బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 19:16:54

రాష్ర్టంలో భారీ వర్షాల వల్ల ఎంత నష్టం జరిగిందంటే..

రాష్ర్టంలో భారీ వర్షాల వల్ల ఎంత నష్టం జరిగిందంటే..

హైద‌రాబాద్ : హైద‌రాబాద్‌తో పాటు రాష్ర్టంలోని ప‌లు జిల్లాల్లో ఏక‌ధాటిగా కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా విప‌రీత న‌ష్టం వాటిల్లింది. సంభ‌వించిన ఆస్తి, ప్రాణ న‌ష్ట వివ‌రాల‌ను ఆయ శాఖ‌ల అధికారులు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రిగిన స‌మీక్షా స‌మావేశంలో సీఎం కేసీఆర్‌కు తెలియ‌జేశారు. అధికారులు తెలియ‌జేసిన వివ‌రాల ప్ర‌కారం ప్రాథ‌మిక న‌ష్టం అంచనా వివ‌రాలు ఈ విధంగా ఉంది.

- రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదల వల్ల గురువారం నాటికి 50 మంది మరణించారు. వీరిలో జీహెచ్ఎంసీ పరిధిలో 11 మంది ఉన్నారు. 

- రాష్ట్ర వ్యాప్తంగా 7.35 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వీటిలో సగం పంటలకు నష్టం కలిగినా వాటి విలువ రూ.2 వేల కోట్లు ఉంటుంది. 

- హైదరాబాద్ నగరంలో 72 ప్రాంతాల్లోని 144 కాలనీల్లో 20,540 ఇండ్లు నీటిలో చిక్కుకున్నాయి. 35 వేల కుటుంబాలు ప్రభావితమయ్యాయి. ఎల్.బి. నగర్, చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్లలో వరదల ప్రభావం ఎక్కువ ఉంది. నగరంలో 14 ఇండ్లు పూర్తిగా, 65 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 445 చోట్ల బీటీ రోడ్లు, 6 చోట్ల నేషనల్ హైవేలు దెబ్బతిన్నాయి. హైదరాబాద్ నగరంలో 72 చోట్ల పునరావాస కేంద్రాలు ప్రారంభించి, ప్రభావిత ప్రజలకు తాత్కాలిక ఆవాసం, భోజనం కల్పించడం జరిగింది. రోజు దాదాపు లక్షా పది వేల మందికి భోజనం అందిస్తున్నారు. 

- రాష్ట్రంలోని 30 పట్టణాల్లో వర్షాలు, వరదల ప్రభావం ఉంది. 238 కాలనీలు జలమయమయ్యాయి. 150 చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి.

- ట్రాన్స్ కో పరిధిలో 9 సబ్ స్టేషన్లు, ఎస్.పి.డి.సి.ఎల్. పరిధిలో 15 సబ్ స్టేషన్లు, ఎన్పీడిసిఎల్ పరిధిలో 2 సబ్ స్టేషన్లలోకి నీళ్లు వచ్చాయి. ముఖ్యంగా మూసీ నదీ వెంట ఉన్న ట్రాన్స్ ఫార్మర్లు, కరెంటు స్తంభాలు కొట్టుకుపోయాయి. విద్యుత్‌శాఖ పరంగా దాదాపు రూ. 5 కోట్ల వరకు నష్టం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనా. 

- రాష్ట్ర వ్యాప్తంగా 101 చెరువు కట్టలు తెగాయి. 26 చెరువు కట్టలకు బుంగలు పడ్డాయి. జల వనరులశాఖకు రూ.50 కోట్ల వరకు నష్టం జరిగినట్లు అంచనా.

- పంచాయతీరాజ్ రోడ్లు 475 చోట్ల దెబ్బతిన్నాయి. 269 చోట్ల రోడ్లు తెగిపోయాయి. రూ.295 కోట్ల వరకు నష్టం జరిగినట్లు అంచనా. 

- ఆర్ అండ్ బి రోడ్లు 113 చోట్ల దెబ్బతిన్నాయి. ఆర్ అండ్ బి పరిధిలో రూ.184 కోట్లు, నేషనల్ హైవేస్ పరిధిలో రూ.11 కోట్లు నష్టం జరిగినట్లు అంచనా. 


భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం రూ.1,350 కోట్లు సహాయంగా అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడికి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. రైతులకు సహాయం అందించడానికి రూ.600 కోట్లు, జీహెచ్ఎంసితో పాటు ఇతర ప్రాంతాల్లో సహాయ, పునరావాస, పునరుద్ధరణ చర్యల కోసం మరో రూ.750 కోట్లు సహాయం అందించాలని సీఎం కేంద్రాన్ని కోరారు.


logo