సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Oct 22, 2020 , 10:21:58

మ‌హ‌బూబాబాద్‌లో కిడ్నాప్ అయిన బాలుడు హ‌త్య‌

మ‌హ‌బూబాబాద్‌లో కిడ్నాప్ అయిన బాలుడు హ‌త్య‌

మ‌హ‌బూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నాలుగు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన బాలుడు దీక్షిత్ రెడ్డి(9)ని హ‌త్య చేశారు. కేసముద్రం మండలం అన్నారం దానమయ్య గుట్టపై బాలుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు కిడ్నాప‌ర్లు. దీక్షిత్‌ను హ‌త్య చేశార‌ని వార్త తెలియ‌డంతో.. త‌ల్లిదండ్రులు, బంధువులు క‌న్నీరుమున్నీరు అవుతున్నారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు బాలుడి మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలుడి కిడ్నాప్ కేసులో న‌లుగురు అనుమానితుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

ఆదివారం సాయంత్రం 6 గంట‌ల స‌మ‌యంలో బాలుడికి మ‌త్తు మందు ఇచ్చి కిడ్నాప్ చేశారు. ఇంటి వ‌ద్ద ఆడుకుంటుండ‌గా దీక్షిత్‌ను కిడ్నాప‌ర్లు అప‌హ‌రించారు. రూ. 45 ల‌క్ష‌ల ఇస్తే బాలుడిని విడిచిపెడుతామంటూ కిడ్నాప‌ర్లు అత‌నికి తండ్రికి చెప్పారు. దీంతో మ‌హ‌బూబాబాద్ పోలీసు స్టేష‌న్‌లో బాలుడి త‌ల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు 100 మంది పోలీసుల‌తో 10 బృందాలు ఏర్పాటు చేసి దీక్షిత్ ఆచూకీ కోసం గాలించారు. రూ. 45 ల‌క్ష‌ల్లో కొంత డ‌బ్బు ఇచ్చేందుకు బాలుడి త‌ల్లిదండ్రులు అంగీక‌రించారు. కిడ్నాప‌ర్లు చెప్పిన స‌మ‌యానికి డ‌బ్బు సిద్దం చేశారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా కేంద్రంలో ఓ చోట బాలుడి తండ్రి డ‌బ్బుతో కిడ్నాప‌ర్ల కోసం వేచి చూశాడు. కిడ్నాప‌ర్లు రాక‌పోవ‌డంతో.. తండ్రి అక్క‌డ్నుంచి వెనుతిరిగాడు. మొత్తానికి బాలుడిని కిడ్నాప‌ర్లు హ‌త్య చేసి.. అత‌ని త‌ల్లిదండ్రుల‌కు శోకాన్ని మిగిల్చారు.