మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 06, 2020 , 21:07:24

ధర్మపురిలో నృసింహుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ధర్మపురిలో నృసింహుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ధర్మపురి,  : హరిహర క్షేత్రమైన ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామివారి స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం వేళలో మంగళవాయిద్యాలు వెంటరాగా దేవస్థానం ఈవో సంకటాల శ్రీనివాస్‌, సిబ్బంది కలిసి యాజ్ఙాచార్యులు కందాళై పురుషోత్తమాచార్యుల ఇంటికి మంగళవాయిద్యాలతో వెళ్లి స్వామివారి ఉత్సవాలు నిర్వహించేందుకు సంప్రదాయ రీతిలో ఆహ్వానించారు. అనంతరం ఆయనను మేళతాళాల మధ్య ఆలయానికి తీసుకువచ్చారు. సంప్రదాయం ప్రకారం ఆలయం పక్షాన  అర్చకులకు ఈవో దీక్షావస్ర్తాలు సమర్పించారు. అనంతరం స్థానిక ఆలయంలో వేద పండితులు బొజ్జ రమేశ్‌శర్మ, పురోహితులు బొజ్జ సంతోష్‌కుమార్‌శర్మ తదితరుల మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు నేరెల్ల శ్రీనివాసాచార్యులు, నంబి శ్రీనివాస్‌, నరసింహమూర్తి, రమణాచార్యలు కళశ, విశ్వక్సేన వాసుదేవ, పుణ్యహవచనం, బ్రహ్మకలశ స్థాపన, అంకురార్పణ, వరాహతీర్థం తదితర పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవమూర్తులకు రక్షాబంధనం చేసి నాందీముఖం, ఇదహవచనం చేసి బ్రహ్మోత్సవాల కోసం దేవతలందరినీ ఆహ్వానించి మాతృక పూజలు నిర్వహించారు. 


కన్నుల పండువగా పుట్ట బంగారం తెచ్చే కార్యక్రమం

బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం 7గంటలకు లక్ష్మీనరసింహ స్వామి(యోగ,ఉగ్ర), వేంకటేశ్వరస్వామివారల ఉత్సవ మూర్తులను సేవలపై ఉంచి వరాహతీర్థం, పుట్టబంగారం కోసం తీసుకువెళ్లారు. చింతామణి చెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్దకు ఊరేగింపుగా వచ్చి సేవలను ఉంచి యాజ్ఙాచార్యులు పురుషోత్తమాచార్యుల మంత్రోచ్ఛారణల మధ్య పండితులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు..అనంతరం అక్కడే మట్టిని తవ్వి ఆలయాలకు పుట్టబంగారం తీసుకువచ్చారు. స్వామివారల సేవలను తిరిగి ఆలయాలకు తీసుకురాగా దారి పొడవునా మహిళలు మంగళహారతులు పట్టారు. రాత్రి వరకూ కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజల అనంతరం భక్తులు పోటీపడి పుట్టబంగారాన్ని సేకరించి ఇంటికి తీసుకెళ్లారు. ఈ పుట్టబంగారాన్ని పంటపొలాల్లో చల్లితే పంటలు సమృద్ధిగా పండుతాయని భక్తుల నమ్మకం. నేడు నిర్వహించనున్న స్వామివారి కల్యాణానికి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా డీసీఎమ్మెస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి-వెన్నెల దంపతులు స్వామివారలకు పట్టువస్ర్తాలు, తలంబ్రాలు ముందస్తుగా సమర్పించారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం 6గంటలకు గోధూళి సుముహూర్తాన లక్ష్మీనరసింహస్వామి వారల (ఉగ్ర, యోగ) కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 

 logo