e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home Top Slides యునెస్కో గుర్తింపునివ్వాలి

యునెస్కో గుర్తింపునివ్వాలి

యునెస్కో గుర్తింపునివ్వాలి
  • వారసత్వ కట్టడంగా రామప్పకు అర్హత
  • కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రుల వినతి
  • కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌తో సమావేశం

విఖ్యాత కాకతీయ సామ్రాజ్య ప్రాభవానికి, వెయ్యేండ్ల తెలంగాణ నాగరికతా వైభవానికి ప్రతీక అయిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉన్నది. 2014లో తెలంగాణ ఆవిర్భవించినప్పటినుంచి ఈ ప్రయత్నాలు మరింత తీవ్రంగా జరుగుతున్నాయి. తాజాగా బుధవారం రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, అధికారులు.. కేంద్ర పర్యాటకశాఖ మంత్రిని కలిసి మళ్లీ అదే విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌/ వరంగల్‌ జూన్‌ 23 (నమస్తే తెలంగాణ): కాకతీయుల చారిత్రక సంపదకు నెలవైన రామప్ప దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మరోసారి విజ్ఞప్తిచేసింది. రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించటానికి కావాల్సిన ప్రక్రియ దాదాపుగా పూర్తి కావచ్చిందని, ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేసి గుడికి యునెస్కో గుర్తింపునకు కృషిచేయాలని కోరింది. బుధవారం రాష్ట్ర మంత్రులు వీ శ్రీనివాస్‌గౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఎంపీలు బండా ప్రకాశ్‌, పసునూరి దయాకర్‌, మాలోత్‌ కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి.. యువజన సర్వీసులు, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌రాజు, కాకతీయ హెరిటేజ్‌ కన్వీనర్‌ ఎం పాండురంగారావు, టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఈడీ శంకర్‌రెడ్డి తదితరులు ఢిల్లీలో కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పాటిల్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఆలయానికి యునెస్కో గుర్తింపుకోసం రాష్ట్ర ప్రభుత్వం 2015 నుంచే ప్రయత్నాలు చేస్తున్నది. యునెస్కో అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆన్‌ మాన్యుమెంట్‌ అండ్‌ సైట్స్‌ (ఐకోమాస్‌) ప్రతినిధిగా వాసుపోశానందన్‌ 2019 సెప్టెంబరు 25న రామప్పకు వచ్చారు. ప్రపంచ వారసత్వ కట్టడాల ప్రతిపాదనల ఆమోదంపై 2020 ఫిబ్రవరిలో 21 దేశాల ప్రతినిధుల సమావేశం చైనాలో జరగాల్సిఉన్నది. కరోనా కారణంగా ఈ సమావేశం వాయిదాపడింది. ఈ సమావేశం ఎప్పుడు జరిగినా రామప్ప గుడికి సానుకూల నిర్ణయం వస్తుందని చారిత్రక నిఫుణులు ఆశాభావంతో ఉన్నారు.

- Advertisement -

ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు కేంద్రం తీరు
వాస్తవానికి ఈ ఆలయ నిర్వహణను కేంద్రంలోని ప్రభుత్వాలు పట్టించుకోలేదు. 800 ఏండ్ల క్రితం నాటి గొప్ప కట్టడంలో అవసరమైన చిన్నచిన్న మరమ్మతులను కూడా చేయలేదు. కేంద్రప్రభుత్వ పురావస్తుశాఖ పరిధిలో ఉండే ఈ ఆలయానికి గుర్తింపు ఉన్నస్థాయిలో దీన్ని పట్టించుకోలేదు. రామప్ప ఆవరణలోని కామేశ్వర ఆలయం శిథిలావస్థకు చేరడంతో దీన్ని పునరుద్ధరించాలని నిర్ణయించింది. పునరుద్ధరణ కోసం 2011లో కామేశ్వర ఆలయన్ని విప్పిపెట్టారు. 2013 నాటికే దీన్ని పూర్తి చేయాలని అనుకున్నా.. ఈ రోజుకు కూడా పనులు మొదలుకాలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎన్నిసార్లు కోరినా కేంద్రం పట్టించుకోలేదు. వానల వల్ల 2017 ఆగస్టులో రామప్ప ఆలయ తూర్పు ప్రహరి కుంగిపోయింది. 40 మీటర్ల మేర కూలింది. హైకోర్టు జోక్యంతో కేంద్ర పురావస్తుశాఖ అధికారులు స్పందించి మరమ్మతు పనుల ప్రతిపాదనలు సిద్ధంచేశారు. కేంద్రం 2018 జనవరిలో రూ.1.15 కోట్లు మంజూరుచేసింది. ఆరు నెలల్లో మరమ్మతుల పూర్తికి లక్ష్యంగా పెట్టుకొని మూడేండ్లు దాటినా ఏమీ కాలేదు. ఈ నెలాఖరులోపు పనులు పూర్తి కాకుంటే కేంద్రం ఇచ్చిన నిధులు వెనుకకు పోతాయి. రామప్ప గుడి నుంచి చెరువుకట్ట దాకా రోడ్డుకు రూ.1.20 కోట్లు, గార్డెన్‌లో అంతర్గత రోడ్ల కోసం కేంద్రం రూ.35 లక్షలు మంజూరుచేసినా పనులు జరుగలేదు.

ప్రతి శిల్పం దేనికదే ప్రత్యేకం
కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి సేనాధిపతి రేచర్ల రద్రుడు 1213 సంవత్సరంలో రామప్ప ఆలయాన్ని నిర్మించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో ఉన్నదీ ఆలయం. కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రతీక ఇది. గుడిలోని స్తంభాలు, దూలాలు, ఆలయ ద్వారాలు, గోడలు, గోపురంపై చెక్కిన శిల్పం కూడా మనతో మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది. వివిధ భంగిమల్లో చెక్కిన మదనిక, నాగిని శిల్పాలు కాకతీయుల శిల్పకళాభిరుచులకు తార్కాణాలు. ఆలయ ఆవరణలోని నంది విగ్రహం.. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి, చెవులు రిక్కించి శివుడు ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా? అన్నట్టు ఉంటుంది. ముందుభాగంలో ఏ దిశ నుంచి చూసినా ఆ నంది మనల్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలోని నంది మండపం, కామేశ్వర, కాటేశ్వర ఆలయాలు చూడదగ్గవి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యునెస్కో గుర్తింపునివ్వాలి
యునెస్కో గుర్తింపునివ్వాలి
యునెస్కో గుర్తింపునివ్వాలి

ట్రెండింగ్‌

Advertisement