శనివారం 06 జూన్ 2020
Telangana - May 22, 2020 , 07:02:24

స్టీల్ బ్రిడ్జితో 2 నిమిషాల్లోనే దాటొచ్చు..

స్టీల్ బ్రిడ్జితో 2 నిమిషాల్లోనే దాటొచ్చు..

బంజారాహిల్స్‌: నగరంలోనే అత్యంత ప్రధాన రహదారుల్లో బంజారాహిల్స్‌ రోడ్‌ నం3 ఒకటి. ఈ దారిలో ఉన్న  ట్రాఫిక్‌ కష్టాలు జూన్‌ రెండు నుంచి తీరనున్నాయి. ఇందుకు గాను ప్రభుత్వం పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద కొత్తగా స్టీల్‌ బ్రిడ్జి నిర్మిస్తున్నది. టీవీ 9 చౌరస్తా నుంచి నాగార్జున సర్కిల్‌ దాకా ఉన్న కిలోమీటర్‌ దూరాన్ని దాటేందుకు ప్రస్తుతం 9 నుంచి 12నిమిషాలు పడుతుండగా బ్రిడ్జి ప్రారంభం తర్వాత 2 నిమిషాల్లోనే ఈ దూరాన్ని దాటేందుకు వీలుంటుంది.

జూబ్లీహిల్స్‌ వైపు నుంచి పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌ వైపు వెళ్లే ఇరుకైన దారిని విస్తరించడంతో పాటు శ్మశానవాటికకు ఇబ్బందులు లేకుండా పైనుంచి రూ. 6కోట్ల వ్యయంతో జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్స్‌ పర్యవేక్షణ లో ‘పీవీ.రావు సంస్థ’ ఈ పనులను శరవేగంతో పూర్తి చేస్తున్నది. ఇప్పటికే 43మీటర్ల పొడవైన స్టీల్‌ బ్రిడ్జి పనులు పూర్తవగా ప్రస్తుతం బ్రిడ్జికి రెండువైపులా సుమారు 50 మీటర్ల పొడవైన అప్రోచ్‌ రోడ్డు పనులు చేస్తున్నారు. మార్చి 16న ప్రారంభమైన ఈ పనులను 151రోజుల్లో పూర్తి చేయాల్సి ఉండగా 76 రోజుల్లోనే సిద్ధం చేస్తున్నారు. సుమారు140 మంది కార్మికులు, భారీ యంత్రాల సాయంతో రేయింబవళ్లూ పనులు నిర్వహిస్తుండడంతో రికార్డు సమయంలో పూర్తి కావస్తున్నాయి. జూన్‌ 2న  రాష్ర్టావతరణ దినోత్సవం సందర్భంగా బ్రిడ్జిని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు.  

రోజుకు 2 లక్షల వాహనాలు..

మాదాపూర్‌, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌ ప్రాంతాలనుంచి వచ్చే ట్రాఫిక్‌ మొత్తం టీవీ 9 చౌరస్తా దాటిన తర్వాత నాగార్జున సర్కిల్‌ దాకా నెమ్మదిగా సాగాల్సి వస్తోంది. ఈ రోడ్డు పై రోజుకు సుమారు 2 లక్షల దాకా వాహనాలు రాకపోకలు సాగిస్తాయని ట్రాఫిక్‌ ఇంజినీరింగ్‌ అధికారులు అంచ నా వేశారు. సరిగ్గా పంజాగుట్ట శ్మశానవాటిక వద్దకు రాగానే బాటిల్‌నెక్‌ కారణంగా ట్రాఫిక్‌ ముందుకు కదిలేందుకు ఇబ్బందులు ఉండేవి. గతంలో ఈ ప్రాంతంలో రోడ్డు వెడ ల్పు కేవలం 6మీటర్లు మాత్రమే ఉండేది. రమ్య ఘటన తర్వాత మంత్రి కేటీఆర్‌ చొరవతో ఈ ప్రాంతంలో రోడ్డు విస్తరణ చేయడంతో పాటు ప్రమాదకరమైన మలుపును తొలిగించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ణయించారు.


పనులను పరిశీలించిన మేయర్‌

పంజాగుట్ట శ్మశానవాటిక ఎదురుగా నిర్మిస్తున్న స్టీల్‌ బ్రిడ్జి పనులను గురువారం మేయర్‌ బొంతు రామ్మోహన్‌  పరిశీలించారు. స్టీల్‌బ్రిడ్జి కారణంగా చట్నీస్‌ వద్ద బ్రిడ్జి పైనే గ్రీనరీతో ఫుట్‌పాత్‌ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్స్‌ డీఈ వెంకటకిరణ్‌, సర్కి ల్‌ 18 టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీ కృష్ణ కుమారి పాల్గొన్నారు.

కొత్త బ్రిడ్జి నిర్మాణంతో ఇబ్బందులు దూరం..

 పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద రహదారి బాటిల్‌నెక్‌గా మారడంతో భారీగా వచ్చే వాహనాలతో తరుచూ ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకుని శ్మశానవాటిక మీదుగా స్టీల్‌బ్రిడ్జి నిర్మాణమవుతోంది.బ్రిడ్జి మీద 6 మీటర్ల వెడల్పు రోడ్డుతో పాటు మీటర్‌ మేర ఫుట్‌పాత్‌ కూడా అందుబాటులోకి రానుంది. చట్నీస్‌ తర్వాత బ్రిడ్జి నుంచి కిందకు దిగిన తర్వాత వాహనాలు సాఫీగా వెళ్లేందుకు సుమారు 12మీటర్ల మేర రోడ్డును వెడల్పు చేస్తు న్నాం. రాబోయే కాలంలో సుమారు 14 మీటర్ల రోడ్డును అందుబాటులోకి తెచ్చేలా విస్తరణపనులు చేపట్టనున్నాం.

       -వెంకట్‌ కిరణ్‌, డీఈ, జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్స్‌


logo