సోమవారం 25 జనవరి 2021
Telangana - Dec 28, 2020 , 01:34:00

సన్నకారు రైతులకు ముందుగా..

సన్నకారు రైతులకు ముందుగా..

  • పది రోజులపాటు రైతుల ఖాతాల్లో జమ
  • విజయ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాఖాతాదారులకు కొంత ఆలస్యం! 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతుబంధు పథకం కింద యాసంగి పెట్టుబడి సాయం ముందుగా సన్న, చిన్నకారు రైతుల ఖాతాల్లో జమకానున్నది. తక్కువ సాగుభూమి కల్గిన పట్టాదారు మొదలుకొని ఎక్కువ పట్టాదారు వరకు రోజువారీగా నగదును బ్యాంకుల్లో జమ చేయనున్నట్టు అధికారికవర్గాలు వెల్లడించాయి. గతంలో ఒక రైతుకు వివిధ ప్రాంతాల్లో సాగు భూమి ఉన్నప్పటికీ ఆధార్‌ నంబర్‌ ఆధారంగానే ఒకేదఫా రైతుబంధు నగదును బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. ఈసారి అలాకాకుండా సర్వేనంబర్లలో భూమి ఆధారంగా బ్యాంకుఖాతాల్లో జమ చేయనున్నారు. బ్యాంకుల విలీనం కారణంగా విజయ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్యాంకుల్లో ఖాతాలున్న రైతులకు రైతుబంధు పెట్టుబడి సాయం జమ కొంత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి.

 విలీనంతో ఆయాబ్యాంకుల ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లు మారాయి. దీంతో అందులోని ఖాతాదారుల అకౌంట్లలో మార్పులు చేయాల్సి ఉన్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. రెండు బ్యాంకుల్లో ఖాతాలున్న రైతుల నుంచి స్థానిక ఏఈవోలు ఆధార్‌, బ్యాంక్‌ అకౌంట్‌, ఐఎఫ్‌ఎస్‌సీ నంబర్లను సేకరిస్తున్నారు. దీంతో ఆ ఖాతాదారుల సమాచారం అప్‌లోడ్‌ అయిన వెంటనే వారి ఖాతాల్లో రైతుబంధు పెట్టుబడి సాయం జమచేయనున్నారు. అదేవిధంగా కొత్త పట్టాదారు రైతులైన 1.70 లక్షల మంది  స్థానిక ఏఈవోల వద్ద తమ ఆధార్‌, బ్యాంక్‌ అకౌంట్‌, ఐఎఫ్‌ఎస్‌సీ నంబర్లు అందజేశాక పరిశీలన పూర్తిచేసి వారి ఖాతాల్లో జమ చేయనున్నట్టు వ్యవసాయ అధికారులు వెల్లడించారు.


logo