బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 20:15:54

వనదేవతల దర్శనం ప్రారంభం

వనదేవతల దర్శనం ప్రారంభం

తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని ఆదివాసీ గిరిజన దైవాలు  సమ్మక్క-సారక్కలను భక్తులు దర్శించుకునేందుకు ఇక్కడి పూజారులు అనుమతించారు.  కరోనా విజృంభిస్తున్న కారణంగా ఏప్రిల్‌లో అమ్మవార్ల దర్శనాలను ఆపివేశారు.  అన్‌లాక్‌లో భాగంగా రాష్ట్రంలో అన్ని దేవాలయాలను కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తెరిచినా మేడారంలో అమ్మవార్లను దర్శించుకునేందుకు హైదరాబాద్‌ నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వస్తారని, గ్రామంలో కరోనా ప్రబలే అవకాశముందని నవంబర్‌ 10 వరకు దర్శనాలను నిలిపివేశారు. 

గుడి మూసి ఉన్నా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుండడం, బయటి నుంచే దర్శించుకుని వెళ్తుండడం, కార్తీక మాసం కావడంతో గుడిని తెరిచేందుకు నిర్ణయించారు. బుధవారం  అమ్మవార్లకు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులకు అనుమతిచ్చారు. కరోనా ప్రబలకుండా ఉండేందుకు దేవాదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.