సోమవారం 08 మార్చి 2021
Telangana - Jan 26, 2021 , 01:43:09

కేటీఆర్‌ దిద్దిన కొడంగల్‌!

కేటీఆర్‌ దిద్దిన కొడంగల్‌!

  • అభివృద్ధిపథంలో నియోజకవర్గం
  • మంత్రి దత్తత తర్వాత మరింత ప్రగతి
  • అద్దాల్లా రోడ్లు.. ఎల్‌ఈడీ వెలుగులు
  • భారీ నిధులతో బల్దియాలకు సొబగులు
  • గిరిజనుల ముఖాల్లో అభివృద్ధి ఆనందం
  • గృహాలకు మిషన్‌ భగీరథ జలం.. పొలాలకు మిషన్‌ కాకతీయ ఫలం

హైదరాబాద్‌, జనవరి 25 (నమస్తే తెలంగాణ): గత ఎన్నికలకు ముందు అభివృద్ధికి అల్లంతదూరంలో ఉన్న కొడంగల్‌ కొత్త సొబగులను సంతరించుకున్నది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. అద్దంలా మెరిసే రోడ్లు ఒకవైపు స్వాగతం పలుకుతుండగా, నాణ్యమైన విద్య, వైద్యం సహా ఇతర మౌలిక సదుపాయాలు ప్రగతికి అద్దం పడుతున్నాయి. తండాలు పంచాయతీలు కాగా, బంజారాభవన్‌తో గిరిజనులు సంబురపడుతున్నారు. బస్సులే తిరుగని గ్రామాలను ‘పల్లె వెలుగు’లు పలకరిస్తున్నాయి. తాగు నీటికే కటకటలాడిన ప్రాంతాలు పుష్కలమైన సాగునీటితో పచ్చదనాన్ని సంతరించుకుంటున్నాయి. తమ బతుకులు మారుతున్నాయంటూ రైతన్నలు మురిసిపోతున్నారు. కొడంగల్‌ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేసిన మంత్రి కేటీఆర్‌కు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు చెప్తున్నారు. 

కేటీఆర్‌ వాగ్దానమే నాంది.. 

ఎందరో లబ్ధప్రతిష్ఠులైన నాయకులకు ఓనమాలు నేర్పిన గడ్డ కొడంగల్‌. ఇక్కడి నుంచి చాలా మంది అసెంబ్లీలో అడుగు పెట్టి అధ్యక్షా..! అంటూ తమ ప్రతిష్ట పెంచుకున్నారే తప్ప సెగ్మెంట్‌ అభివృద్ధిని పట్టించుకున్న దాఖలాలు లేవు. 2018లో జరిగిన ఎన్నికల్లో సరైన తీర్పు ఇచ్చారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. ‘ఈసారి అవకాశం ఇవ్వండి.. దత్తత తీసుకొని అభివృద్ధి చేసి చూపిస్తా’ అని చెప్పిన మంత్రి కేటీఆర్‌ను కొడంగల్‌ ప్రజలు విశ్వసించారు. అప్పటి వరకు నాయకులే గెలిచారు.. కానీ ఈ ఎన్నికల్లో ప్రజలు గెలిచారు. వారే చరిత్రను తిరగరాశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డికి కొండగల్‌ పట్టం కట్టింది. మంత్రి కేటీఆర్‌ హామీ మేరకు దత్తత సెగ్మెంట్‌గా మారింది. అభివృద్ధి వైపు పరుగు మొదలైంది.

కాగితాల నుంచి కండ్ల ముందుకు

రాజకీయాల్లో రాణించేందుకు ప్రజలను నమ్మించిన నాయకులు ప్రతిపాదనలంటూ కాగితాలను చూపారు. అదిగో అభివృద్ధి అంటూ శిలాఫలకాలేశారు. నానా హడావుడి చేశారు. ఎన్నికలు వస్తున్నాయనగానే శిలఫలకాల జాతర సాగేది. ప్రతిపాదనల కాగితాల హడావుడి కనిపించేది. ఏనాడూ కార్యరూపం దాల్చేది కాదు. మౌలిక వసతులు సైతం లేక ప్రజలు అరిగోస పడేవాళ్లు. ఇప్పుడు కొడంగల్‌లో అభివృద్ధి కండ్ల ముందే కనిపిస్తున్నది. నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్‌ చొరవతో రూ. 297 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. 

తళుకులీనుతున్న తండాలు

తండాలను పంచాయతీలుగా మార్చడం వల్ల వాటి రూపురేఖలు మారాయి. 2018 వరకు వరకు గ్రామాలకు, తండాలకు కనీస రోడ్డు సౌకర్యం ఉండేది కాదు. వర్షాకాలంలో రాకపోకలకు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. గతుకుల రోడ్డుపై అంబులెన్స్‌ రాకపోకలకు తిప్పలు తప్పేది కాదు. 4కిలోమీటర్లు రావడానికి అరగంట పట్టేది. ఇలాంటి పరిస్థితులను గుర్తించిన ప్రభుత్వం ప్రాధాన్య క్రమంలో తండాలకు, గ్రామాలకు సీసీ రోడ్లు వేసింది. మరికొన్ని ప్రాంతాల్లో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. దౌల్తాబాద్‌-ముద్దూరు, కోస్గి-ముద్దూరు, రావులపల్లి-దౌల్తాబాద్‌, బొంరాస్‌పేట్‌-కోస్గి రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. 

బల్దియా బదల్‌గయా

నియోజకవర్గం పరిధిలోని కొడంగల్‌, కోస్గి బల్దియాల రూపురేఖలు మారిపోయాయి. ఒక్కో పట్టణానికి రూ. 15 కోట్ల చొప్పున రూ.30 కోట్లను అభివృద్ధికోసం ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులతో మురుగుకాల్వలు, సీసీ రోడ్లు, దుకాణ సముదాయాల నిర్మాణం, పార్కులు, రైతుల కోసం మార్కెట్లు ఏర్పాటయ్యాయి. ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల నిఘా మొదలైంది. కూరగాయలు సాగు చేసే రైతుల కోసం ప్రత్యేక విక్రయకేంద్రాలు ఏర్పాటు చేయడం సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి కేటీఆర్‌ నిత్యం ఆరా తీస్తూ తీర్చిదిద్దుతుండటం విశేషం. కోస్గిలో బస్‌డిపో, బస్టాండ్ల నిర్మాణం వేగంగా సాగుతున్నది. వీటిని ప్రారంభించేందుకు త్వరలో మంత్రి కేటీఆర్‌ కొడంగల్‌ వస్తారని స్థానిక నేతలు చెప్తున్నారు. పాలన వికేంద్రీకరణలో భాగంగా దుద్యాల, గుండుమల్‌, కొత్తపల్లి మండలాలను ఏర్పాటు చేయనున్నారు.

పుష్కరం తర్వాత పుష్కలంగా నీళ్లు


ధర్మాపూర్‌.. ఒకప్పుడు తాగునీటి ఎద్దడికి కేరాఫ్‌ గ్రామం. ఆ ఊరికి పిల్లనిచ్చేటోళ్లు కాదు. ఈ గ్రామస్థులు మూడు కిలోమీటర్ల మేర నడిచివెళ్లి చెలిమెల నుంచి నీళ్లు తెచ్చుకునేవారు. కొడంగల్‌ పరిధిలో ఏర్పాటు చేసిన మిషన్‌ భగీరథ నీటి శుద్ధి కేంద్రాల వల్ల మారుమూల తండాలకు, గ్రామాలకు స్వచ్ఛమైన నీళ్లు అందుతున్నాయి. ధర్మాపూర్‌ గ్రామస్థులకు కూడా ఇంటి వద్దే తాగునీరు పట్టుకుంటున్నారు. సాగు నీటి సమస్యను మిషన్‌ కాకతీయ కొంత వరకు తీర్చుతున్నది. చెరువులు నిండి పంటలకు సాగు నీరు అందుతున్నది. వర్షాలకు ముందే చేపట్టిన పనులతో 12 ఏండ్ల తర్వాత దౌల్తాబాద్‌ పెద్ద చెరువు నిండింది. రూ.15 కోట్లతో ఏర్పాటు చేస్తున్న చెక్‌డ్యాంలు సాగుకు నీరందిస్తున్నాయి. దీంతో పాటు ఈ ఏడాది చివరి వరకు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి అవుతున్న నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలో లక్షా 20వేల ఎకరాలకు సాగు నీరు అందనున్నది. 

దగ్గరైన విద్య..నాణ్యమైన వైద్యం..


కళాశాలలు లేకపోవడంతో కొడంగల్‌ ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యారు. ఇంటర్‌, డిగ్రీ చదవాలంటే తాండూర్‌, వికారాబాద్‌, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌కు వెళ్లాల్సి వచ్చేది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక బొంరాస్‌పేట్‌, దౌల్తాబాద్‌లో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. రూ. 2.25 కోట్లతో కొడంగల్‌లో నిర్మిస్తున్న డిగ్రీ కళాశాల పనులు తుది దశకు చేరుకున్నాయి. మంత్రి కేటీఆర్‌ చూపిన ప్రత్యేక చొరవతో బీసీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు మంజూరయ్యాయి. ప్రజల కష్టాలు గుర్తించిన ప్రభుత్వం 50 పడకలతో కొడంగల్‌లో వైద్యశాల ఏర్పాటు చేస్తున్నది. రూ. 10 కోట్లతో ఇతర దవాఖానల్లో ఆధునీకరణ పనులు మొదలయ్యాయి. 

30 ఏండ్ల తర్వాత రోడ్డు చూస్తున్నం 

ఏండ్ల నుంచి ఇక్కడే ఉంటున్నం. పిల్లబాటలోనే ఎడ్ల బండిలో పోయేటోళ్లం. ఎంతో మంది లీడర్లు వచ్చారు, పోయారు. ఏనాడూ మా తండాలను పట్టించుకోలేదు. ఇప్పుడు పంచాయతీ ఆఫీస్‌ అయ్యింది. నీళ్లు ఇంట్లకే వస్తున్నయి. రోడ్లు ఏసిండ్రు. ఈ పనులు చేస్తున్న పెద్దోళ్లకు మా తండా తరుపున దండాలు. 

-బినుబాయి, పోచమ్మతండా 

పన్నెండేండ్ల తర్వాత పొలం చేస్తున్నం 

ఇన్నేండ్లు చెరువు దాదాపుగా ఎండి పోయింది. నీటి నిల్వ తగ్గి మా పొలాలకు అందేవి కాదు. అందుకే 12 ఏండ్ల నుంచి పత్తి సాగు చేస్తున్నాం. మిషన్‌ కాకతీయ కింద చెరువు రిపేర్‌ చేసిండ్రు. పెద్ద చెరువు పూర్తిగా నిండింది. ఇప్పుడు మళ్లీ వరి వేస్తున్నం. కేటీఆర్‌ సార్‌ దత్తత తీసుకున్న తర్వాత అనేక పనులు అయితున్నయ్‌. సంతోషంగా ఉన్నది.  

-కిష్టప్ప, రైతు, దౌల్తాబాద్‌

మున్సిపాలిటీలో జోరుగా పనులు 

కోస్గి మున్సిపాలిటీలో అభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్‌ రూ. 15 కోట్లు ఇచ్చారు. వాటితో రైతులు, కూరగాయల విక్రేతల కోసం షెడ్డు నిర్మిస్తున్నం. కొద్ది రోజుల్లో అందుబాటులోకి వస్తుంది. పాత బస్టాండ్‌ బాగు చేసుకోవటంతోపాటు, కొత్తగా బస్‌ డిపో నిర్మాణం జరుగుతున్నది. వీధిలైట్లు, రోడ్ల నిర్మాణం, పారిశుద్ధ్య పనులు చురుగ్గా సాగుతున్నాయి. 

-శిరీష, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, కోస్గి

కొడంగల్‌ అభివృద్ధి మొదలైంది 

కేటీఆర్‌ దత్తత తీసుకున్న తర్వాత కొడంగల్‌ నియోజకవర్గంలో అభివృద్ధి మొదలైంది. మునుపెన్నడూ అభివృద్ధిని చూడని ప్రజలు గడిచిన రెండేండ్లుగా చేస్తున్న పనులను చూసి సంతోషపడుతున్నారు. బొంరాస్‌పేట్‌ చాలా వెనుకబడిన ప్రాంతం. ఇప్పుడిప్పుడే అభివృద్ధి ప్రారంభమైంది.

-చవాన్‌ అరుణదేశు, జెడ్పీటీసీ, బొంరాస్‌పేట్‌

కేటీఆర్‌ సార్‌కు దీవెనలు 

కూరగాయలు పండించి అమ్ముతుంటా. ఎండావాన తేడా లేకుండా బాధ పడుతుంటాం. మాకోసం మార్కెట్‌షెడ్‌ను ఏర్పాటు చేస్తున్నరు. ఇది మాకు ఎంతో ఉపయోగ పడుతది. మేం మంచిగ ఉంటున్నం. మంత్రి కేటీఆర్‌ సార్‌కు నా దీవెనలు. 

- అంజిలమ్మ, కూరగాయల వ్యాపారి, కోస్గి

VIDEOS

logo