకూడదు. దండంపెట్టినా నలుగురు డాక్టర్లు రారు. ఉన్న డాక్టర్లను కాపాడుకొంటూ వారు అలసట చెందకుండా ఆరోగ్యశాఖ మంత్రి, కార్యదర్శి చర్యలు తీసుకొంటున్నారు. పోలీసులు ఎగ్జాస్ట్‌ కాకూడదు. మెట్రోరైలు సేవల్లో ఉన్న పోలీసుల సేవలను వినియోగించుకుంటాం. ఉన్న ఫోర్సును డీజీపీ షిప్టులవారీగా డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. ఈ శాఖ ఎగ్జాస్ట్‌ అయితే మనల్ని కాపాడేవారు ఎవరూ ఉండరు. శాంతిభద్రతలను రక్షించేవారు ఎవరూ ఉండరు. కాబట్టి, వీళ్లను రక్షించుకోవాలి. 

మీడియాను ఆపొద్దు

నిన్న ఒకట్రెండుచోట్ల పోలీసులు, జర్నలిస్టులకు గొడవ జరిగినట్లు తెలిసింది. అది మంచిది కాదు. పోలీసులకు చెప్తున్నా. ప్రభుత్వమే జర్నలిస్టులకు అనుమతిచ్చింది. వాళ్లతో దురుసుగా ప్రవర్తించొద్దు. డీజీపీకి ఆదేశాలు జారీచేసినం. డీజీపీ కూడా పోలీసులకు ఆదేశాలిస్తరు. జర్నలిస్టులు అపార్థం చేసుకోవద్దు. ఉద్దేశపూర్వకంగా ఎవరూ అట్లచేయరు. ప్రభుత్వమే జర్నలిస్టులకు అనుమతిస్తూ కచ్చితమైన ఆదేశాలు జారీచేసింది. మీడియా ద్వారా ప్రజలకు వార్తలు పోవాలి. నేను చెప్పే మాటలు ప్రజలకు పోవాలన్నా మీడియా కావాలి. ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు చెప్పే విషయాలు ప్రజలకు పోవాలంటే మీడియా ఫ్రీగా తిరగాలి. వాళ్లు ఎక్కువమంది కూడా పోరు. మనం పిలిస్తే తప్ప గుంపులుగా రారు. పోలీసులు సంయమనం పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో మీడియా పట్ల ఘర్షణ వైఖరిగానీ, ఆపే పరిస్థితిగానీ ఉండొద్దు. ఈ ఆపత్కాల పరిస్థితుల్లో మీడియా కూడా దానిని పెద్దగా చేయొద్దని మనవిచేస్తున్నా. ఎక్కడైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటే డీజీపీ తప్పకుండా చర్యలు తీసుకుంటరు. మినహాయింపు జాబితాలో మీడియా ఉంది. వాళ్లు వార్తలు సేకరిస్తరు, మన కోసమే, సమాజం కోసమే పనిచేస్తరు. అందుకే వారిని ఫ్రీగా వదలండి. వారి పట్ల పోలీసులెవరూ దురుసుగా ప్రవర్తించొద్దు. 

మనల్ని మనమే నిర్బంధించుకుందాం

కరోనా విషయంలో రష్యా అద్భుతంగా దేశాన్ని కాపాడుకుంటున్నది. రష్యా అధ్యక్షుడు వాళ్ల ప్రజలకు ఒక్కమాటే చెప్పిండు... దర్జాగా కాలు మీద కాలేసుకుని ఇంట్లో ఉండాలంటే ఉంటలేరు... వీధుల్లోకి వస్తున్నరు. బయటికొస్తే ఐదేండ్లు జైల్లో పెడుతమని చెప్పిండు. ఇంట్లో ఉండదలుచుకున్నరా.. ఐదేండ్లు జైల్లో ఉండదలుచుకున్నరా... ఏదో ఒక నిర్ణయం తీసుకోండి, అది మీ చాయిస్‌ అని చెప్పడంతో అంతా బంద్‌ అయింది. తెలంగాణ బిడ్డగా ప్రజలందరికీ రెండు చేతులు జోడించి చెప్తున్నా. ఇది ఎవరి కోసమో కాదు. ఎవరో మిమ్మల్ని నిర్బంధించడం కాదు. మనల్ని మనమే నిర్బంధించుకోవాలి. మన కోసం.. మన బతుకు కోసం.. మన పిల్లల కోసం.. మన రాష్ట్రం కోసం కచ్చితంగా ఉన్నతాధికారులు చెప్పేది పాటించాలి. సీఎస్‌, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులకు నిద్రలు ఉంటలేవు. టైం టు టైం చూస్తున్నరు. సివిల్‌ సప్లయ్‌, బ్లాక్‌మార్కెట్‌, ఎవరేం చేస్తున్నరనేది ప్రతీ క్షణం పర్యవేక్షిస్తున్నరు. వాళ్లకు ఆ టైం సరిపోతలేదు. ప్రజాప్రతినిధులు పౌరబాధ్యత నిర్వర్తించాలి. బ్లాక్‌ మార్కె ట్లు నడవకుండా చూడాలి. ప్రజలకు నిత్యావసర వస్తువులు మంచిగా అందాలి. మీ పరిధిలో చేయాల్సిన బాధ్యతను నిర్వర్తించాలి. రాష్ర్టాన్ని ఈ మహమ్మారి నుంచి కాపాడటంతో విజయం సాధించాలి.

వినకపోతే పెట్రోల్‌ బంద్‌ పెడ్తం

ప్రజలను మేం ఆపలేకపోతే ఏం చేస్తాం? పెట్రోల్‌ పోయడాన్ని బంద్‌చేస్తం. మనమీబాధ తెచ్చుకోవద్దు. ఇక ఆగుతలేరు, మనం కంట్రోల్‌ చేయలేకపోతున్నామంటే పెట్రోల్‌ బంకులను కూడా క్లోజ్‌ చేయాల్సివస్తది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇదంతా ఇష్టమా? సంతోషమా? చాలా దుఃఖం కదా మాక్కూడా. రోజు కొన్ని వందల కోట్ల రూపాయల ఆదాయం పోతాఉన్నది. ఎకనామిక్‌గా కూడా చాలా కష్టం వస్తున్నది. వాటన్నింటినీ దిగమింగుకుంటూ, భరిస్తూ ప్రజల క్షేమాన్ని కోరుకుంటూ ఇయ్యాల ఆదేశాలిచ్చినాం. ఆరోగ్యశాఖకు ఎట్టి పరిస్థితుల్లో నిధుల కొరత రావొద్దని సీఎస్‌కు ఆదేశాలిచ్చినం. టెస్టింగ్‌ కిట్లు కానీ మాస్కులు కానీ మరొకటి కానీ మరేదైనా మిగతా వాటికి ఆపి, ఆరోగ్యశాఖకు టాప్‌ ప్రయార్టీలో నిధులివ్వాలని చెప్పినం. పోలీసులకూ అవసరమైన నిధులు సమకూర్చాలని చెప్పినం. కొన్ని బంద్‌ చేసైనా నిధుల్ని తీసుకోవాలె. 


logo