గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 02:58:05

ధరణి అద్భుతం

ధరణి అద్భుతం

  • ట్యాంపరింగ్‌కు అవకాశమే లేదు
  • క్రయవిక్రయాల్లో ఒకేసారి 4 కాపీలు
  • ఆఫీసులచుట్టూ తిరిగే పని లేదు
  • అణా పైస లంచం ఇవ్వనక్కర్లేదు
  • మండలిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రెవెన్యూ రికార్డుల కోసం ప్రభుత్వం తీసుకువస్తున్న ధరణి వెబ్‌సైట్‌ ఒక అద్భుతమని సీఎం కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఎవరైనా వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసుకుని తమ భూముల వివరాలు తెలుసుకోవచ్చని, అయితే.. డాక్యుమెంట్లను ట్యాంపరింగ్‌ చేయడం ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యంకాదని స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్‌ సోమవారం శాసనమండలిలో రెవెన్యూ బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

ఎమ్మార్వోలు దుర్మార్గం చేయలేరు

పేద రైతుల భూములు ఇంకోడు గద్దలాగా తన్నుకొనిపోవద్దనే కొత్త రెవెన్యూ చట్టం తెస్తున్నం. ఒక్క అణా లంచం ఇవ్వకుండానే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ అయిపోతది. ఎమ్మార్వోలు దుర్మార్గం చేయరనే నమ్మకమేందని అడిగారు. ఎమ్మార్వోలు ఎలాంటి దుర్మార్గం చేయలేరు. కారణమేందంటే.. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు అద్భుతమైన సాఫ్ట్‌వేర్‌ తీసుకొస్తున్నాం. సొంత ప్రయోగాలు చేయడానికి అసలు ఆ సైట్‌ ఓపెనే కాదు. ధరణి పోర్టల్‌ ప్రపంచానికి మొత్తం ఓపెన్‌గా ఉంటుంది. ఎవరైనా.. ప్రపంచంలో ఏ మూల ఉన్నా వారి భూమి వివరాలు చూసుకోవచ్చు. డౌన్‌లోడ్‌ కూడా చేసుకోవచ్చు. కానీ డాక్యుమెంట్‌ను ట్యాంపర్‌ చేయడానికి ఆస్కారం ఉండదు. ఎమ్మార్వోకు కూడా ఆ అధికారం లేదు. ఒక్కసారి రిజిస్ట్రేషన్‌ అయిన జాగకు డబుల్‌ రిజిస్ట్రేషన్‌ ఉండదు. ఎక్సలెంట్‌ పోర్టల్‌ను తెచ్చేందుకు సీఎస్‌గారు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో చర్చిస్తున్నారు. ధరణి ఇంకా లాంచ్‌ కాలేదు. ఇష్టంలేని దుర్మార్గులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మంచి రోజున అందరం కలిసి లాంచ్‌ చేద్దాం. 

ఇద్దరు లేకుండా పోర్టల్‌ ఓపెన్‌ కాదు

అమ్మేవారి, కొనేవారి అనుమతి లేకుంటే ధరణి పోర్టల్‌ ఓపెనే కాదు. ఉదాహరణకు నాకు, రవాణాశాఖ మంత్రి అజయ్‌కు మధ్య ట్రాన్సాక్షన్‌ ఉందని అనుకుందాం. నాకో పదెకరాలు ఉంది.. నేను రెండెకరాలు వారికి అమ్మిన. నేను, అతను ఇద్దరం ఎమ్మార్వోను కలిసి వివరాలు అందిస్తే తప్ప పోర్టల్‌ ఓపెన్‌ కాదు. నా పాస్‌బుక్కులో రెండెకరాలు డిలీట్‌ అయి, అజయ్‌ పాస్‌బుక్‌లో చేరుతది. అప్పటికప్పుడే కొత్త పాస్‌బుక్‌ కాపీలు కూడా ఇస్తరు. బ్యాంకులో మాదిరిగా ఇచ్చేస్తారు.

రెండు రకాలుగా ధరణి పోర్టల్‌

మన 590 మండలాల ఎమ్మార్వోలంతా జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్లుగా పనిచేస్తరు. 141 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలున్నాయి. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ బాధ్యతలను వీరుచూస్తారు. ధరణి పోర్టల్‌ రెండు రకాలుగా ఉంటది. ఒకటి వ్యవసాయ భూమి, మరోటి వ్యవసాయేతర భూమి. 89 లక్షల పైచిలుకు మంది గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో, జీహెచ్‌ఎంసీ పరిధిలో మ్యుటేషన్‌ చేయించుకున్నవారు ఉన్నరు. ఇందులో గ్రామాల్లో సుమారు 20 లక్షల మంది, మున్సిపాలిటీల్లో 40 లక్షలు, జీహెచ్‌ఎంసీలో 24.90 లక్షల మంది ఉన్నరు. వీరందరి ఆస్తుల వివరాలు ఆన్‌లైన్‌లో ఉన్నయి.

భూరికార్డులు సరిగ్గా ఉంటే జీడీపీ పెరుగుతుంది

ల్యాండ్‌ రికార్డ్స్‌ క్లియర్‌గా ఉన్నటువంటి అభ్యుదయ దేశాల్లో  జీడీపీ 2 నుంచి 3 శాతం పెరుగుతున్నది. కాబట్టి మనవద్ద కూడా పెరుగుతది. ఈ భూసమస్యలు పోవాలె. ఎవరి భూమి వారు చేసుకొని సంతోషంగా బతకాలె. నిరుపేదలు, నోరు లేనోళ్ల కోసమే ఈ చట్టం. ఈ చట్టంపై గ్రామాల్లో రైతులు పండుగలు చేస్తుండ్రు. పీడ విరగడైంది అంటుండ్రు. చట్టం తయారు చేసేముందు చాలామంది న్యాయ నిపుణులు, రెవెన్యూ నిపుణులతో చర్చించినం. మళ్లీ ఏమైనా ఇబ్బందులు వస్తే ఆర్డినెన్స్‌ జారీచేస్తం.

ఒకేసారి నాలుగు కాపీలు చేతుల్లోకి

సబ్‌రిజిస్ట్రార్లకు ఇకపై ఎలాంటి విచక్షణాధికారాలు ఉండవు. అన్ని భూములకు ఒకేసారి రిజిస్ట్రేషన్‌ ధరలను ప్రభుత్వమే నిర్ణయించి,  ఒకేసారి గెజిట్‌ నోటిఫై చేస్తది. ధరణి పోర్టల్‌ ప్రారంభానికి ముందే ఇది చేస్తం. ప్రతి ఇంచుకు ధర నిర్ణయిస్తాం. అపాయింట్‌మెంట్‌ ఎమ్మార్వోనే ఇస్తరు. ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. లేదంటే వెళ్లి బుక్‌ చేసుకోవచ్చు. ఫోన్‌ ద్వారా కూడా బుక్‌ చేసుకోవచ్చు. అమ్మదలుచుకున్న భూమి వివరాలు, పాస్‌బుక్కులు, సర్వేనంబరు, రిజిస్ట్రేషన్‌ వాల్యు చార్జీలు కూడా చెల్లించాలి. ఇవి కడితేనే అపాయింట్‌మెంట్‌ దొరుకుతది. దీనికి మ్యుటేషన్‌ చార్జీ కూడా పెట్టినం. ఇది రైతుకు రక్షణ. అపాయింట్‌మెంట్‌ ఇచ్చిన రోజే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ అయిపోతది. ఆఫీసుకు వెళ్లిన తర్వాత గరిష్ఠంగా 30 నిమిషాల్లో పని పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్‌ కోసం అక్కడ నమూనా పత్రాలు కూడా పెడుతాం. చదువొచ్చినవాళ్లు వారే డాక్యుమెంట్‌ పూర్తిచేసుకోవచ్చు. లేదంటే డాక్యుమెంట్‌ రైటర్‌ ఉంటడు. ఆయనకు నిర్ణీత ఫీజు ఇవ్వాలి. రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, అప్డేషన్‌, ఎక్సాట్రాక్ట్‌ కాపీ మా కళ్ల ముందే వచ్చేస్తది. ఇది సేల్‌ అగ్రిమెంట్‌ పద్ధతి.


logo