ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Oct 28, 2020 , 01:52:21

ధరణికి రేపే శ్రీకారం

ధరణికి రేపే శ్రీకారం

  • సీఎం చేతుల మీదుగా రేపే ప్రారంభం
  • ధరణి వేదిక.. మూడుచింతలపల్లి
  • పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌
  • ఆధార్‌ నంబర్‌తోనే అన్ని వివరాలు
  • పెరిగిన రెవెన్యూ అధికారుల హోదా
  • అందరికీ పదోన్నతులు కల్పిస్తాం
  • త్వరలో రెవెన్యూశాఖ పునర్వ్యవస్థీకరణ
  • తాసిల్దార్లకు శిక్షణ కార్యక్రమంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

మేడ్చల్‌, హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ధరణి పోర్టల్‌ ప్రారంభోత్సవానికి వేదిక ఖరారైంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దత్తత తీసుకున్న మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి ఈ మహత్తర కార్యక్రమానికి వేదికగా నిలవనున్నది. అక్కడి తాసిల్దార్‌ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం కేసీఆర్‌ పోర్టల్‌ను ప్రారంభిస్తారు. అనంతరం జర్నలిస్టులతో కలిసి లంచ్‌ చేస్తారు. ఆ తర్వాత మూడుచింతలపల్లి శివారులో ఏర్పాటుచేయనున్న బహిరంగసభలో పాల్గొని ప్రజలకు  పోర్టల్‌కు సంబంధించిన సందేశాన్ని ఇస్తారని అధికారులు తెలిపారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా అన్నింటినీ పరిశీలించారు. అంతకుముందు ధరణి పోర్టల్‌ నిర్వహణపై తాసిల్దార్లు, నాయబ్‌ తాసిల్దార్లు, ధరణి ఆపరేటర్లకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్లకు సీఎస్‌ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ధరణి నిర్వహణను వివరించారు.

స్లాట్‌బుకింగ్‌, సిటిజన్‌ పోర్టల్‌, సేల్‌, సక్సేషన్‌, పార్టిషన్‌ అంశాలపై మాట్లాడారు. ధరణి పోర్టల్‌లో స్లాట్‌ బుక్‌ అయ్యాక నిర్దేశిత సమయానికి తాసిల్దార్‌ కార్యాలయానికి వెళ్తే పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తవుతుందని సీఎస్‌ తెలిపారు. ధరణి దేశంలోనే ట్రెండ్‌సెట్టర్‌గా నిలుస్తుందని చెప్పారు. ధరణి ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా, పారదర్శకంగా, వేగంగా సేవలు అందించాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. రిజిస్ట్రేషన్లలో మోసాలు జరుగకుండా అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌చేస్తే భూ యజమాని ఫొటోతో సహా అన్ని వివరాలు ధరణిలో ప్రత్యక్షం అవుతాయని వెల్లడించారు.

స్లాట్‌ బుకింగ్‌లో ఇచ్చిన సమయానికి తాసిల్దార్‌ లేకపోయినా రిజిస్ట్రేషన్లు ఆగవని, వారి స్థానంలో నాయబ్‌ తాసిల్దార్‌ రిజిస్ట్రేషన్‌ చేస్తారని చెప్పారు. రిజిస్ట్రేషన్‌ సేవలతో రెవెన్యూ అధికారుల బాధ్యత మరింత పెరిగిందని సీఎస్‌ అన్నారు. హోదా కూడా పెరిగిందని.. తాసిల్దార్లు, జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్లు కూడా అయ్యారని వివరించారు. సమీప భవిష్యత్‌లో రెవెన్యూశాఖ పునర్వ్యవస్థీకరణ చేస్తామని, త్వరలో పదోన్నతులు వస్తాయని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో రెవెన్యూశాఖ అంటేనే ప్రభుత్వమని, ప్రభుత్వమంటేనే రెవెన్యూశాఖ అని వ్యాఖ్యానించారు.

ధరణి నిర్వహణకు ఏడు సర్వర్లు

ధరణిలో ఎదురయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో సాంకేతిక బృందం ఉన్నదని సీఎస్‌ చెప్పారు. ఏ సమస్య వచ్చినా వెంటనే  ఈ టీమ్‌ పరిష్కరిస్తుందని అన్నారు. రాష్ట్రస్థాయిలో కంట్రోల్‌ రూమ్‌తో పాటు, జిల్లాస్థాయి టెక్నికల్‌ సపోర్ట్‌ టీమ్‌లు పనిచేస్తాయని వివరించారు. నెట్‌వర్క్‌ సమస్యలు రాకుండా ఉండేందుకు ఏడు సర్వర్లు పని చేస్తున్నాయని వెల్లడించారు. డాటా సేఫ్‌గా ఉంటుందని తెలిపారు. ట్రయల్స్‌కు తాత్కాలిక సర్వర్‌ను వాడినట్టు పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌ను ఎవ్వరికీ చెప్పకుండా ట్రయల్స్‌ కోసం గంట సేపు ఓపెన్‌ చేస్తే దాదాపు లక్ష వ్యూస్‌ వచ్చాయని సోమేశ్‌కుమార్‌ చెప్పారు. దీన్నిబట్టే ధరణి కోసం ప్రజలు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిపోతున్నదన్నారు. పోర్టల్‌ నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడానికి ప్రతి మండలానికి రూ.10 లక్షల చొప్పున రూ.57 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ సబ్‌ రిజిస్ట్రార్లుగా కాకుండా తమకు జాయింట్‌ రిజిస్ట్రార్లుగా హోదా కల్పించాలని కోరారు. ట్రెసా కార్యదర్శి గౌతమ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి, అధికారులకు లబ్ధి కలిగేలా ధరణిని రూపొందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రోడ్లు భవనాలశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, రెవెన్యూ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సమయం వృథాకు చెక్‌

గతంలో డాక్యుమెంట్‌ రైటర్‌ దగ్గరికి వెళ్లి దస్తావేజు రాయించుకొని.. తర్వాత సబ్‌ రిజిస్ట్రార్‌ వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకునేవారు. మూడునాలుగు రోజులకు డాక్యుమెంట్‌ తెచ్చుకునేవారు. తర్వాత మ్యుటేషన్‌కు తాసిల్దార్‌ ఆఫీస్‌కెళ్లి, మరికొన్నాళ్లు ఎదురుచూడాల్సి వచ్చేది. ధరణి పోర్టల్‌తో ఈ కష్టాలకు చెక్‌ పడనున్నది. సమయం వృథా కాకుండా.. రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ తాసిల్‌ ఆఫీస్‌లోనే ఒకేసారి జరుగుతుంది.

- కృష్ణారెడ్డి, చిట్యాల తాసిల్దార్‌, 

యాదాద్రి భువనగిరి జిల్లా వందశాతం సక్సెస్‌ అవుతుంది

రైతులే కేంద్రంగా ధరణి సేవలు సాగుతాయి. రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ సమయంలో వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇది 100 శాతం విజయవంతం అవుతుంది. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లకు మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు వేగం అందుకున్నాం. 

- నాగమణి, అల్వాల్‌ తాసిల్దార్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా