శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 05, 2020 , 02:00:00

సోషల్‌మీడియాపై పోలీస్‌ నజర్‌

సోషల్‌మీడియాపై పోలీస్‌ నజర్‌
  • కరోనాపై తప్పుడు వార్తలకు అడ్మిన్లదే బాధ్యత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో వదంతులు, తప్పుడు సమాచారం ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తప్పుడు వార్తలతో సామాన్యులను భయబ్రాంతులకు గురిచేయవద్దని, సోషల్‌మీడి యా గ్రూప్‌ అడ్మిన్లు ఇలాంటి తప్పుడు వార్తలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్‌ కట్టడికి పౌరులు చేయాల్సిన పనులపై బుధవారం డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి ట్వీట్‌ ద్వారా వెల్లడించారు. 


వాట్సప్‌ గ్రూప్‌ అడ్మిన్‌ బాధ్యతలు: వాట్సప్‌ గ్రూప్‌ అడ్మిన్లు విషయ పరిజ్ఞానం కలిగినవారై ఉండాలి. గ్రూపులో పెట్టే వివాదాస్పద, అభ్యంతరక పోస్టులను వెంటనే గుర్తించగలగాలి. ఎవరైనా సభ్యుడు అసత్య పోస్టులు పెడితే వెంటనే గ్రూపు నుంచి తొలగించాలి. గ్రూప్‌ సభ్యుడు ఎవరైనా తప్పుడు వార్త, వందతులు పోస్ట్‌ చేస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అలా చేయకపోతే తదుపరి చట్టపరమైన చర్యలకు అడ్మిన్‌ బాధ్యత వహించాల్సి వస్తుంది. 


ఈ జాగ్రత్తలు పాటిద్దాం: వివాదాస్పద వ్యక్తులకు గ్రూపులో చోటు ఇవ్వకూడదు. గ్రూప్‌లో షేర్‌ అవుతున్న అంశాలపై అడ్మిన్లకు గమనిక ఉండాలి. వివాదాస్పద పోస్టులు ఎవరైనా సభ్యుడు పెడితే దాన్ని వెంటనే తొలగించడంతోపాటు ఇతర గ్రూప్‌లలో షేర్‌ చేయకుండా హెచ్చరించాలి. వదంతులు, తప్పుడు వార్తలు షేర్‌ చేయకూడదు. తెలియని సమాచారం సోషల్‌ మీడియాలో పెట్టకూడదు. ప్రజలను తప్పుదారి పట్టించే సమాచారం, మార్ఫింగ్‌ చేసిన ఫొటోలు షేర్‌ చేయకూడదు. 


వదంతులు వ్యాప్తిచేస్తే చర్యలు

  • డీజీపీ మహేందర్‌రెడ్డి 

ప్రజల సాధారణ జీవనానికి భంగం కలిగించేలా కరోనా వైరస్‌పై సోషల్‌ మీడియాలో వదంతులు వ్యాప్తిచేయవద్దని తెలంగాణ పోలీస్‌ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. పుకార్లు వ్యాప్తిచేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకొంటాం. ఈ మేరకు బుధవారం డీజీపీ ట్విట్టర్‌ ద్వారా ప్రజలకు సూచనలు చేశారు.


logo