బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 03:01:50

సమస్తం ధరణిమయం

సమస్తం ధరణిమయం

  • స్లాట్‌ బుకింగ్‌ నుంచి పాస్‌ పుస్తకాల దాకా
  • పోర్టల్‌లోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్‌ జారీ
  • రిజిస్ట్రేషన్‌ మార్కెట్‌ విలువల్లో పెంపుదల లేదు 
  • పూర్తి పారదర్శకంగా నేడు ప్రజాసేవలోకి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో భూ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి దాదాపు 51 రోజులు గడిచింది. పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు రిజిస్ట్రేషన్‌శాఖకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. వ్యవసాయ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లన్నీ పోర్టల్‌లోనే పూర్తిచేసేలా చర్యలు తీసుకున్నది. ధరణిపై పలు సందేహాలకు ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం..

స్లాట్‌ బుక్‌ చేసుకోవడానికి ఎవరిని సంప్రదించాలి?

  • రిజిస్ట్రేషన్‌, పార్టిషన్‌ చేసుకోవాలనుకునేవారు ముందుగా ధరణి పోర్టల్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. ఇందుకోసం ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదు. https://dharani.telangana.gov.in పోర్టల్‌ ఓపెన్‌ చేయగానే అగ్రికల్చర్‌ ప్రాపర్టీస్‌, నాన్‌ అగ్రికల్చర్‌ ప్రాపర్టీస్‌ అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో ఒకటి ఎంపిక చేసుకున్నాక స్లాట్‌ బుకింగ్‌ అనే ఆప్షన్‌ వస్తుంది. అందులో ఫోన్‌ నంబరు, పాస్‌వర్డ్‌ నమోదు చేసుకున్నాక జనరేట్‌ ఓటీపీని క్లిక్‌ చేయాలి. ఫోన్‌ నంబరుకు వచ్చిన ఓటీపీని అందులో నమోదు చేయగానే దరఖాస్తు ఓపెన్‌ అవుతుంది. రిజిస్ట్రేషన్‌/పార్టిషన్‌/సక్సేషన్‌ దరఖాస్తును ఎంపిక చేసుకొని పట్టాదారు పాస్‌బుక్‌ నంబరు నమోదు చేయాలి. ఏ సర్వే నంబరులో భూమిని అమ్ముతున్నారో సెలెక్ట్‌ చేసుకొని ప్రొసీడ్‌ అని క్లిక్‌ చేయాలి. తర్వాత విక్రయదారు, అమ్మకందార్ల వివరాలు, కుటుంబసభ్యుల వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్‌కు అవసరమైన చార్జీలు చెల్లించాలి. ఆ తర్వాత స్లాట్‌ ఎంపిక చేసుకోవటంతో స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియ పూర్తవుతుంది.
  • స్లాట్‌ బుక్‌ చేసుకున్న సమయానికి వెళ్లలేకపోతే ముందుగానే వాయిదా వేసుకోవాలి. స్లాట్‌ రీషెడ్యూల్‌ అనే ఆప్షన్‌ ద్వారా మరోరోజుకు వాయిదా వేసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్‌ కోసం ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం?

రిజిస్ట్రేషన్‌ కోసం డాక్యుమెంట్లు తప్పనిసరి. స్లాట్‌ బుకింగ్‌ పూర్తికాగానే పోర్టల్‌లోనే అడ్వైజరీ కాలమ్‌ వస్తుంది. కొనుగోలుదారు, విక్రయదారు వెంట తెచ్చుకోవాల్సిన డాక్యుమెంట్లు ఇందులో కనిపిస్తాయి. 

ఏ డాక్యుమెంట్లు అవసరం అంటే: -అమ్మకందారు పాస్‌బుక్‌, కొనుగోలుదారు పాస్‌బుక్‌, రిజిస్ట్రేషన్‌ చేయాల్సిన ఒరిజినల్‌ డాక్యుమెంట్‌, ఒరిజినల్‌ ఈ-స్టాంపులు, ఈ-చాలన్‌, ఇద్దరి పాన్‌కార్డులు (లేకపోతే ఫామ్‌ 61), ఇద్దరి ఆధార్‌కార్డులతో పాటు ఇద్దరు సాక్షుల ఆధార్‌కార్డులు.

ధరణి ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది?

రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం సులభం అవుతుంది. రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన, గంటల తరబడి లైన్‌లో నిలబడాల్సిన బాధ తప్పుతుంది. స్లాట్‌ బుక్‌ చేసుకున్న రోజు మీకిచ్చిన సమయానికి కార్యాలయానికి వెళ్తే సరిపోతుంది. ఎక్కడా మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. ముఖ్యంగా ఎవరి చేతులు తడపకుండా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. స్లాట్‌ బుక్‌ అయ్యింది అంటే ఆ సమయానికి రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయడం తప్ప అడ్డుకునే అధికారం ఎవరికీ లేదు.

గ్రామాలు, పట్టణాల్లో మార్కెట్‌ విలువ తేడా ఏంటి?

ప్రతి గ్రామానికి ఓ బేసిక్‌ మార్కెట్‌ విలువను ధరణిలో కేటాయించారు. ఉదాహరణకు ఓ గ్రామాన్ని తీసుకుంటే అక్కడ ఎకరం భూమికి బేసిక్‌ వ్యాల్యూ రూ.1లక్షగా నిర్ధారిస్తే, ఆ గ్రామంలో ఎక్కడికి వెళ్లినా ఎకరం మార్కెట్‌ విలువ రూ.1లక్షకుపైనే ఉంటుంది. పట్టణాల్లో అయితే వార్డులు, బ్లాకుల వారీగా బేసిక్‌ మార్కెట్‌ విలువను కేటాయించారు. గ్రామం మొత్తానికి ఒకే బేసిక్‌ విలువ ఉంటే, పట్టణాల్లో మాత్రం వార్డులు, బ్లాకుల వారీగా అది మారుతుంది.

భూమి కొనాలనుకునే వారికి గతంలో పాస్‌బుక్‌ లేకపోతే ఎలా?

కొనుగోలుదారుకు పాస్‌బుక్‌ లేకపోయినా ఫర్వాలేదు. ఒకవేళ అంతకుముందే పాస్‌బుక్‌ ఉంటే అందులోనే ఇప్పుడు కొనుగోలు చేసిన ఆస్తి వివరాలు నమోదు చేసిస్తారు. లేనివారికైతే కొత్త పాస్‌బుక్‌ ప్రింట్‌ చేసిస్తారు. రిజిస్ట్రేషన్‌కు కొనుగోలుదారు పాస్‌బుక్‌ తప్పనిసరిగా ఉండాలనే నిబంధన లేదు.

రిజిస్ట్రేషన్‌ చార్జీలను మ్యానువల్‌గా కట్టాలా, ఆన్‌లైన్‌లో చెల్లించాలా?

స్లాట్‌ బుకింగ్‌ సమయంలోనే రిజిస్ట్రేషన్‌/పార్టిషన్‌/సక్సెషన్‌కు ఈ-చాలన్‌ ద్వారా చార్జీలు చెల్లించాలి. ఆ వెసులుబాటు లేనివారైతే బ్యాంకుకు వెళ్లి డీడీ తీసి, ఆ నంబరును పోర్టల్‌లో ఎంటర్‌ చేసి స్లాట్‌బుక్‌ చేసుకోవచ్చు. ఎవరికీ రూపాయి ఇవ్వాల్సిన పని లేదు.

రిజిస్ట్రేషన్‌ మార్కెట్‌ విలువ, స్లాబ్‌లు పెరుగుతాయా?

భూ రిజిస్ట్రేషన్‌ మార్కెట్‌ విలువ, స్లాబ్‌లలో ఎలాంటి మార్పు ఉండదు. గతంలో ఉన్న మార్కెట్‌ విలువే కొనసాగనున్నది. గతంలో ఉన్న మార్కెట్‌ విలువలనే ధరణి పోర్టల్‌లో స్థిరీకరించారు. అంతేగానీ పెంచలేదు. ఈ విషయంలో ప్రజలు అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.

స్టాంప్‌ ఫీజులు, రిజిస్ట్రేషన్‌ చార్జీలు ఎంత వసూలు చేస్తారు?

భూమి మొత్తం మార్కెట్‌ విలువలో 4 శాతం స్టాంపు డ్యూటీ, 1.5 శాతం ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ, 0.5 శాతం రిజిస్ట్రేషన్‌ ఫీజు, పట్టాదారు పాస్‌పుస్తకాలకు కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

మార్కెట్‌ వ్యాల్యూ ఎంత ఉందో తెలుసుకోవడం ఎలా?

ధరణి పోర్టల్‌లో ‘వ్యూ మార్కెట్‌ వ్యాల్యూ ఆఫ్‌ ల్యాండ్స్‌ ఫర్‌ స్టాంప్‌ డ్యూటీ’ అనే ఆప్షన్‌ ఉంటుంది. అది ఎంపిక చేసుకొని జిల్లా, మండలం, గ్రామ, సర్వే నంబర్‌ వివరాలను నమోదు చేస్తే ఆ గ్రామంలో బేసిక్‌ మార్కెట్‌ విలువ ఎంత, మీరు ఎంపిక చేసుకున్న సర్వే నంబర్‌లోని భూమి మార్కెట్‌ విలువ ఎంత అనేది చూపిస్తుంది. దాని ప్రకారం రిజిస్ట్రేషన్‌ చార్జీలు చెల్లిస్తే సరిపోతుంది.