శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 07, 2020 , 00:49:34

డిగ్రీ ఫైనలియర్‌ పరీక్షలు తప్పనిసరి

డిగ్రీ ఫైనలియర్‌ పరీక్షలు తప్పనిసరి

  • ఆదేశాలు జారీ చేసిన కేంద్ర హోంశాఖ
  • లేకపోతే సర్టిఫికెట్‌ చెల్లుబాటు కాదు
  • యూజీసీ నిబంధనలు పాటించాల్సిందే
  • ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అన్ని యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో ఫైనలియర్‌ పరీక్షల నిర్వహణకు కేంద్ర హోంశాఖ అనుమతినిచ్చింది. యూజీసీ మార్గదర్శకాలు, విద్యాక్యాలెండర్‌ ప్రకారం ఫైనలియర్‌ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని కేంద్రం ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సెప్టెంబర్‌ నెలాఖరులోగా పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. దిగువ తరగతుల కోసం కూడా పరీక్షల టైంటేబుల్‌ ఇవ్వాలని మార్గదర్శకాల్లో తెలిపారు. గతంలో ఫైనలియర్‌లో ఫెయిలైన విద్యార్థులు కూడా పరీక్షలు రాయాల్సిందేనని తేల్చిచెప్పారు. కేంద్ర ఆదేశాలపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి స్పందించారు. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం అన్ని వర్సిటీలు, విద్యాసంస్థల్లో ఫైనలియర్‌ పరీక్షలను తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్షలు నిర్వహించకుండా పైతరగతులకు ప్రమోట్‌ చేసే అవకాశాలున్నా, ఫైనలియర్‌కు మాత్రం ఆ అవకాశం లేదని వెల్లడించారు. కేంద్ర మార్గదర్శకాల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తుదినిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. కోర్టులకు వెళ్లినా యూజీసీ మార్గదర్శకాలనే సమర్ధించే అవకాశాలుంటాయన్నారు. 

పట్టాలకు విలువ ఉండదు

యూజీసీ నిబంధనలను కాదని పరీక్షలు నిర్వహించకుండా పట్టాలు ప్రదానం చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని పాపిరెడ్డి చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలకు ఈ డిగ్రీలు చెల్లుబాటు కావని తెలిపారు. యూజీసీ మార్గదర్శకాలపై యూనివర్సిటీల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతిస్తే ఫైనలియర్‌ పరీక్షలు నిర్వహించడానికి త్వరలోనే పరీక్షల తేదీలను ప్రకటిస్తామన్నారు.


logo