గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 11:59:20

సుర‌క్షిత హైద‌రాబాదే ల‌క్ష్యం : డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి

సుర‌క్షిత హైద‌రాబాదే ల‌క్ష్యం : డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి

హైద‌రాబాద్ : గ‌చ్చిబౌలిలో ప్రారంభించిన‌ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ హైద‌రాబాద్ ఖ్యాతిని మ‌రింత పెంచుతుంద‌ని రాష్ర్ట డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి తెలిపారు. క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్ ప్రారంభం సంద‌ర్భంగా డీజీపీ మాట్లాడారు. హైద‌రాబాద్‌ను సుర‌క్షిత న‌గ‌రంగా తీర్చిదిద్దాల‌నేది అంద‌రి ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. సీఎం కేసీఆర్ దూర‌దృష్టితో క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌కు రూప‌క‌ల్ప‌న చేశార‌ని గుర్తు చేశారు. హైద‌రాబాద్‌కు అంత‌ర్జాతీయ పెట్టుబ‌డులు పెరుగుతున్నాయి. పెరుగుతున్న పెట్టుబ‌డులు, ఖ్యాతికి అనుగుణంగా హైద‌రాబాద్‌లో శాంతిభ‌ద్ర‌త‌లు ప‌టిష్టం చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. హైద‌రాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా శాంతిభ‌ద్ర‌త‌ల‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని చెప్పారు. న‌గ‌రంలో మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు ప్ర‌త్యేక విభాగం ఏర్పాటు చేశామ‌న్నారు.

హైద‌రాబాద్ న‌గ‌రంలో మొత్తం ల‌క్ష సీసీ కెమెరాలు ఏర్పాటై ఉన్నాయ‌ని తెలిపారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసుల‌తో స‌మాన‌మ‌ని చెప్పారు. ఆ కెమెరాలు పార‌ద‌ర్శ‌కంగా ప‌ని చేస్తాయ‌న్నారు. నేరాల ద‌ర్యాప్తులో సీసీ కెమెరాలు పార‌ద‌ర్శ‌క‌మైన ఆధారాలుగా నిలుస్తున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటులో ప్ర‌జ‌లు కూడా భాగ‌స్వామ్యం కావ‌డం సంతోష‌క‌ర‌మ‌ని తెలిపారు. ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని రాష్ర్ట పోలీసు శాఖ ఏర్పాటు చేసుకుంటోంది. టెక్నాల‌జీ సామాన్యుడికి చేరువ కావాల‌న్నారు. ఏదైనా ఘ‌ట‌న జ‌రిగితే 5 నిమిషాల్లోపే ఘ‌ట‌నాస్థ‌లికి పోలీసులు చేరుకుంటున్నారు. శాంతి భ‌ద్ర‌త ప‌రిర‌క్ష‌ణ‌లో స‌హ‌క‌రిస్తున్న అన్ని విభాగాల వారికి కృత‌జ్ఞ‌త‌లు. ప్ర‌జా భ‌ద్ర‌త‌కు తెలంగాణ పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నార‌ని డీజీపీ మహేంద‌ర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. 

గ‌చ్చిబౌలిలో క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్‌ను ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ డేటా సెంట‌ర్‌ను ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. డేటా సెంట‌ర్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో మంత్రులు మ‌హమ్మ‌ద్ అలీ, స‌బితా ఇంద్రారెడ్డి, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌, రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌ర్ల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు.