ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 08, 2020 , 01:58:06

బొమ్మ కొన్నంత తేలిక

బొమ్మ కొన్నంత తేలిక

రైతులైనా, రాజులైనా పుడమితల్లిని ఆరాధించిన చరిత్ర మనది. దానికోసమే కుత్తుకలు తెగ్గోసిన సందర్భాలు ఉన్నాయి. ఇంచులైనా.. గజాలైనా.. ఎకరాలైనా.. మానవుని ఆత్మగౌరవాన్ని ప్రశ్నించినప్పుడు మరణం కొని తెచ్చుకున్న ఘటనలూ ఉన్నాయి. మానవత్వపు ఉనికినే ప్రశ్నిస్తున్న భూ సమస్యలకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ధరణి’ పోర్టల్‌ ఓ అద్భుతమైన పరిష్కారం. పట్టా పాసుపుస్తకాల కోసం తాసిల్దార్‌ ఆఫీస్‌ చుట్టూ ఏండ్ల తరబడి తిరిగిన రైతు కుటుంబాలు కోకొల్లలు. అన్నదమ్ములు, దాయాదులు భూ తగాదాల పేరుతో కొట్లాడుకుంటూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ.. ఇరువైపులా భూమిని అమ్మి, లాయర్లకు ఫీజులు కట్టి సర్వం కోల్పోయినవారు ఎంతోమంది మన చుట్టాలలోనే ఉన్నారు. ఇప్పుడు వీటన్నింటికీ సమాధానం ధరణి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే శాటిలైట్‌ శాస్త్ర సాంకేతికతను జోడించి ప్రతి ఇంచు స్థలం ప్రభుత్వ రికార్డుల్లో నమోదైంది. ఆయా దేశాల్లో ఇల్లు కొనడం అంటే మనం బజారుకు వెళ్లి ఆట వస్తువును కొన్నంత తేలిక. యజమానులు పరాయిదేశాల్లో ఉన్నా నిశ్చింతగా ఉంటున్నారు. ఇప్పుడు ధరణి ద్వారా ఆ వ్యవస్థ.. మనం కంటున్న కలలు సాకారమవుతాయని గట్టి నమ్మకం కలుగుతున్నది.

- మల్లికేశ్వరరావు కొచాడ, తెలుగు మల్లి ఆన్‌లైన్‌ పత్రిక సంపాదకుడు, ఆస్ట్రేలియా 

ధరణి ప్రయోజనాలు 
  • ప్రతి ఇంచు భూమి పోర్టల్‌లో నమోదవడం. 
  • తన భూమిని ఎవరు, ఎప్పుడు, ఏ రూపంలో గుంజుకుంటారోనన్న భయం అవసరం లేదు. 
  • బీద, ధనికవర్గ భేదం లేకుండా వ్యవస్థాపరంగా ఏర్పాటైన పటిష్ఠ విధానాలు సంరక్షిస్తాయి.
  • అధికారం చెలాయించే పట్టందార్లకు ఆటకట్టుగా నిలుస్తుంది.
  • ఆస్తి పంపకాలు ఇకనుంచి సులభతరం. 
  • నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలకు ఇక కట్టడి.
  • భూ సంబంధ లావాదేవీలన్నీ ఒకేచోట. 
  • భూ ఆక్రమణలకు స్వస్తి