శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 03:08:16

విమర్శకుల తెలివిలో అవిటితనం

విమర్శకుల తెలివిలో అవిటితనం

  • ధరణి చారిత్రాత్మకమే కాదు.. సాహసోపేతం
  • రైతుల పహాణి, పట్టా కష్టాలు ఈ నాటివి కావు..
  • ఏండ్ల కష్టాలకు నిమిషాల్లో పరిష్కారం లభిస్తున్నది
  • ‘నమస్తే తెలంగాణ’తో కంటోన్మెంట్‌ మాజీ ఎమ్మెల్యే బీ మశ్చేందర్‌రావు ప్రత్యేక ఇంటర్వ్యూ

మేడ్చల్‌, నమస్తే తెలంగాణ: రైతన్నల పహాణి నకల్‌, పట్టా, మ్యుటేషన్‌ కష్టాలు ఈ నాటివి కావని, అన్నదాతల దశాబ్దాల దరిద్రాన్ని ఒక్క ధరణితో కడిగేస్తున్నారని కంటోన్మెంట్‌ మాజీ ఎమ్మెల్యే బీ మశ్చేందర్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఎవరు ఉన్నారనేది ముఖ్యం కాదని, ప్రజలకు ఎంత మేలు చేస్తున్నారన్నదే ప్రధానమని తెలిపారు. ప్రస్తుత రాజకీయాల్లో సీఎం కేసీఆర్‌ సుపరిపాలనకు ఓ చుక్కాని అంటూ మశ్చేందర్‌రావు ‘నమస్తే తెలంగాణ’తో పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. మిగతా విషయాలు ఆయన మాటల్లోనే..

పారదర్శక సేవలు పది నిముషాల్లో..

ధరణి చారిత్రాత్మకమని చాలా మంది అంటున్నారు.. కానీ సాహసోపేతం కూడా. 70 ఏండ్ల రైతుల కష్టాలకు నిమిషాల్లో పరిష్కారం చూపడమంటే మాటలా? ప్రజల మేలుకోరే నాయకులకు మాత్రమే ఇది సాధ్యం. భూ హక్కులను తారుమారు చేసేందుకే.. మళ్లీ దొరలకు కట్టబెట్టేందుకే ధరణి తెచ్చారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడుగాళ్ల మాటలు విన్న ప్పుడు.. వాళ్ల తెలివిలో అవిటితనం ఉన్నదనిపిస్తుంది. నిజంగా ఓ రైతు భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తర్వాత మ్యుటేషన్‌కు, పహాణిలకు, పట్టాదార్‌ పాసుపుస్తకం పొందేందుకు ఎంత కష్టమైతదో తెలువదేమో అనిపిస్తుంది. ధరణితో పారదర్శక సేవలు ప్రజలకు పది నిముషాల్లో అందుతాయి. అవినీతి తగ్గు తుంది. ఏండ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగాల్సి న పని ఉండదు. ఇకపై ప్రభుత్వ భూములతోపాటు ప్రైవేటు భూములు ధరణిలో భద్రంగా నిక్షిప్తమై ఉంటాయి. ఇక్కడ భూ ములున్నవారు ఏ దేశంలో ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. 

గతంలో అమలుకు నోచుకోలే..

నాడు పీవీ, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌ భూ సంస్కరణలు తీసుకొచ్చినా.. వాటి ఫలాలు ప్రజలకు అంతగా దక్కలే. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధరణి రూపంలో తీసుకొచ్చిన సంస్కరణ ఫలాలు నేరుగా అర్హులైన హక్కుదారులందరికీ అందుతాయి. అలాగే ఒక గ్రామంలో భూమి ఉన్నవారెందరు? లేని వారెందరు? వందల ఎకరాలున్న భూస్వాములు ఎవరు? అనే అంశాలపై ప్రభుత్వానికి ఓ స్పష్టత వస్తుంది. తదనుగుణంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం, భూ సంస్కరణలు తీసుకురావడం సాధ్యమవుతుంది.

పేదలకేం భయం లేదు..

ధరణి రాకతో అక్రమమార్గంలో ప్రభుత్వ భూములు కాజేసిన భూస్వాములు భయపడాలి తప్ప.. పేద ప్రజలు, చిన్న, సన్నకారు రైతులు కాదు. ధరణి అత్యంత పారదర్శకం. కానీ గతంలో మాన్యువల్‌ రికార్డులుండటంతో హైదరాబాద్‌లోని వేల ఎకరాల ప్రభుత్వ, భూదాన్‌ భూములను కొందరు వలసదారులు, కబ్జాకోరులు తప్పుడు పత్రాలతో ఆక్రమించారు. ఇప్పుడు కబ్జాలు, రెవెన్యూ రికార్డులను తారుమారు చేయడం సాధ్యం కాదు.

కేసీఆర్‌ను కలిసి అభినందించాలని ఉన్నది

ఏండ్లుగా తెలంగాణలో జరుగుతున్న భూవివాదాలను దగ్గరగా చూసిన అనుభవం నాది. అప్పుడప్పుడు అనుకునేవాడిని నేను పోయేలోగానైనా ఈ భూమి కొట్లాటలు పోతాయో లేదో అని. కానీ సీఎం కేసీఆర్‌ ధరణిలో ఒక్క క్లిక్‌తో వందల రకాల భూసమస్యలకు చెక్‌ పెట్టారు. భూ సమస్యలకు చెక్‌ పెట్టడమంటే పరోక్షంగా నేరాలను కూడా అదుపుచేయడమే. నా 70 ఏండ్ల రాజకీయ జీవితంలో నెరవేరని కల.. నా 92 ఏండ్ల వయసులో తీరింది. అందుకే సీఎం కేసీఆర్‌ దగ్గరికెళ్లి మనస్ఫూర్తిగా అభినందించాలని ఉన్నది.

సేవలపై సంతోషం

గతంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లన్నీ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో చేసేవారు. అక్కడ రిజిస్ట్రేషన్‌ జరిగిన తర్వాత డాక్యుమెంట్లు చేతికి రావడానికి నాలుగైదు రోజుల టైం పట్టేది. మళ్లీ తాసిల్‌ కార్యాలయానికి వచ్చి మ్యుటేషన్‌, పట్టాపాస్‌బుక్కులు పొందడానికి ప్రజలు తిరుగాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ధరణి ద్వారా సేవలు ఈజీ అయ్యాయి. స్లాట్‌ బుక్‌ చేసుకుని తాసిల్‌ కార్యాలయాలకు వస్తున్న వారికి 20 నిమిషాల వ్యవధిలోనే ఏకకాలంలో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ అవుతున్నాయి. పాస్‌బుక్‌లు ఉంటే అందులోనే వివరాలు నమోదు చేస్తున్నాం. ఇప్పుడు ఈజీగా పనులు అవుతుండటంతో రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నవారు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. మా సిబ్బందికి కూడా పని సులభతరమైంది. 

-వీరారెడ్డి, అదనపు కలెక్టర్‌ సంగారెడ్డి