మోమిన్‌పేట, మే 29: ఎయిర్ గన్‌తో ఓ డిప్యూటీ తాసిల్దార్ హల్‌చల్‌చేశాడు. ఓ యువకుడిని బెదిరించి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన వికారాబాద్‌లో చోటుచేసుకున్నది. సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కమలానగర్‌కు చెందిన ప్రణీత్ శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో సాకేత్‌నగర్‌లోని పార్కులో వాకింగ్ పూర్తి చేసుకొని టాయిలెట్ కోసం గౌలికర్ ఫంక్షన్ హాలు వెనుకభాగం వైపు వెళ్లాడు. వికారాబాద్ కలెక్టరేట్లోని పౌరసరఫరాలశాఖలో డిప్యూటీ తాసిల్దార్‌గా పనిచేసే షేక్ ఫయాజ్ అహ్మద్ అదే సమయంలో అక్కడికి వచ్చారు. కారు దిగి ‘ఇక్కడ ఎందుకు టాయిలెట్ చేస్తున్నావ్’ అని బూతులు తిట్టాడు. ‘ఇక్కడి నుంచి వెళ్లిపో.. లేకపోతే కాల్చి చంపేస్తా’ అంటూ ఎయిర్‌గన్ తీసి బెదిరించాడు. ప్రణీత్ భయంతో గట్టిగా అరిచి కాలనీవాసులను పిలిచాడు. వారు వచ్చి చూడగా అహ్మద్ మారణాయుధాలు చూపిస్త్తూ కారులో వెళ్లిపోయాడు. ఈ విషయమై ప్రణీత్ పోలీసులకు సమాచారం అందించడంతో ఫయాజ్ను అదుపులోకి తీసుకొన్నారు. అతడి నుంచి ఎయిర్ గన్, ఇతర మారణాయుధాలు, రెండు సెల్ఫోన్లతోపాటు కారు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసిన పోలీసులు.. డిప్యూటీ తాసిల్దార్‌ను శనివారం రిమాండ్‌కు తరలించారు.