గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Sep 28, 2020 , 02:20:31

సమగ్రంగా స్మార్ట్‌ సర్వే!

సమగ్రంగా స్మార్ట్‌ సర్వే!

  • భూముల సర్వేలో డీజీపీఎస్‌ అత్యుత్తమం
  • వారం పదిరోజుల్లో ఒక ఊరు పూర్తికి చాన్స్‌
  • తక్కువ సిబ్బంది.. అత్యాధునిక టెక్నాలజీ
  • పక్కాగా కోఆర్డినేట్స్‌.. వివాదాలకు చెక్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: భూవివాదాలకు తావులేని తెలంగాణను ఆవిష్కరించేదిశగా ప్రభుత్వం సమగ్ర సర్వేచేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించనున్నది. దాదాపు ఏడాదిలో సర్వే పూర్తవుతుందని స్వయంగా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మహాక్రతువులో అధికారులతోపాటు ప్రైవేట్‌ ఏజెన్సీలను భాగస్వామ్యంచేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఒక్కో జిల్లాను ఒక్కో ఏజెన్సీకి అప్పగించే అవకాశం ఉన్నదని సీఎం కేసీఆర్‌ సెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు భూముల కొలతలంటే గొలు సు పద్ధతి. అయితే దీనివల్ల కచ్చితత్వం తక్కువ. ఎక్కువ సమయం, మనుషులు అవసరం. ఒకప్పుడు పెద్ద కమతాలుండేవి. భూమి విలువ కూడా తక్కువ. కాబట్టి లెక్కల్లో కాస్త అటూఇటైనా పెద్దగా ఇబ్బంది ఉండేదికాదు. ప్రస్తుతం అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. భూమి విలువ పెరిగిన దృష్ట్యా ప్రతిఇంచును కొలువాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం భూసర్వేలకు డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం (డీజీపీఎస్‌) విధానాన్ని అత్యుత్తమ పద్ధతిగా భావిస్తున్నారు. 

ఎంతమంది అవసరం? 

  • రిఫరెన్స్‌ స్టేషన్‌ లేదా బేస్‌ వద్ద ఒక వ్యక్తి కాపలా ఉండాలి. ఒకవేళ బేస్‌ సురక్షితప్రాంతంలో ఉంటే అవసరం లేదు. రోవర్‌ కోసం ఒకరు, రిమోట్‌ కోసం ఒకరు, వివరాలు నమోదుచేసుకునేందుకు మరొకరు ఉంటారు. వివరాలను ప్రాసెస్‌చేయడానికి కంప్యూటర్‌ ఆపరేటర్‌కావాలి. మొత్తంగా నలుగురు ఉంటే ఒక పొలం డిజిటల్‌ మ్యాప్‌ రూపొందించవచ్చు.
  • బేస్‌ లేదా రిఫరెన్స్‌ స్టేషన్‌ పరిధి కనిష్ఠంగా మూడు కిలోమీటర్లు. ఒక ప్రాంతంలో బేస్‌ను అమర్చి మూడు కిలోమీటర్ల పరిధిలో ఏ పొలం అయినా కొలువవచ్చు. ఒకబేస్‌కు నాలుగు రోవర్లను అనుసంధానం చేయవచ్చు. అంటే ఒకేసారి నాలుగు బృందాలు పనిచేసే అవకాశం ఉంటుంది.

ఎంత సమయం పడుతుంది?

బేస్‌ను బిగించడానికి 15 నుంచి 30 నిమిషాలు పడుతుంది. ఒక్కో కోఆర్డినేట్‌ పాయింట్‌ను నమోదుచేయడానికి 30 సెకండ్ల నుంచి నిమిషం పడుతుంది. వ్యక్తి రోవర్‌ను పట్టుకొని సరిహద్దుల వెంట నడువడానికే సమయం తీసుకుంటుంది. ఆ తర్వాత కంప్యూటర్‌లో ఈ సమాచారాన్ని క్రోడీకరించడానికి ఒకటి నుంచి ఒకటిన్నర రోజు పడుతుంది. క్షేత్రస్థాయి బృందాలు, కంప్యూటర్‌ నిపుణులు ఒకే సమయంలో పనిచేస్తే మరింత సులభం అవుతుంది. మొత్తంగా 1,500 ఎకరాలు ఉన్న గ్రామాన్ని 5 నుంచి 7 రోజుల్లో సర్వే పూర్తిచేయవచ్చని నిపుణులు చెప్తున్నారు.

సర్వే ఎలా చేస్తారు?

డీజీపీఎస్‌ విధానంలో మూడు ప్రధాన పరికరాలు ఉంటాయి. 1)రిఫరెన్స్‌ స్టేషన్‌ లేదా బేస్‌. 2)రోవర్‌. 3)రిమోట్‌. వీటి సాయంతో ఒక పొలం డిజిటల్‌ మ్యాప్‌ లేదా డిజిటల్‌ ఫైల్‌ రూపొందించడంలో ప్రధానంగా రెండుదశలు ఉంటాయి.

మొదటిదశలో.. భూమిని కొలువాలనుకున్న చోట ఎత్తయిన ప్రాంతంలో బేస్‌ను అమర్చుతారు. దీనికి రోవర్‌ను అనుసంధానిస్తారు. రోవర్‌ అనేది యాంటెన్నా మాదిరిగా ఉంటుంది. ఇది గరిష్ఠంగా రెండు కిలోల బరువు ఉంటుంది. ఈ రెండు పరికరాలు శాటిలైట్‌తో అనుసంధానమై ఉంటాయి. ఒక వ్యక్తి రోవర్‌ను పట్టుకొని మనం కొలువాలనుకున్న పొలం సరిహద్దుల వెంట నడుస్తారు. పొలానికి ఉన్న మూలకు వెళ్లిన తర్వాత రిమోట్‌ను క్లిక్‌చేస్తే ఆ కోఆర్డినేట్‌ పాయింట్‌ (అక్షాంశాలు, రేఖాంశాలు) నమోదవుతాయి. ఇలా పొలానికి ఉన్న మూలలన్నింటి (కార్నర్స్‌) కోఆర్డినేట్‌ పాయింట్స్‌ను నమోదుచేస్తారు. ఈ పాయింట్స్‌ అన్నింటినీ కలుపుతూ చిత్రాన్ని గీస్తే అదే పొలం డిజిటల్‌ మ్యాప్‌. ఈ సమాచారం మొత్తం బేస్‌లో నిక్షిప్తం అవుతుంది. అదే సమయంలో మరోవ్యక్తి కాగితంపై కోఆర్డినేట్‌ పాయింట్స్‌, ఎవరెవరితో సరిహద్దులు పంచుకుంటున్నారు? వంటి వివరాలను నమోదుచేసుకుంటారు.

రెండోదశలో.. బేస్‌లోని సమాచారాన్ని కంప్యూటర్‌లో నిక్షిప్తంచేస్తారు. దానిని ఆటోక్యాడ్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ సాయంతో ప్రాసెస్‌ చేస్తారు. కోఆర్డినేట్స్‌ అన్నింటినీ కలుపుతూ చిత్రాన్ని గీస్తారు. పొలం మూలలు ఏ అక్షాంశాలు, రేఖాంశాల వద్ద ఉన్నాయో వివరిస్తూ ప్రొఫైల్‌ తయారుచేస్తారు. ఇందులో యజమాని పేరు, పొలం కొలతలు, సరిహద్దులు ఎవరెవరితో పంచుకుంటున్నారు అనే వివరాలనూ నమోదుచేస్తారు. దీంతో పొలం డిజిటల్‌ ఫైల్‌ తయారవుతుంది.


logo