గురువారం 26 నవంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 02:15:16

కేసీఆర్‌ ఆలోచన అద్భుతం

కేసీఆర్‌ ఆలోచన అద్భుతం

  • ధరణి విజయం తథ్యం 
  • మాజీ ఉన్నతాధికారుల అభినందనలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘ధరణి’పై ప్రశంసలు కురుస్తున్నాయి. అన్నివర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం కేసీఆర్‌ ఆలోచన.. అది రూపుదాల్చేవరకు చేసిన కృషి అద్భుతమని మాజీ ఉన్నతాధికారులు కొనియాడుతున్నారు. ఇది ప్రజా పోర్టల్‌ అని అభివర్ణిస్తున్నారు. ఎక్కడా దళారి వ్యవస్థకు అవకాశం లేకుండా ప్రతి అంచెలోనూ ప్రజలకు సౌలభ్యంగా ఉండేలా ధరణిని రూపొందించారని అభిప్రాయపడుతున్నారు. ‘ధరణి అంటే ఓ సాఫ్ట్‌వేర్‌ మాత్రమే అనుకుంటే అది ఒక వస్తువుగా మాత్రమే మిగిలిపోతుంది. కానీ సీఎం కేసీఆర్‌ ధరణిని ప్రజల సమస్యలకు పరిష్కారంగా భావించారు. అందుకే మనసుపెట్టి ఆలోచించారు. వివిధ హోదాల్లోని అధికారులతో మేధోమథనం చేశారు. వందల సమావేశాలు నిర్వహించారు. రిటైర్డ్‌ అధికారులతోనూ భేటీ అయ్యారు. ఆచరణలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు సమాధానం ఉండేలా జాగ్రత్తపడ్డారు.

ఫలితంగా ఒక గొప్ప పోర్టల్‌ అందుబాటులోకి వచ్చింది. ఆచరణలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వెళ్తే ధరణి 100 శాతం సక్సెస్‌ అవుతుంది’ అని రిటైర్డ్‌ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ మధుసూదన్‌ పేర్కొన్నారు. ‘ఎలాంటి అవినీతికి తావులేకుండా, భూ లావాదేవీలు, భూముల నిర్వహణ మొత్తం ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు ఒక వేదికను ఏర్పాటుచేయడం ఉత్తమ ఆలోచన’ అని రెవెన్యూ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు లక్ష్మయ్య ప్రశంసించారు. ‘భూ రిజిస్ట్రేషన్‌ అంటేనే ఓ బ్రహ్మపదార్థం అని కొందరి భావన. అందుకే దళారులను ఆశ్రయిస్తుంటారు. ధరణితో ఇంట్లోనే కూర్చొని, మనమే స్వయంగా వివరాలన్నీ నమోదుచేస్తాం. కాబట్టి ప్రతి అంశం మనకు తెలిసే జరుగుతుంది. అవినీతికి చెక్‌ పడుతుంది’ అని ఓ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి వ్యాఖ్యానించారు.