గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 01:52:58

ప్రమాదంలో ప్రజాస్వామ్యం

ప్రమాదంలో ప్రజాస్వామ్యం

 • నిరంకుశత్వంలోకి జారుకుంటున్న దేశాలు
 • ఇప్పటికే నియంతల పాలనలో 92 రాజ్యాలు
 • భారతదేశ ప్రజాస్వామ్యానికీ పెను ముప్పు
 • స్వేచ్ఛాయుత దేశాల్లో 10 నుంచి 51వ స్థానానికి
 • ప్రజాస్వామ్య హోదా కోల్పోయే ప్రమాదం
 • గోథెన్‌బర్గ్‌ యూనివర్సిటీ నివేదిక వెల్లడి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: భారత్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. దశాబ్దాలుగా విజయవంతంగా పార్లమెంటరీ ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నది. కానీ.. గడిచిన కొన్నేండ్లుగా ఆ ప్రతిష్ఠ మసకబారుతున్నది. క్రమంగా నిరంకుశ పాలనవైపు జారిపోతున్నది. ‘దేశాన్ని స్వేచ్ఛగా ఉండనీయండి’ అంటూ ఓ మహిళ అరెస్టు కేసుపై విచారణ సందర్భంగా గత బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహించింది కూడా. ఈ ఆందోళనకర పరిణామాలు కేవలం భారత్‌కు మాత్రమే పరిమితమైనవి కాదు. ప్రపంచం అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. స్వీడెన్‌కు చెందిన గోథెన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఓ అధ్యయనంలో ప్రపంచం నిరంకుశ పాలన వైపు వేగంగా జారిపోతున్నదని వెల్లడైంది. 

10 నుంచి 51వస్థానానికి భారత్‌

గోథెన్‌బర్గ్‌ అధ్యయనం భారతదేశం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో 2001లో పదో స్థానంలో ఉన్న భారత్‌ 2019 నాటికి 51వ స్థానానికి పడిపోయింది. భారత్‌లో నిరంకుశత్వ పోకడలు గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరిగిపోయాయని నివేదిక తెలిపింది. భారత్‌ తన ప్రజాస్వామ్య హోదాను కూడా కోల్పోయే స్థితికి చేరుకున్నదని వ్యాఖ్యానించింది. 2001 తరువాత ప్రపంచవ్యాప్తంగా నియంతృత్వ దేశాల సంఖ్య అత్యధికంగా 92కు చేరుకున్నదని వెల్లడించింది. 

నివేదికలోని ముఖ్యాంశాలు

 • ప్రపంచవ్యాప్తంగా 2009లో 54 శాతం ఉన్న ప్రజాస్వామ్య దేశాల సంఖ్య 2019 నాటికి 49 శాతానికి పడిపోయింది.
 • 2009లో కేవలం 6 శాతం మంది నియంతృత్వం కింద బతికితే 2019 నాటికి వారి సంఖ్య 34 శాతానికి పెరిగింది. 
 • 2009లో ప్రజాస్వామ్యానికి అనుకూలంగా 27% మంది ఉద్యమించగా, 2019లో అది 44 శాతానికి పెరిగింది.
 • విద్యాస్వేచ్ఛ పదేండ్లలో 19% నుంచి 13 శాతానికి తగ్గింది.
 • సభలు, సమావేశాల ద్వారా నిరసన తెలిపే హక్కు 14శాతం క్షీణించింది.