మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 05, 2020 , 12:33:43

అభివృద్ధి నిరోధకుల వల్లే రహదారి విస్తరణ పనుల జాప్యం

అభివృద్ధి నిరోధకుల వల్లే రహదారి విస్తరణ పనుల జాప్యం

సూర్యాపేట : అభివృద్ధి నిరోధకుల వల్లే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూర్యాపేట పట్టణ ప్రధాన రహదారి విస్తరణ పనులు జాప్యం అవడానికి కారణం అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, ఇతర అధికారులతో కలిసి మెయిన్ రోడ్ విస్తరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారులను కలిసిన మంత్రి వారి నుంచి సూచనలను అడిగి తెలుసుకున్నారు. విస్తరణలో భాగంగా పీఎస్సార్ సెంటర్ లో ప్రస్తుతం ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహాన్నికొద్దిగా ముందుకు జరిపి సరికొత్త హంగులతో తిరిగి నెలకొల్పేందుకు వ్యాపారులను ఒప్పించారు.

రహదారి విస్తరణ పనుల్లో చేపట్టాల్సిన విధానాలపై అధికారులు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. సూర్యాపేట మెయిన్ రోడ్ విస్తరణ కోసం పట్టణ ప్రజలు మూడు దశాబ్దలుగా ఎదురుచూస్తున్నారన్నారు. 2018 ఎన్నికల హామీలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ తో మాట్లాడి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించాం. వ్యాపారులు, ప్రజలకు ఇబ్బంది లేకుండా విస్తరణ పనులు చేపడితే పట్టణ అభివృద్ధి ఇష్టం లేని ఒకరిద్దరు రాజకీయాలు చేసి కోర్టు స్టే తేవడంతో విస్తరణ పనులు జాప్యం అవుతున్నాయని మంత్రి తెలిపారు.


అభివృద్ధి నిరోధకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రెండు నెలల్లో రహదారి విస్తరణ పనులు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, రాష్ట్ర కార్యదర్శి వైవీ, ఉప్పల ఆనంద్ పాల్గొన్నారు.logo