గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 13:09:19

‘దేవాదుల ఎత్తిపోతల పథకం భూ సేకరణ పూర్తి చేయాలి’

‘దేవాదుల ఎత్తిపోతల పథకం భూ సేకరణ పూర్తి చేయాలి’

వరంగల్‌ అర్బన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాను దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా సస్యశ్యామలం చేయడం మనముందు ఉన్న లక్ష్యమని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ అన్నారు. జే. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా సస్యశ్యామలం చేయాలనే ఎజెండాతో వరంగల్ హరిత కాకతీయ హోటల్‌లో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఈ పథకంలో అనుకున్న లక్ష్యం చేరడానికి కావాల్సిన భూ సేకరణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చివరి ఎకరం వరకు నీరు అందే విధంగా ప్రణాళికలు రూపొందించి వెంటనే అమలు చేయాలన్నారు. ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే సీఎం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా మేమంతా ప్రయత్నం చేస్తామన్నారు. మంత్రి శ సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ..దేవాదుల ఎత్తిపోతల పథకంలో దాదాపు 6 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.


ఇప్పటికే 4.5లక్షల ఎకరాల్లో నీరు వచ్చింది. మిగిలిన లక్షన్నర ఎకరాలకు నీరు ఇవ్వాల్సి ఉంన్నారు. ములుగు జిల్లాకు సంబంధించి గోదావరి నది అక్కడి నుంచే వస్తున్నా.. వారికి ఆ నీరు రావడం లేదని అభిప్రాయం ఉంది. కావున లక్నవరం గొలుసు కట్టు చెరువులు, కుంటలకు నీరు ఇవ్వాలని సూచించారు.  కార్యక్రమంలో ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, మాలోతు కవిత, పూర్వ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మేల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, జెడ్పీ చైర్మన్లు కుసుమ జగదీష్, సుధీర్, నీటి పారుదల శాఖ ఉన్నతధికారులు రజత్ కుమార్, మురళీ ధర్ రావు, ఆరు జిల్లాల కలెక్టర్లు, సంబంధిత ఇతర అధికారులు పాల్గొన్నారు.