బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 01:34:45

చట్ట ప్రకారమే ధరణి పోర్టల్‌

చట్ట ప్రకారమే ధరణి పోర్టల్‌

  • హైకోర్టుకు వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: చట్ట ప్రకారమే ధరణి పోర్టల్‌ను రూపకల్పన చేసినట్టు హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. చట్టాల్లేకుండా ధరణి పోర్టల్‌లో పొందుపర్చేందుకు వ్యవసాయేతర ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారని హైకోర్టులో దాఖలైన పలు కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలుచేసింది. వ్యవసాయ ఆస్తుల వివరాలను నమోదు చేయడానికి కొత్తగా ‘భూమిపై హక్కులు, పట్టాదార్‌ పాస్‌పుస్తకాల చట్టం -2020’ తీసుకొచ్చామని, దీని ప్రకారమే వ్యవసాయ ఆస్తులను నమోదు చేస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వ్యవసాయేతర ఆస్తుల నమోదు కోసం తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం - 2018, తెలంగాణ పురపాలక చట్టం-2019, జీహెచ్‌ఎంసీ చట్టం- 1955లకు సవరణలు చేసినట్టు వెల్లడించారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్లను ఒకేసారి పూర్తిచేసేలా చట్టాలకు సవరణ చేశామని తెలిపారు. వ్యవసాయేతర ఆస్తుల లావాదేవీలు ఇప్పటివరకు పలు స్థానిక సంస్థల పరిధిలో జరిగాయని, దీనివల్ల వివాదాలు పెరిగి ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. అన్ని సంస్థల వద్ద ఉన్న రికార్డులను ఒకే దగ్గర ఉంచేందుకు పోర్టల్‌ తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల లావాదేవీలను ఒకే పోర్టల్‌ ద్వారా సమీకృత విధానంలో చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. 

స్థిరాస్తి లావాదేవీలకు ‘ధరణి’ ఆధారం

రాష్ట్రంలో స్థిరాస్తి లావాదేవీలకు ధరణి పోర్టల్‌ ఆధారంగా ఉంటుందని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వివక్ష, అవినీతికి తావులేకుండా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు ఆధార్‌ బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌ ద్వారా జరుగుతాయని తెలిపారు.  వ్యవసాయేతర ఆస్తుల యజమానులు తమ ఆస్తుల వివరాలను ఇతరులెవరికీ తెలియకుండా స్వయంగా ప్రైవసీ సెట్టింగ్స్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సర్వర్లలోనే డాటాను సురక్షితంగా భద్రపరుస్తున్నామని హైకోర్టుకు వెల్లడించారు.

వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు ఆలస్యం! 

ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మూడునాలుగు రోజులు వాయిదా పడే అవకాశం ఉన్నది. సోమవారం నుంచి రాష్ట్రంలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు ప్రారంభించాలని ప్రభుత్వం ముందుగా నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. వ్యవసాయేతర ఆస్తుల వివరాల సేకరణ, రిజిస్ట్రేషన్లపై ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తున్నది. ఈ కేసు విచారణ శనివారం జరుగగా, న్యాయస్థానం 23న మరోసారి విచారణ చేపట్టనున్నది. హైకోర్టు అనుమతిస్తే తప్ప రిజిస్ట్రేషన్లను ప్రారంభించే పరిస్థితి లేదు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై కోర్టు ఇప్పటికే స్టే విధించిన సంగతి తెలిసిందే.