శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 11, 2020 , 21:15:13

ఒకే విభాగంగా జలవనరుల శాఖ: సీఎం కేసీఆర్‌

ఒకే విభాగంగా జలవనరుల శాఖ: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: వివిధ విభాగాల కింద ఉన్న నీటిపారుదల శాఖ ఇక జలవనరుల శాఖగా కొనసాగుతుందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదల రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా జల వనరుల శాఖను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, తర్వాత పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందని, సాగునీటి వసతులు పెరిగాయని సీఎం అన్నారు. ప్రాజెక్టులు, కాలువలు, రిజర్వాయర్లు, పంపుహౌజ్‌లు, ఆయకట్టు పెరిగినందున పనిభారం కూడా పెరిగిందని పేర్కొన్నారు. మారిన పరిస్థితికి అనుగుణంగా జల వనరుల శాఖలో సీఈలు బాధ్యులుగా అధిక ప్రాదేశిక ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నామని, జల వనరుల శాఖ అంతా ఒక విభాగంగానే పనిచేస్తుందని సీఎం ప్రకటించారు. జల వనరులశాఖ పునర్వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి మంగళవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు.

క్షేత్రస్థాయిలో ప్రస్తుతం 13 చీఫ్ ఇంజినీర్ల ప్రాదేశిక ప్రాంతాలుంటే, వాటి సంఖ్యను 19కి పెంచాలని సీఎం కేసీఆర్‌ ఈ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. గతంలో భారీ, మధ్యతరహా, చిన్నతరహా, ఐడీసీలాంటి వివిధ విభాగాల కింద ఉన్న నీటి పారుదల శాఖ ఇకపై కేవలం జల వనరుల శాఖగా మాత్రమే కొనసాగుతుందన్నారు. కాగా, పాకాల ప్రాజెక్టు కింద కాలువలను పునరుద్ధరించాలని, కాకతీయుల కాలంలో నిర్మించిన కాలువలు శిథిలమైపోయాయని, వీటిని పునరుద్ధరించడం ద్వారా 30 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ముఖ్యమంత్రికి విన్నవించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కాకతీయులు నిర్మించిన పాకాల కాలువలను పునరుద్ధరించడం అంటే వారసత్వాన్ని కాపాడుకోవడమే అని అన్నారు. వెంటనే అంచనాలు తయారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. 


logo