మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Oct 24, 2020 , 10:31:53

కృష్ణాకు తగ్గుతున్న వరద.. శ్రీరాంసాగర్‌కు ప్రవాహం

కృష్ణాకు తగ్గుతున్న వరద.. శ్రీరాంసాగర్‌కు ప్రవాహం

హైదరాబాద్‌ : కృష్ణా ప్రాజెక్టులకు వరద ఉధృతి కాస్త తగ్గుముఖం పడుతోంది. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ప్రవాహం తగ్గుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రస్తుతం 2,06,335 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టానికి చేరుకోవడంతో పది గేట్లు దిగువకు వదులుతున్నారు. జలాశయానికి 2,06,335 క్యూసెక్కుల వరద వస్తుండగా దిగువకు 2,54,761 క్యూసెక్కుల వదులుతున్నారు. కుడిగట్టు జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రస్తుతం డ్యామ్‌ నీటిమట్టం 884.30 అడుగులు కాగా, 211.47 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌కు ప్రస్తుతం 2,31,134 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు. ప్రస్తుతం 310.84 టీఎంసీలు నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు 589.60 మేర నీరుంది.

దాదాపు పూర్తిస్థాయిలో డ్యామ్‌లో నీరు ఉండడంతో 12 క్రస్ట్‌ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,19,277 క్యూసెక్కులు దిగువ విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గోదావరి బేసిన్‌లో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వరద కొనసాగుతోంది. డ్యామ్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు అదేస్థాయిలో నీరుంది. నీటి నిల్వ సామర్థం 90.31 టీఎంసీలకు పూర్తిస్థాయిలో నిల్వ ఉంది. ప్రస్తుతం డ్యామ్‌కు 50,359 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 12 క్రస్ట్‌ గేట్లను ఎత్తి 37,500 క్యూసెక్కులు గోదావరిలోకి వదులుతున్నారు. అలాగే కాకతీయ కాలువకు 3వేలు, సరస్వతీ కాలుకు 500, లక్ష్మీ కాలువకు 150, ఎస్కేప్‌ రెగ్యులేటర్‌కు 5500 క్యూసెక్కుల వరద వస్తోంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.