మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 11, 2020 , 02:06:35

ఆస్తుల నమోదు సర్వే సిబ్బంది నిర్బంధం

ఆస్తుల నమోదు సర్వే సిబ్బంది నిర్బంధం

  • తొర్రూర్‌ మండలం హరిపిరాలలో కాంగ్రెస్‌ నాయకుడి నిర్వాకం
  •  విచారణకు ఆదేశించిన కలెక్టర్‌

తొర్రూరు: వ్యవసాయేతర ఆస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న సర్వేకు ప్రజలంతా సంపూర్ణ సహకారం అందిస్తుంటే కాంగ్రెస్‌ నాయకులు వక్రబుద్ధిని ప్రదర్శిస్తున్నారు. శనివారం మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మం డలం హరిపిరాలలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు చెవిటి సుధాకర్‌ గ్రామంలో సర్వే చేస్తున్న సిబ్బందిని నిర్బంధించారు. సర్వేలో భాగంగా పంచాయతీ కార్యదర్శి ఆరవెల్లి దేవయ్య, కారోబార్‌ లింగం ఓ ఇంటి వద్ద వివరాలు నమోదు చేస్తున్న క్రమంలో కాంగ్రెస్‌ నాయకుడు, కార్యకర్తలతో కలిసి వారిని ఆ ఇంట్లో బంధించాడు. ఎల్‌ఆర్‌ఎస్‌ను వ్యతిరేకిస్తున్నామని, సాదా కాగితాలపైనే విక్రయాలు జరుగాలని డిమాండ్‌ చేశాడు. కొత్త రెవెన్యూ చట్టంతోపాటు ఆస్తుల నమోదుపై కాంగ్రెస్‌ నాయకులు కనీస అవగాహన లేకుండా మాట్లాడటంతో స్థానికుల్లో ఒకింత అసహనం వ్యక్తమైంది. వారు అక్కడి నుంచి వెళ్లిపోగానే జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ మంగళపల్లి శ్రీనివాస్‌ నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ నాయకులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేశారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ ఘటనపై  కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ విచారణ చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి దేవయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కాంగ్రెస్‌ నాయకులపై కేసు నమోదు చేశారు.logo