సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 16, 2020 , 20:32:52

ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించిన డీజీపీ మహేందర్ రెడ్డి

ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించిన డీజీపీ మహేందర్ రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం : పీపుల్స్‌ ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై మరింత దృష్టి సారిస్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీస్‌అధికారులకు సూచించారు. ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణి మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. డీజీపీకి భద్రాద్రి ఎస్పీ సునీల్‌దత్‌, పోలీస్‌ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి లక్ష్మీదేవిపల్లిలోని సింగరేణి ఇల్లెందు గెస్ట్‌ హౌజ్‌కు చేరుకున్నారు. మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పోలీస్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పోలీస్‌ శాఖ బాధ్యతాయుతంగా పని చేసి, మెరుగైన ఫలితాలను పోలీస్‌ ఉన్నతాధికారులకు సూచించారు. 

నేర నియంత్రణకు కృషి చేయాలన్నారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించి వారికి న్యాయం చేయడంలో ఎలాంటి జాప్యం చేయకూడదన్నారు. విచారణ జరిపి నేరగాళ్లకు శిక్ష పడడంలో ఎటువంటి రాజీలు లేకుండా చిత్తశుద్ధితో పని చేసి ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంపొందించుకోవాలన్నారు. అదే విధంగా రాష్ట్ర సరిహద్దు జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలో పోలీస్‌ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి మావోయిస్టు కార్యకలాపాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.

 ఇటీవల కాలంలో మావోయిస్టు యాక్షన్‌ టీమ్‌లు తెలంగాణలోకి ప్రవేశించాయనే సమాచారం ఉండడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో పని చేసే పోలీస్‌ అధికారులు ఎప్పటికప్పుడు వారి సమాచారం సేకరిస్తూ, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భద్రత చర్యలు తీసుకోవాలన్నారు. ఏజెన్సీ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారన్నారు. బంగారు తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా జరుగుతున్న పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిలో పోలీస్‌ శాఖ భాగస్వామ్యం వహిస్తుందన్నారు. మహేందర్ రెడ్డి వెంట గ్రేహౌండ్స్‌ అదనపు డీజీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, నార్త్‌ జోన్‌ ఐజీ నాగిరెడ్డి, ఎస్‌ఐబీ ఐజీ ప్రభాకర్‌రావు, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌ దత్‌, మహబూబాబాద్‌ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, అదనపు ఎస్పీ అట్ల రమణారెడ్డి, ఏఎస్పీలు రాజేష్‌ చంద్ర, శబరీష్‌, ట్రైనీ ఐపీఎస్‌లు బిరుదరాజు రోహిత్‌ రాజు, యోగేశ్‌ కుమార్‌, డీఎస్పీలు, ఇన్‌పెక్టర్లు ఉన్నారు.


logo