ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 07, 2020 , 01:57:13

ఆసిఫాబాద్‌లో ముగిసిన డీజీపీ పర్యటన

ఆసిఫాబాద్‌లో ముగిసిన డీజీపీ పర్యటన

  • భాస్కర్‌ ఆచూకీ కోసం కొనసాగుతున్న కూంబింగ్‌

కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ: కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో నాలుగు రోజుల డీజీపీ పర్యటన ఆదివారం ముగిసింది. ఉమ్మడి జిల్లా అడవుల్లో సంచరిస్తున్న మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెళ్లు అలియాస్‌ భాస్కర్‌ ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బలగాలు కూంబింగ్‌ కొనసాగిస్తున్నాయి. తిర్యాణిలోని టెక్కిగూడలో గత జూలైలో భాస్కర్‌తోపాటు ఐదుగురు సభ్యుల బృందం ఎదురుపడినప్పటి నుంచి జిల్లాలో పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. పోలీసులకు దొరికిన భాస్కర్‌ డైరీ ఆధారంగా జిల్లాలో మావోయిస్టులు బలపడేందుకు కొత్తగా రిక్రూట్‌మెంట్‌ చేస్తున్నారని, దీనికి కొందరు ఆదివాసీ నాయకులు సహకరిస్తున్నట్లు గుర్తించారు. జిల్లాలో మావోయిస్టులు బలపడేందుకు చేపడుతున్న చర్యలను కట్టడిచేయడంతోపాటు భాస్కర్‌ బృందాన్ని పట్టుకోవడం లేదా లొంగిపోయేలా చేయడం కోసమే డీజీపీ జిల్లాకు వచ్చినట్లు సమాచారం. మొదటిరోజు ప్రాణహిత నది పరీవాహక ప్రాంతంతోపాటు అడవుల మీదుగా ఏరియల్‌ సర్వే నిర్వహించారు. మావోయిస్టులను పట్టుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై పోలీసులకు దిశానిర్దేశం చేశారు. ఆదివారం మధ్యాహ్నం జిల్లా పర్యటన ముగించుకొని డీజీపీ హైదరాబాద్‌కు వెళ్లారు.

కరీంనగర్‌లో డీజీపీ సమీక్ష

కరీంనగర్‌ క్రైం: ఆసిఫాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తూ ఆదివారం సాయంత్రం డీజీపీ మహేందర్‌రెడ్డి కరీంనగర్‌లో ఆగారు. పోలీస్‌ కమిషనరేట్‌లో అతిథుల లాంజ్‌ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా అధికారులతో సమావేశమై సమీక్షించారు. శాంతి భద్రతల పరిరక్షణకు సీపీ కమలాసన్‌రెడ్డి నేతృత్వంలో తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందించారు. 


logo