శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 02:11:01

ధరణీ.. ధన్యోస్మి

ధరణీ.. ధన్యోస్మి

  • అక్రమాల్లేవ్‌.. అవకతవకల్లేవ్‌
  • పహాణి, పాస్‌బుక్‌లో సమూల మార్పులు
  • క్షణాల్లోనే అప్‌డేట్‌ అవుతున్న సమాచారం
  • అమ్మకందారు, కొనుగోలుదార్లకు పూర్తి భరోసా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఒకప్పుడు అభద్రత.. ఇప్పుడు పూర్తి భద్రత, ఒకప్పుడు ప్రతీది లోగుట్టు.. ఇప్పుడు ప్రతీది బహిర్గతం, ఒకప్పుడు రికార్డుల్లో అవకతవకలు.. ఇప్పుడు రికార్డులన్నీ ఆన్‌లైన్‌. అంతా ‘ధరణి’మయమే. ధరణితో అమ్మకందారులు, కొనుగోలుదారులు సహా భూ యజమానులంతా గుండెలపై చేయి వేసుకొని నిశ్చింతగా నిద్రపోతున్నారు. అప్పట్లో రెవెన్యూ అధికారులకు ఉన్న విచక్షణాధికారాలు, రికార్డుల తారుమారుకు ఉన్న అవకాశాలన్నీ ఇప్పుడు మూసుకుపోయాయి. అవకతవకలకు ఏమాత్రం అవకాశం లేకుండా, పూర్తి పారదర్శకంగా ఉండటంతో ధరణి పోర్టల్‌ పనితీరును రాష్ట్రంలోని రైతాంగంతోపాటు, అధికారులు కూడా వేనోళ్ల పొగుడుతున్నారు. గతంలో కిందిస్థాయి సిబ్బంది చేతివాటం, అవినీతి, అక్రమాలు, లంచగొండితనం వల్ల రెవెన్యూ శాఖ అపవాదును ఎదుర్కోవాల్సి వచ్చేదని, ఇప్పుడు అలాంటి అవకాశాలు లేకపోవటంతో నిజాయితీగా, పారదర్శకంగా పనిచేస్తూ ప్రజల మన్ననలు అందుకొనే వాతావరణం ఏర్పడిందని అధికారులు ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు.

ఎప్పుడూ అభద్రతా భావమే

ఒకప్పుడు కష్టాలు, నష్టాలు దాటుకొని రిజిస్ట్రేషన్‌ తతంగాన్ని పూర్తిచేసుకొని, ఖర్చులు పెట్టుకొని, పైరవీలు పట్టుకొని రెవెన్యూ ఆఫీసుకు చేరుకున్న రైతుకు అడ్డంకులే ఎదురయ్యేవి. మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకొన్నప్పటి నుంచి పట్టాదార్‌ పాస్‌బుక్‌ చేతికి వచ్చే వరకు పైరవీలు, పైసలు.. దండాలు, దావత్‌లే రాజ్యమేలేవి. పోనీ పట్టాదార్‌ పాస్‌బుక్‌ చేతికి వచ్చినంక కూడా రైతు భరోసాతో ఉండేవాడా.. అంటే అదీలేదు. ఎప్పుడేం జరుగుతుందోననే అభద్రతా భావం ఎల్లప్పుడూ ఉండేది. రికార్డులు ఎప్పుడు, ఎలా మారుతాయోననే ఆందోళన కనిపిస్తూ ఉండేది.

పహాణి నుంచి మొదలుకొని..

గ్రామాల్లో ఉండే వీఆర్వోల చేతుల్లో పహాణీలు ఉండటంతో ప్రలోభాలు, ఒత్తిళ్లు, పైరవీలు, బెదిరింపులు, డబ్బు, రాజకీయం అనేవి ఎక్కువగా ప్రభావం చూపేవి. పట్టాదార్‌పాస్‌బుక్‌ల్లోనూ అవకతవకలు జరిగేవి. రైతుల పేర్లు మార్చడం, ఉన్న భూముల విస్తీర్ణం మార్చడం, సర్వే నంబర్లు మార్చడం జరిగేవి. రెవెన్యూ అధికారుల చేతుల్లో విచక్షణాధికారం ఉండటంతో ఆడింది ఆట.. పాడింది పాటగా సాగింది. నకిలీ పట్టాదార్‌పాసు పుస్తకాలకు కొదవే లేదు. పుట్టల్లోని చీమల్లా పుట్టుకొచ్చేవి. కిందిస్థాయి రెవెన్యూ ఉద్యోగులు వీటిని తయారుచేస్తే ఎమ్మార్వోలు గుడ్డిగా సంతకాలు చేసేవారు. ఇలాంటివే ఎక్కువగా భూ వివాదాలకు దారితీశాయి. పట్టాదార్‌పాస్‌బుక్‌తోపాటు టైటిల్‌డీడ్‌ (టీడీ) అనేది కూడా ఒక ముఖ్యమైన డాక్యుమెంటే. దీన్ని ఆర్డీవో ఇచ్చినప్పటికీ ఇందులోని సమాచారాన్ని తారుమారుచేసే అవకాశం కూడా కొంత ఉండేది. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మండల స్థాయిలోని రెవెన్యూ అధికారులు, సిబ్బంది తప్పుడు నివేదికలను సృష్టించేవారు. వాటి ఆధారంగా ఆర్డీవో సంతకం చేయాల్సి వచ్చేది. కొన్నిసార్లు ఆర్డీవో కార్యాలయం కూడా ఇలాంటి అవకతవకలకు కేంద్రంగా కనిపిస్తూ ఉండేది.

టాంపరింగ్‌ లేదు.. తండ్లాట లేదు

ధరణి రావడంతో నకిలీకి కాలం చెల్లింది. పహాణీలు ఆన్‌లైన్‌లోనే ఉంటున్నాయి. వీటిని రైతులు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. పట్టాదార్‌పాస్‌బుక్‌లు పూర్తి సాంకేతికతో ఎవరూ టాంపరింగ్‌ చేయని విధంగా తయారుచేశారు. రిజిస్ట్రేషన్‌ చేసిన వెంటనే మ్యుటేషన్‌ చేసి అందుకు సంబంధించిన పత్రాలన్నీ కొనుగోలుదారునికి, అమ్మకందారునికి అందిస్తూ పాస్‌బుక్‌లను అప్‌డేట్‌ చేస్తున్నారు. దీంతో రికార్డులను తారుమారు చేసే అవకాశం లేకుండా పోయింది. క్రయవిక్రయాల తతంగమంతా ఆన్‌లైన్‌లోనే నిర్వహించేలా ధరణిని తీర్చిదిద్దడంతో రైతు నిశ్చింతగా ఉంటున్నాడు.

రోజుకు 8.4 లక్షల వ్యూస్‌ 

ధరణికి ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తున్నది. పోర్టల్‌ను ప్రారంభించి ఇప్పటికి 12 రోజులైంది. సాంకేతిక సమస్యలన్నింటినీ పూర్తి చేసుకొని ఈ నెల 1 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాగా, సోమవారం సాయంత్రం నాటికి పోర్టల్‌ను 75.70 లక్షల మంది సందర్శించారు. అంటే ఈ 9 రోజుల్లో సగటున రోజుకు 8.4 లక్షల మంది ధరణి పోర్టల్‌ను వీక్షించారన్నమాట. అటు.. రోజుకు 5 వేల మంది లాగిన్‌ అయ్యారు. మొత్తంగా 44,393 మంది సైట్‌లో లాగిన్‌ అయ్యారు. 

దళారీ వ్యవస్థకు తావులేదు 

ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చి దళారీ వ్యవస్థకు చెక్‌ పెట్టింది. బ్రోకర్లను ఆశ్రయించకుండా సులభంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తిచేసే సౌలభ్యం కల్పించింది. 30 నిమిషాల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతున్నది. ఇంత సులభమైన అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు, రెవెన్యూ అధికారులకు కృతజ్ఞతలు. 

- వేముల సాయికిరణ్‌, దక్షిణాఫ్రికా

ఎన్నారైలకు వరం 

ధరణి పోర్టల్‌ ఎన్నారైలకు ఒక వరం వంటిది. గతంలో సెలవుపై సొంతూరుకు వెళ్లినప్పుడు రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌కు సమయం సరిపోయేది కాదు. ముఖ్యంగా గల్ఫ్‌లో ఉన్నవాళ్లమంతా రెండు, మూడేండ్లకు ఒకసారి వచ్చి పనికాకపోవటంతో నిరాశగా తిరిగి వెళ్లేవాళ్లం. ధరణి పోర్టల్‌తో మా పని సులువు అవుతుంది. అనుకున్న సమయానికి పనులు చకచకా పూర్తవుతాయి.

- శంకర్‌ సుందరగిరి, ఖతార్‌

ఆత్మసంతృప్తి కలుగుతున్నది

ధరణితో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ఒకే చోట పూర్తవుతుండటం ఇప్పటికీ కొందరు నమ్మలేకపోతున్నారు. మేడమ్‌.. ఇంకో ఆఫీస్‌కు పోవాల్సిన పనిలేదా? అని అడుగుతున్నారు. గతంలో రిజిస్ట్రేషన్‌ తర్వాత మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలనే విషయం చాలా మందికి తెలియదు. దీంతో డబుల్‌ రిజిస్ట్రేషన్‌ వంటి సమస్యలు వచ్చేవి. మా దగ్గరికి వచ్చి బాధపడేవారు. ఆ సమయంలో మేము నిస్సహాయలుగా ఉండేవాళ్లం. ఇప్పుడు ధరణితో రైతులకు సమగ్రంగా హక్కుపత్రాలు ఇస్తుండటంతో, ఇబ్బందులు లేకుండా పని పూర్తి చేశానన్న ఆత్మసంతృప్తి కలుగుతున్నది.

- శ్రీదేవి, తాసిల్దార్‌, తూప్రాన్‌, మెదక్‌ జిల్లా 

రైతులు ఆనందంగా ఉన్నారు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న ధరణి పోర్టల్‌ సేవలు చాలా బాగున్నాయి. రైతుల భూములు తక్కువ సమయంలో రిజిస్ట్రేషన్‌ అవుతున్నాయి. ఈ విధానం సులభతరంగా ఉన్నది. దీంతో ధరణి పోర్టల్‌ ద్వారా సేవలు వినియోగించుకొనేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులు స్లాట్‌ బుక్‌ చేసుకొంటున్నారు. త్వరగా రిజిస్ట్రేషన్లు అవుతుండటంతో రైతులు ఆనందంగా కనిపిస్తున్నారు. అన్నదాతలకు ఇలాంటి సేవలు అందించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా.

-రమాదేవి, తాసిల్దార్‌ అండ్‌ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌, పెనుబల్లి, ఖమ్మం  జిల్లా

ఇంత ఈజీ అనుకోలేదు

భూమి రిజిస్ట్రేషన్‌ విధానం ఇంత ఈజీగా ఉంటుందని అనుకోలేదు. మీసేవలో స్లాట్‌ బుక్‌ చేసుకున్నా. మరుసటి రోజు నిర్ణీత సమయానికి తాసిల్దార్‌ ఆఫీస్‌కు వెళ్లా. అప్పటికే సిద్ధంగా ఉన్న తాసిల్దార్‌ మా డాక్యుమెంట్లు పరిశీలించి వెంటనే ప్రక్రియను పూర్తి చేశారు. పావుగంటలో కొత్త ఈ-పాస్‌బుక్‌ చేతిలో పెట్టారు. పాస్‌బుక్‌ రావడంతో మనసుకు ఎంతో ఊరట కలిగింది. గతంలో ఇదే పని కోసం కొత్తగూడెం సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ చుట్టూ రోజుల తరబడి తిరుగాల్సి వచ్చేది. 

-పీ శశికళ, మహిళా రైతు, అశ్వారావుపేట

అప్పుడు ఖర్చులు..కాలయాపనే

తాసిల్దార్‌ ఆఫీస్‌లో ‘ధరణి’ పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నా. 15 నిమిషాల్లోనే ప్రక్రియ మొత్తం పూర్తయింది. పాస్‌పుస్తకం కూడా జారీ అయింది. గతంలో సబ్‌ రిజిస్ట్రార్‌, తాసిల్దార్‌ ఆఫీసుల చుట్టూ తిరుగాల్సి వచ్చేది. ఖర్చుతోపాటు కాలయాపన కూడా ఎక్కువగా ఉండేది. కానీ, ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ అంటే ఇంత సులభమా? అనేలా ఉన్నది. 

-దూబగుండ్ల దుర్గారావు, రైతు, అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

సుట్ట తాగినంత టైం సుత పట్టలే

మా ఊర్లే సభావత్‌ సంధ్య ఓ ఆసామి దగ్గర 29 గుంటల భూమి కొన్నది. ధరణి పోర్టల్‌ల స్లాట్‌ బుక్‌చేసుకుని నన్ను సాక్షి సంతకానికి రమ్మంటే వచ్చిన. గతంల ములుగుల భూమి రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి నా తోటి రైతులు ఆఫీసుల చుట్టు చెప్పులరిగేదాక తిరిగేటోళ్లు. మా ఊరి నుంచి భూమి రిజిస్ట్రేషన్‌ కోసం ములుగుకు పొద్దుగాల 5 గంటలకు వచ్చే బస్సెక్కి 70 కిలోమీటర్ల దూరం పోవాలి. దూరం ఎక్కువని ఒక్కోసారి పోకుండ తప్పించుకునేటోన్ని. మొన్న మహాముత్తారం తాసిల్‌ ఆఫీసుల భూమి రిజిస్ట్రేషన్‌కు సుట్టతాగినంత టైం సుత పట్టలే. నేను సాక్షి సంతకం పెట్టి ఇంటికి వచ్చి పొలానికి పోయిన. 

 -ఎలగొండ మహేశ్‌, నిమ్మగూడెం, మహాముత్తారం మండలం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా