మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 01:29:38

ఉమ్మడి రాష్ట్రంలో దైవాదీనం

ఉమ్మడి రాష్ట్రంలో దైవాదీనం

  • స్వరాష్ట్రంలో దేదీప్యం
  • దేవాదుల ప్రాజెక్టుకు శంకుస్థాపనచేసి నేటికీ 20ఏండ్లు

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చేందుకు, ప్రజల దృష్టి మరల్చేందుకు అప్పటి సీఎం చంద్రబాబు పునాదిరాయి వేసిన దేవాదుల ప్రాజెక్టు.. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పురోగతి సాధించింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఏటూరునాగారం మండలం గంగారం శివారులోని దేవదుంల (దేవాదుల) వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసి నేటికి సరిగ్గా 20 ఏండ్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేండ్లు.. టీడీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఏలిన 14 ఏండ్లలో ఏం జరిగింది?.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో సాధించిన ప్రగతి ఏ స్థాయిలో ఉన్నదో?.. ప్రస్తుతం దేవాదుల కింద సాగవుతున్న ఆయకట్టే సమాధానం చెబుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో పునాది రాళ్లకే పరిమితమైన దేవాదుల.. తెలంగాణ ఏర్పడ్డాక ఈ యేడాది 11 నెలలపాటు నిరాటంకంగా పంపింగ్‌ చేసి 16 టీఎంసీల సాగు నీరు అందివ్వడం విశేషం.

అయిష్టంతో అశాస్త్రీయంగా.. 

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నుంచి తెలంగాణ ప్రజల దృష్టి మరల్చడానికి అశాస్త్రీయంగా చంద్రబాబు హడావుడిగా రూపకల్పన చేసిన ప్రాజెక్టే దేవాదుల. కరువు పీడిత మెట్ట ప్రాంతాలైన ఉమ్మడి వరంగల్‌, నల్లగొండ జిల్లాల్లోని 6.21 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని, 1541 అడుగుల ఎత్తుకు 190 కిలోమీటర్ల పరిధిలో ఎత్తిపోతల ద్వారా ఆయకట్టుకు నీరందించేందుకు గోదావరి నదిపై దేవాదుల గ్రామం వద్ద జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని 2002 జూన్‌ 16న చంద్రబాబు శంకుస్థాపన చేశారు. మూడు దశల్లో గంగారం నుంచి గోదావరి 38.182 టీఎంసీల నీటిని ఎత్తిపోసి రెండు జిల్లాల్లోని 6.21 లక్షల ఎకరాలకు (ఇందులో 77,750 ఎకరాలు రీ జనరేటెడ్‌ నీటితో సాగులోనికి వస్తాయని పేర్కొన్నారు) సాగు నీరందించాలని ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఒక టీఎంసీకి 15,360 ఎకరాలను(నిజానికి ఒక టీఎంసీతో పది వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించవచ్చు) సాగు చేయవచ్చన్న లెక్కలతో దేవాదులకు 38.182 టీఎంసీల నీటిని కేటాయించింది ఉమ్మడి ప్రభుత్వం. అందులో 2.842 టీఎంసీలు తాగునీటికి కేటాయించారు. 

అంటే నికరంగా వ్యవసాయానికి అందేవి 35.34 టీఎంసీలు మాత్రమే. సంవత్సరంలో 170 రోజులు గోదావరి నుంచి ఎత్తిపోయాలని తలపెట్టారు. గోదావరిలో నీటి మట్టం 71 మీటర్లకు చేరితే తప్ప పంపులను నడుపడం సాధ్యంకాదు. ఈ లెక్కన ఏడాదిలో 110 రోజులకు మించి పంపులు నడపడం సాధ్యం కావట్లేదు. 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టుకు నీటి నిల్వ కోసం బరాజ్‌ లేకపోవడం పెద్ద సాంకేతిక లోపం. ఈ లోపాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్‌ కంతనపల్లికి బదులుగా తుపాకులగూడెం వద్ద బరాజ్‌ (సమ్మక్క-సారలమ్మ) నిర్మాణానికి శ్రీకారంచుట్టారు. 

ఉద్యమాన్ని నీరు గార్చేందుకు.

నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో మొదలైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు కుట్రలు పన్నాడు. తెలంగాణ సమాజం దృష్టి మరల్చేందుకు 2002 జూన్‌ 16న ఆగమేఘాల మీద హెలికాప్టర్‌లో వెళ్లి దేవాదులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైంది. కేసీఆర్‌ కేంద్రంలో కార్మికశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, అప్పటి యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణను భాగస్వామ్యం చేసింది. ఈ క్రమంలో వైఎస్సార్‌ 2006లో దేవాదుల పనుల్ని ప్రారంభించారు. ఒకవైపు టీఆర్‌ఎస్‌ ప్రత్యేక రాష్ట్రం కోసం ముందుకెళ్తూనే.. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఉద్యమించింది. తెలంగాణ ప్రజలను నమ్మించడానికి యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ 2008 మార్చి 14న దేవాదులలో పర్యటించినా దేవాదుల ప్రాజెక్టు కలగానే మిగిలిపోయింది. 

నిధుల కేటాయింపు ఇలా..

ప్రాజెక్టుకు మొత్తం రూ.13,445.44 కోట్లు. ఇప్పటివరకు వెచ్చించింది 11,635.400 కోట్లు. ఇందులో ఈపీసీ పనులకు, భూ సేకరణ, ఇతర అభివృద్ధి పనులు కలిపి మొత్తంగా 2002 నుంచి 2014 నాటికి రూ.7037.012 కోట్లు మాత్రమే వెచ్చించారు. రాష్ట్రం ఆవిర్భవించాక తెలంగాణ ప్రభుత్వం మార్చి 2018 వరకు 4,598.388 కోట్లు వెచ్చించింది. మిగిలిన పనులను సైతం యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తుండటం విశేషం.  

గోదారి చెంత.. రోజంతా

స్వరాష్ట్రం సాధించిన తరువాత 2015 జనవరి రెండో వారంలో సీఎం కేసీఆర్‌ రోజంతా గోదావరి చెంతనే గడిపారు. ప్రతిపాదిత కంతనపల్లి స్థలాన్ని పరిశీలించారు. కంతనపల్లి ప్రాజెక్టు కడితే తమ గ్రామాలు ముంపునకు గురవుతాయని ఆదివాసీలు ఆందోళన చేయగా.. గ్రామస్థులకు నష్టం జరగనివ్వనని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రాజెక్టును తుపాకులగూడేనికి మార్చారు. ఉమ్మడి రాష్ట్రంలో శంకుస్థాపన చేసుకొన్న దేవాదుల పనులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడ్డాకే పరుగులు తీశాయి. 


logo