బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 02, 2020 , 01:53:44

దేశమంతా మర్కజ్‌ చైన్‌

దేశమంతా మర్కజ్‌ చైన్‌

  • ఢిల్లీ వెళ్లివచ్చినవారిపై పోలీస్‌ నిఘా
  • లోతుగా అన్వేషించాలని డీజీపీ ఆదేశాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా నియంత్రణలోకి వస్తున్నదనుకొంటున్న తరుణంలో మర్కజ్‌ మత ప్రార్థనల్లో పాల్గొని దేశంలోని అన్ని రాష్ర్టాలకు తిరిగి వెళ్లిపోయిన వారివల్ల ఒక చైన్‌లాగా కరోనా వ్యాప్తి చెందింది. గత రెండు రోజుల్లోనే వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు బయటపడటంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. మర్కజ్‌నుంచి వచ్చినట్టుగా భావిస్తున్న 1030 మందిని  క్వారంటైన్‌ సెంటర్లకు తరలించడంతోపాటు గత పదిహేనురోజుల్లో వారు ఎక్కడెక్కడ తిరిగారు? ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారు? అలా సన్నిహితంగా మెలిగినవారు.. మరలా ఎక్కడెక్కడ తిరిగారన్న విషయాలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. 

కరోనా వ్యాప్తిలో ఇది కీలక సమయం కావడంతో ఎట్టిపరిస్థితుల్లోనూ విస్తరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన సమాచారం మేరకు స్థానికంగా ఉంటున్న పోలీసులు, ఆరోగ్య, రెవెన్యూశాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలనను ముమ్మరం చేశారు. ఇప్పటికే నల్లగొండలో 17 మందిని గుర్తించి హైదరాబాద్‌కు తరలించారు. వీరిలో 15 మంది మయన్మార్‌ పౌరులు కాగా, ఇద్దరు కశ్మీరీలు ఉన్నారు. సారంగాపూర్‌లో 12 మందిని, రాయికల్‌లో ఒకరిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. నారాయణపేటలో నలుగురు, హైదరాబాద్‌ రామచంద్రాపురంలో ఇద్దరిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు.

 గజ్వేల్‌ ప్రాంతానికి చెందిన ఒకరికి పాజిటివ్‌ అని నిర్ధారణ కావడంతో ఆ వ్యక్తి సంచరించిన సమాచారాన్ని 15 బృందాలతో సేకరిస్తున్నా రు. మర్కజ్‌కు వెళ్లివచ్చినవారి వివరాలు సేకరించి.. వారికి తక్షణమే వైద్యసాయం అందివ్వాలని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌.. కరీంనగర్‌, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లను కోరారు. మరోవైపు తెలంగాణను కొవిడ్‌ క్లస్టర్‌ ఫ్రీగా మార్చడంలో పోలీస్‌ అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. పోలీస్‌ సిబ్బంది వారివారి పరిధిలో మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.


logo