గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Sep 23, 2020 , 17:17:07

బాయికాడ మోటర్లకు మీటర్లు రావొద్దంటే బీజేపీని ఓడించండి

బాయికాడ మోటర్లకు మీటర్లు రావొద్దంటే బీజేపీని ఓడించండి

దుబ్బాక : పప్పులో చిటికెడు ఉప్పేసి.. పప్పంతా నాదే అన్నట్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. జిల్లాలోని కూడవెళ్లి గ్రామంలో బుధవారం దుబ్బాక నియోజకవర్గ స్థాయి రేషన్ డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు సమక్షంలో రేషన్ డీలర్లు టీఆర్ఎస్ అభ్యర్థికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. డీలర్లను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. 

బాయికాడ మీటర్లు రావొద్దన్నా, విదేశీ మక్కలు రావొద్దన్నా, మార్కెట్ యార్డులు రద్దు కావొద్దన్నా.. దుబ్బాక నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిని లక్ష మెజార్టీతో గెలిపించాలన్నారు. బీజేపీ అభ్యర్థి డిపాజిట్ గల్లంతు చేయాలని రేషన్ డీలర్లకు మంత్రి పిలుపునిచ్చారు. మీ సంక్షేమం మా బాధ్యత అన్నారు. సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నెంబన్ వన్ గా ఉందన్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పాలని సూచించారు. దుబ్బాక సంక్షేమం, అభివృద్ధిని టీఆర్ఎస్ బాధ్యతగా తీసుకుంటుందన్నారు.


 కేంద్రం NFSA పథకం కింద 40 లక్షల కార్డు దారులకు 5 కిలోల చొప్పున్న బియ్యం అందిస్తుందన్నారు. కానీ, 90 లక్షల రేషన్ కార్డు దారులకు 6 కిలోల చొప్పున్న బియ్యాన్నిరాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని గుర్తు చేశారు. బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తుందని వారి మోసాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. 11వేల 700 కోట్లు పింఛన్ల కోసం రాష్ట్రం వెచ్చిస్తే.. కేవలం 200 కోట్లు కేంద్రం ఇస్తుందని, ఈ విషయాన్ని ప్రజలకు అర్థం చేయించాలన్నారు. రేషన్ డీలర్ల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు, డీలర్లకు మేలు చేసిందని మంత్రి హరీశ్ రావు వివరించారు.



logo