ఆదివారం 07 మార్చి 2021
Telangana - Jan 22, 2021 , 01:43:30

రెండున్నర నెలల్లో లక్ష దాటిన రిజిస్ట్రేషన్లు

రెండున్నర నెలల్లో లక్ష దాటిన రిజిస్ట్రేషన్లు

 • పోర్టల్‌ ద్వారా రికార్డు స్థాయిలో లావాదేవీలు
 • భూ సమస్యలకు పరిష్కారంగా పోర్టల్‌ 
 • ఒక్కో సమస్యకు ఒక్కో ఆప్షన్‌ ప్రత్యేకం 
 • సాకారమవుతున్న సీఎం కేసీఆర్‌ కల 

హైదరాబాద్‌, జనవరి 21 (నమస్తే తెలంగాణ): గతేడాది నవంబర్‌ 2న ప్రారంభమైన ధరణి పోర్టల్‌ వ్యవసాయభూముల రిజిస్ట్రేషన్లలో సరికొత్త రికార్డు సృష్టిస్తున్నది. రెండున్నర నెలల్లోనే 1,03,106 రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తిచేసింది. పోర్టల్‌ ప్రారంభమైన మొదటివారం రోజులు కొన్ని సాంకేతికసమస్యలు ఎదురైనా.. కొద్దిరోజుల్లోనే అధికారులు వాటిని పరిష్కరించారు. ప్రస్తుతం రోజుకు సగటున రెండువేలకుపైగా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తవుతున్నాయి. సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినట్టుగానే పావుగంటలోనే పట్టా చేతికొస్తున్నది.

సర్వం ధరణీమయం

వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్త సేవలకు ధరణి పోర్టల్‌ వేదికైంది. మొదట్లో స్లాట్‌బుకింగ్‌, నూతన రిజిస్ట్రేషన్‌ సేవలు మాత్రమే అందుబాటులోకిరాగా ఇప్పుడు ప్రతి సమస్యకూ ధరణి పరిష్కారం చూపుతున్నది. ఈ మేరకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు పోర్టల్‌లో ఆప్షన్లను జత చేస్తున్నది. రాష్ట్రంలో క్లియర్‌గా ఉన్న సుమారు 1.46 లక్షల ఎకరాల భూముల రికార్డులు ధరణిలో దర్శనమిస్తున్నాయి. ప్రపంచంలో ఏ మూలనుంచైనా చూసుకునే అవకాశం కలిగింది. పట్టాభూములు, నిషేధిత భూములు వేటికవే వేర్వేరుగా పొందుపర్చారు. ఈసీ వివరాలు సైతం పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశారు. 

ప్రతి సమస్యకూ ఒక ఆప్షన్‌

వ్యవసాయ భూములకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. ఈ మేరకు సమగ్రంగా అధ్యయనం చేయించింది. ఇటీవలే రెవెన్యూ డివిజన్‌కు ఒక గ్రామాన్ని ఎంచుకొని వ్యవసాయ భూములకు సంబంధించిన అన్నిరకాల సమస్యలపై అధికారులు నివేదిక రూపొందించారు. దీని ఆధారంగా సమస్యలన్నింటినీ గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు సిటిజన్‌ లాగిన్‌లో, మీసేవలో కొత్త ఆప్షన్లను జతచేశారు. తాసిల్దార్లు, ఆర్డీవోల అధికారాలకు కత్తెర వేసి.. వాటి పరిష్కార బాధ్యతలను కలెక్టర్లకు అధికారం అప్పగించింది. ఒక్కో సమస్య పరిష్కారానికి నిర్దేశిత గడువును విధించింది.

గురువారం నాటికి 

స్లాట్‌ బుకింగ్స్‌ : 1,07,182

రిజిస్ట్రేషన్లు  : 1,03,106

పారదర్శకంగా.. సులభంగా..

ధరణి ద్వారా పారదర్శకంగా, సులభంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. 20 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌తోపాటు, మ్యుటేషన్‌ పూర్తిచేసుకుని వెళ్తున్నారు. ప్ర భుత్వం తాజాగా మరి న్ని ఆప్షన్లు ఇవ్వడంతోపాటు, స్లాట్లు పెంచింది. గురువారం 19 లావాదేవీలు పూర్తిచేశాం.

- రాంరెడ్డి, తాసిల్దార్‌, నేరేడుచర్ల, సూర్యాపేట

10 నిమిషాల్లోనే పాస్‌బుక్కు..

స్లాట్‌ బుక్‌చేసుకుని వేములవాడ తాసిల్దార్‌ ఆఫీస్‌కెళ్లా. 10నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూ ర్తిచేసి పాస్‌బుక్‌ ఇచ్చారు. కేసీఆర్‌కు కృతజ్ఞతలు.

- పత్తి నర్సింహారెడ్డి, వేములవాడ, రాజన్నసిరిసిల్ల

 • ధరణి ప్రారంభానికి ముందే రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకొని మ్యుటేషన్‌ చేసుకోనివారి కోసం ప్రత్యేకంగా ‘అప్లికేషన్‌ ఫర్‌ మ్యుటేషన్‌' ఆప్షన్‌ ఇచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 1.70 లక్షల దరఖాస్తులు వచ్చాయి. చ్చినట్టు అంచనా. వాటి పరిష్కారం కూడా ప్రారంభమైంది. 
 • నాలా కన్వర్షన్స్‌ను తాసిల్దార్‌ స్థాయిలోనే పరిష్కరిస్తున్నారు. 
 • వివాదాస్పద భూముల సమాచారాన్ని ప్రజలే స్వయంగా నమోదు చేసుకొనేందుకు అవకాశం ఇచ్చింది. 
 • రెవెన్యూ కోర్టులను రద్దుచేసి.. కలెక్టర్‌ నేతృత్వంలో ప్రత్యేకంగా ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసింది. మొత్తం 16,137 కేసులను నెలరోజుల్లో పరిష్కరించాలని ఆదేశించింది. 
 • కంపెనీలకూ పాస్‌బుక్కుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం. 
 • ఆధార్‌ అనుసంధానంకాక రైతుబంధు, రైతుబీమా వంటి ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. సు మారు 1.61 లక్షల మంది ఉన్నట్టు గుర్తించిన ప్రభుత్వం నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశమిచ్చింది. 
 • ఇతర అన్ని సమస్యలపై దరఖాస్తు చేసుకొనేందుకు ‘అప్లికేషన్‌ ఫర్‌ ల్యాండ్‌ మ్యాటర్స్‌' ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది.

VIDEOS

logo