ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 21:23:07

గొర్రెకుంట కేసు.. పోలీసు అధికారులకు డీజీపీ అభినంద‌న‌లు

గొర్రెకుంట కేసు.. పోలీసు అధికారులకు డీజీపీ అభినంద‌న‌లు

వరంగల్ రూరల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెకుంట సంఘటనలో తొమ్మిది మంది హత్యకు కారణమైన నిందితుడు సంజయ్ కుమార్‌కు కేవలం 25 రోజుల్లోనే శిక్ష పడేలా కృషిచేసిన వ‌రంగ‌ల్ క‌మిష‌న‌రేట్ పోలీస్ అధికారులను డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు. వరంగల్ పోలీస్ కమీషనర్ ప్రమోద్ కుమార్, డీసీపీ కె. వెంకటలక్ష్మి, ఏసీపీ జీ. శ్యామ్ సుందర్, అడిషనల్ పీపీ ఎం సత్యనారాయణ, గీసుగొండ ఇన్‌స్పెక్ట‌ర్ జె. శివరామయ్యతో సహా మొత్తం 12 మంది పోలీసు అధికారులను డీజీపీ ఘనంగా సన్మానించి పురస్కారాలను అందజేశారు. ఈ కేసులో కీలక పాత్ర వహించిన  మాజీ పోలీస్ కమిషనర్ వీ. రవీందర్‌ను సైతం డీజీపీ అభినందించారు. సన్మానం అందుకున్న వారిలో గీసుకొండ ఎస్ఐలు పీ. నాగరాజు, అబ్దుల్ రహీం, హెడ్ కానిస్టేబుళ్లు జీ. విజేందర్, ఎస్.అశోక్ కుమార్, కానిస్టేబుళ్లు జీ. దామోదర్, డీ. కిషన్, జె. లింగయ్య, హోమ్ గార్డ్ జీ. రాజు ఉన్నారు. 

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గొర్రెకుంట శివారులో 9 మంది హత్యకు గురైన సంఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. కేసును ఛేదించిన పోలీసులు సంజయ్ కుమార్‌ని నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. 25 రోజుల్లోనే అన్ని ఆధారాలతో సహా 485 పేజీల చార్జిషీట్లు దాఖలు చేశారు. విచార‌ణ‌లో దోషిగా తేల‌డంతో మొదటి అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి  జయ కుమార్ తీర్పును వెలువ‌రిస్తూ సంజయ్ కుమార్‌కు ఉరిశిక్ష విధించారు. రికార్డు సమయంలో నిందితుడిపై పకడ్బందీ చార్జిషీటు దాఖలు చేసి శిక్షపడేలా కృషి చేసిన పోలీసు అధికారులను డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి హైదరాబాద్‌లోని తన  కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. కేసును ఛేదించిన వరంగల్  పోలీసులు రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారని డీజీపీ ప్రశంసించారు.