గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 18, 2020 , 00:22:48

15 మంది ఐఎస్‌ ఉగ్రవాదులకు జైలుశిక్ష

15 మంది ఐఎస్‌ ఉగ్రవాదులకు జైలుశిక్ష

  • దోషుల్లో ముగ్గురు హైదరాబాదీలు
  • ఉగ్ర కుట్ర కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు సాగించేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా ముస్లిం యువతను ఆకర్షించేందుకు కుట్ర పన్నారన్న కేసులో ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన 15 మందికి ఢిల్లీ కోర్టు శుక్రవారం వివిధ రకాల జైలుశిక్ష విధించింది. శిక్ష పడినవారిలో హైదరాబాద్‌కు చెందినవారు ముగ్గురున్నారు. ప్రధాన నేరస్థుడు నఫీస్‌ఖాన్‌కు పదేండ్ల జైలు, మరో ముగ్గురికి ఏడేండ్లు, ఇద్దరికి ఆరేండ్లు, తొమ్మిది మందికి ఐదేండ్ల చొప్పున జైలుశిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి ప్రవీణ్‌సింగ్‌ తీర్పును వెలువరించారు. 

దోషులందరికీ జరిమానా కూడా విధించారు. ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా (ఐఎస్‌ఐఎస్‌)కు చెందిన ఉగ్రవాదులు దేశవ్యాప్తంగా ముస్లిం యువతను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్టు గుర్తించిన జాతీయ విచారణ సంస్థ (ఎన్‌ఐఏ) 2015, డిసెంబర్‌ 9న ఓ కేసు నమోదు చేసింది. ఐఎస్‌ ఉగ్రవాదులు జునూద్‌-ఉల్‌-ఖలీఫా-ఫిల్‌-హింద్‌ పేరిట ఒక ఆన్‌లైన్‌ను గ్రూప్‌ను ఏర్పాటుచేసుకున్నట్టు దర్యాప్తులో తేలింది. ఉగ్రవాద సంస్థలు ఆన్‌లైన్‌ విధానంలో యువతను చేర్చుకోవడం ఇదే మొదటిసారి. దర్యాప్తులో భాగంగా ఎన్‌ఐఏ అధికారులు దేశవ్యాప్తంగా జరిపిన సోదాల్లో మొత్తం 19 మందిని అరెస్టు చేయగా, 15 మంది నిందితులుగా తేలారు. 

శిక్షఖరారైన వారిలో హైదరాబాద్‌లోని మాదాపూర్‌కు చెందిన నఫీస్‌ఖాన్‌, టోలీచౌకికి చెందిన మహ్మద్‌ షరీఫ్‌ మొయినుద్దీన్‌, సైదాబాద్‌కు చెందిన మహ్మద్‌ ఒబేదుల్లా ఉన్నారు. వీరిలో నఫీస్‌ఖాన్‌కు 10ఏండ్ల కఠిన కారాగారశిక్ష, రూ. 1,03,000 జరిమానా, మొయినుద్దీన్‌, ఒబేదుల్లాలకు ఒక్కొక్కరికి ఐదేండ్ల కఠినకారాగార శిక్ష, రూ.38వేల చొప్పున జరిమానా విధించారు. మిగిలిన 12 మంది ముదాబ్బీర్‌ ముస్తాక్‌షేక్‌, అబుఅనస్‌, ముఫ్తి అబుస్‌సమీ, అజార్‌ఖాన్‌, అంజద్‌ఖాన్‌, ఆసిఫ్‌ అలీ, మహ్మద్‌ హుస్సేన్‌, సయ్యద్‌ ముజాహిద్‌, ఎండీ ఆలీం, ఎండీ అఫ్జల్‌, సోహైల్‌ అహ్మద్‌, నజ్ముల్‌ హుడాకు ఆరు, ఏడేండ్ల చొప్పున జైలుశిక్షతోపాటు జిమానా విధించారు. 


logo