ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Aug 04, 2020 , 02:00:36

నాణ్యమైన విద్యతోనే అభివృద్ధి

నాణ్యమైన విద్యతోనే అభివృద్ధి

  • ప్రపంచస్థాయి పోటీని ఎదుర్కోవడానికి ప్రైవేటు భాగస్వామ్యం అవసరం
  • అనురాగ్‌ యూనివర్సిటీ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్‌ సందేశం
  • విద్యావికాసానికి సీఎం కేసీఆర్‌ సమూల సంస్కరణలు
  • వర్సిటీ ప్రారంభోత్సవంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచస్థాయి పోటీ ని ఎదుర్కోవడానికి, సాంకేతికతను పెంచడానికి ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం అవసరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. దేశంలో నాణ్యమైన విద్యతోనే మానవ వనరుల అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడించారు. సోమవారం అనురాగ్‌ యూనివర్సిటీ ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం తన సందేశాన్ని పంపించారు. అనురాగ్‌ యూనివర్సిటీ ఒక మంచి ఉన్నత విద్యాలయంగా ఎదిగి, విద్యారంగంలో నూతన ఒరవడి సృష్టించాలన్నారు. 

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ యూనివర్సిటీ ఎదగాలని కోరుకుంటున్నానన్నారు. సోమవారం ఘట్‌కేసర్‌లో అనురాగ్‌ యూనివర్సిటీని జ్యోతి వెలిగించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యావికాసానికి సీఎం కేసీఆర్‌ సమూల సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే ప్రభుత్వ సంకల్పం తో రాష్ట్రంలో ఐదు ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పడ్డాయని అన్నారు. ఉన్నత విద్య కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను అనేక కష్టాల కోర్చి విదేశాలకు పంపుతుంటారని అన్నారు. అలాంటి వారికోసం అంతర్జాతీయ స్థాయికి అనురాగ్‌ యూనివర్సిటీ ఎదగాలని, మల్టీ నేషనల్‌ కంపెనీల్లో ఉద్యోగాలు దొరికేలా నాణ్యమైన విద్యా బోధన చేపట్టాలని సూచించారు. 

అనురాగ్‌ వర్సిటీ చైర్మన్‌ డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. 1990లో స్థాపించిన గాయత్రి ఎడ్యుకేషనల్‌ అండ్‌ కల్చరల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 1998లో లలిత డిగ్రీ కాలేజీ, 2002లో సీవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ, 2005లో లలితా ఫార్మసీ కాలేజీ, 2010లో అనురాగ్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌గా రూపాంతరం చెందిందని చెప్పారు. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ అనురాగ్‌ యూ నివర్సిటీ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో అనురాగ్‌ యూనివర్సిటీ చాన్స్‌లర్‌ డాక్టర్‌ యూబీ దేశాయ్‌, వీసీ ప్రొఫెసర్‌ రామచంద్రం, సైయంట్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి ఆ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సైదా సమీనా ఫాతిమా, సీఈవో నీలిమ, డైరెక్టర్‌ కేఎస్‌ రావు, ప్రొఫెసర్‌ విష్ణుమూర్తి, ఏవో ప్రదీప్‌ పాల్గొన్నారు.

యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలి

అనురాగ్‌ యూనివర్సిటీ ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటిస్తూ.. రాష్ట్ర యువతకు ఉద్యోగావకాశాలు అధికంగా కల్పించేలా విద్యా బోధన చేయాలి. వర్సిటీ ప్రతినిధులకు ప్రత్యేక శుభాకాంక్షలు.

- ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ వీడియో సందేశం


logo