గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 18:29:46

అన్ని ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్ లో పొందుపరచాలి

అన్ని ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్ లో పొందుపరచాలి

సిద్దిపేట : కొత్త రెవెన్యూ చ‌ట్టంలో భాగంగా, వ్యవ‌సాయ భూముల‌ మాదిరిగానే.. గ్రామాల్లోని ఇండ్లు, ఇత‌ర అన్ని ర‌కాల నిర్మాణాల‌కు కూడా భ్రదత కల్పిస్తూ ప‌ట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం అన్ని ఇండ్లను, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్ లో పొందుపరచాలని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు.

బుధవారం జిల్లాలో పర్యటించిన ఆయన జిల్లా కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్ లతో కలిసి సమీక్ష నిర్వహించారు. ధరణి పోర్టల్ లో అప్ లోడ్ చేయాల్సిన వివరాలు, తదితర అంశాలపై అన్ని మండలాల ఎంపీవోలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో ఉన్న ఇండ్లు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్ లో పొందుపరచాలని సూచించారు. సంబంధిత గ్రామాలు పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఈ సర్వే నిర్వహించాలన్నారు.


ధరణి ఆప్ లో ఆస్తుల వివరాలను నమోదు చేయడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలు, దేవాలయాలు ఇతర భూముల వివరాలను తప్పనిసరిగా పొందుపర్చాలన్నారు. ఆస్తులకు సంబంధించిన యజమాని వివరాలు, ఫొటో ను  అప్ లోడ్ చేయాలన్నారు. అనంతరం సిద్దిపేట గ్రామీణ మండలంలోని దోర్నాల గ్రామంలో పర్యటించిన ఆయన ప్రత్యక్షంగా ఓ ఇంటికి వెళ్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇంటి యజమాని నుంచి సేకరిస్తున్న ప్రక్రియను పరిశీలించారు.

ప్రజలు ఎలా స్పందిస్తున్నారు అని పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో నిర్మిస్తున్న పల్లె ప్రకృతి వనాన్ని సందీప్ కుమార్ సుల్తానియా పరిశీలించి మొక్కల పెంపకం, మొక్కలు నాటు విధానం, వనంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ అధికారి గోపాల్ రావు, డీపీవో సురేష్ బాబు, సీఈవో శ్రవణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.logo