ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 02:17:06

పాత భవనాల కూల్చివేత ఆరంభం

పాత భవనాల కూల్చివేత ఆరంభం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పాత సచివాలయం కూల్చివేత పనులు సోమవారం అర్ధరాత్రి నుంచి మొదలయ్యాయి. వచ్చే ఏడాది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి కొత్త సచివాలయంలో కొలువుదీరాలన్న లక్ష్యం దిశగా పనులను వేగంగా చేపడుతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్‌ నగర సీపీ అంజనీకుమార్‌ కూల్చివేత పనులను పర్యవేక్షిస్తున్నట్టు తెలిసింది. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌.. రోడ్లు భవనాలశాఖ అధికారులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నట్టు సమాచారం. ట్రాఫిక్‌ మళ్లింపు, భద్రత తదితర అంశాలను పోలీస్‌ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. భవనాల కూల్చివేత నేపథ్యంలో ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురుకాకుండా బీఆర్కేభవన్‌లోని అన్ని కార్యాలయాలకు ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది.

సీబ్లాక్‌ నుంచి కూల్చివేతలు మొదలు

పాత సచివాలయం కూల్చివేతను మొదట ‘సీ’ బ్లాక్‌ నుంచి ప్రారంభించారు. ఆ దిశగా రాకపోకలను నిషేధించి, ట్రాఫిక్‌ను మళ్లించారు. భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. చుట్టుపక్కల భవనాలకు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకూడదన్న సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. శిథిలాలు ఎగిరిపడకుండా ఆధునిక పద్ధతులు, ఆధునిక యంత్రాలు ఉపయోగిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు అన్ని భవనాల పైభాగాలను కూల్చివేసినట్టు తెలిసింది. రెండు మూడు రోజుల్లో అన్ని భవనాలను నేలమట్టం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. శిథిలాల తరలింపును నెలాఖరుల్లా పూర్తి చేయనున్నట్లు సమాచారం.

స్టోన్‌ బిల్డింగ్‌ నేలమట్టం

మింట్‌ కాంపౌండ్‌ స్టోన్‌ బిల్డింగ్‌ అంటే తెలియనివారుండరు. పురాతన ఈ కట్టడం మంగళవారం నేలమట్టమయ్యింది. వందల ఏండ్ల క్రితం నిర్మించిన ఈ భవనం స్థానంలో ఒకప్పుడు మొదటి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఉండేది. మొన్నటివరకూ ఈ భవనంలో ఉన్న విద్యుత్‌శాఖ కార్యాలయాలను మార్చి నెలలోనే వేరే చోటుకు తరలించారు. 

కాంగ్రెస్‌ నేతలు అడ్డుకునే ప్రయత్నం

కొత్త సచివాలయాన్ని నిర్మించాలని  నిర్ణయించిన తర్వాత కాంగ్రెస్‌ నేతలు పాత భవనాన్ని కూల్చరాదంటూ కోర్టును వెళ్లి స్టే తెచ్చారు. దీంతో దాదాపు ఏడాదిపాటు కొత్త సచివాలయం నిర్మాణ పనులు ఆగిపోయాయి. 2019 జూన్‌ 27న ముఖ్యమంత్రి కే చంద్ర    శేఖర్‌రావు ప్రస్తుత ‘డీ’ బ్లాక్‌ సమీపంలో కొత్త సచివాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ రోజు నుంచి పనులు జరిగి ఉంటే ఈపాటికి అన్ని హంగులతో నూతన సచివాలయం అందుబాటులోకి వచ్చేది. కానీ కాంగ్రెస్‌ నేతల వల్ల ఏడాది కాలం వృథా అయింది.

విధాన పరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం

భవనాల నిర్మాణం లేదా కూల్చివేత అనేది ప్రభుత్వాలు తీసుకునే విధానపరమైన నిర్ణయం. విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడానికి కోర్టులకు చాలా తక్కువ అవకాశం ఉంటుంది. రాజ్యాంగం లేదా చట్టాలు లేదా ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురైనప్పుడు మాత్రమే రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సచివాలయ భవనాల కూల్చివేత, నూతన భవన నిర్మాణానికి సంబంధించిన నిర్ణయంలో చట్టపరమైన లోపాలేవీ మాకు కనిపించలేదు. మంత్రిమండలి నిర్ణయంలో జోక్యం చేసుకోలేము. విస్తృత ప్రజాప్రయోజనం కోసం నిధులు ఖర్చుపెట్టడం ప్రభుత్వ విచక్షణపై ఆధారాపడి ఉంటుంది. సదరు ఖర్చు అవసరమైనదా? కాదా? అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. 

- చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పుగవర్నర్‌ అనుమతి అవసరం లేదు

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 8 ప్రకారం ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చాలంటే గవర్నర్‌ అనుమతి కావాలన్నది పిటిషనర్ల పసలేని వాదన. గరిష్ఠంగా పదేండ్ల వరకు హైదరాబాద్‌ కామన్‌ క్యాపిటల్‌ అని విభజనచట్టం సెక్షన్‌ 8 చెప్తున్నది. కానీ ఆంధ్రప్రదేశ్‌కు వేరే రాజధాని ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌ కామన్‌ క్యాపిటల్‌గా ఉండబోదు. ఇరు రాష్ర్టాలకు ప్రభుత్వ భవనాల కేటాయింపు అంశం కూడా మనుగడలో ఉండదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాజధాని ఏర్పడిన తర్వాత పునర్విభజన చట్టంలోని కొన్ని సెక్షన్లు గుర్తింపును కోల్పోయి కాలగర్భంలో కలిసిపోతాయి.

- హైకోర్టు ధర్మాసనం


logo