శనివారం 06 మార్చి 2021
Telangana - Jan 19, 2021 , 02:25:21

స్వదేశీ టీకానే వేసుకుంటా!

స్వదేశీ టీకానే వేసుకుంటా!

హైదరాబాద్‌, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ‘భారత్‌ బయోటెక్‌ సంస్థ దేశంలో అభివృద్ధిచేసిన కొవాగ్జిన్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది. మన తెలంగాణ గడ్డ నుంచి వచ్చిన వ్యాక్సిన్‌ అది. అందుకే నేను కొవాగ్జిన్‌నే వేసుకుంటాను’ అని డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ జీ శ్రీనివాసరావు తెలిపారు. టీకాలు వేసుకోవటంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని స్పష్టం చేశారు. కొవిషీల్డ్‌తో పాటు కొవాగ్జిన్‌ టీకా నమ్మకమైందని చెప్పారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా మన రాష్ట్రంలో హెల్త్‌కేర్‌ వర్కర్లు టీకాలు వేసుకొనేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. వ్యాక్సిన్లపై ఉన్న అపోహలను తొలగించేందుకు హెల్త్‌కేర్‌ వర్కర్లు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు 20వేల కొవాగ్జిన్‌ డోసులు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయని, రెండు మూడు రోజుల్లో వీటిని పంపిణీ చేస్తామని తెలిపారు. కొవాగ్జిన్‌ డోసులు తక్కువగా రావటం వల్లనే ప్రస్తుతం వేయడం లేదన్నారు. కొవాగ్జిన్‌ టీకా ఇచ్చే సమయంలో లబ్ధిదారుల నుంచి అంగీకార పత్రం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు టీకాలు తీసుకున్న హెల్త్‌కేర్‌ వర్కర్లు అందరూ క్షేమంగా ఉన్నారని చెప్పారు.

సైడ్‌ ఎఫెక్ట్స్‌  వచ్చిన ఇద్దరూ క్షేమం

ఉప్పల్‌ దవాఖానలో టీకా వేసుకున్న నవీన, జనగామ జిల్లా పాలకుర్తి ప్రభుత్వ దవాఖానలో టీకా వేసుకున్న సీహెచ్‌వో కొత్తపల్లి విజయలక్ష్మి ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు తెలిపారు. నవీనకు వాంతులు, అలసట, మత్తు వంటి లక్షణాలు కనిపించగా, విజయలక్ష్మి కండ్లు తిరిగి పడిపోయారు. నవీనకు గాంధీ దవాఖానలో, విజయలక్ష్మికి జనగామ ఏరియా హాస్పిటల్‌లో చికిత్స అందించారు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు.

VIDEOS

logo