తగ్గిన ఓటింగ్

- అత్తాపూర్‌లో అత్యధికం 55.3%
- రాజేంద్రనగర్‌లో అత్యల్పం 21%
- ఓటు వేయడానికి ఆసక్తిచూపని ఓటర్లు
- బీజేపీ, ఎంఐఎం రెచ్చగొట్టే మాటల పర్యవసానం
- వరుస సెలవులు.. కరోనా రెండో వేవ్ ఆందోళన
- పాతబస్తీలో 25 శాతానికి మించని పోలింగ్
- ఓల్డ్ మలక్‌పేటలో గుర్తు తారుమారు
- ఆ ఒక్క డివిజన్లో రేపు రీపోలింగ్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్కో చోట.. ఒక్కో విధంగా పోలింగ్ నమోదైంది. పదిలోపు డివిజన్లలో మాత్రమే 50% ఓట్లు పోలయ్యాయి. కొన్ని చోట్ల 50% కంటే తక్కువగా, మరికొన్ని చోట్ల 40% కంటే తక్కువగా పోలింగ్ నమోదైంది. ప్రధానంగా నగరం మధ్యనున్న అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని కొన్ని డివిజన్లలో అత్యల్పంగా నమోదైంది. మరోవైపు పాతబస్తీ అంతటా 25శాతానికి మించలేదు.
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం గత ఎన్నికలతో పోలిస్తే కొంతవరకు తగ్గింది మంగళవారం జరిగిన ఎన్నికల్లో సుమారు 43 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. కచ్చితమైన పోలింగ్‌శాతాన్ని బుధవారం ఉదయం ప్రకటిస్తామని వెల్లడించింది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ 45 శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో బీజేపీ, ఎంఐఎం పదే పదే మతవిద్వేషపూరిత ప్రసంగాలతో సృష్టించిన అలజడి తక్కువ ఓటింగ్‌కు ఒక కారణం కాగా, వరుసగా సెలవులు రావడం, కరోనా భయం ఓటర్లను పోలింగ్‌బూత్‌కు రాకుండా అడ్డుకొని ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అత్తాపూర్ డివిజన్లో 55.38 శాతం, అత్యల్పంగా రాజేంద్రనగర్‌లో 21 శాతం ఓట్లు పోలయ్యాయి.
సెలవులు.. కరోనా..
ఒక్కసారిగా ఆరు రోజులు సుదీర్ఘ సెలవులు రావడం, కరోనా సెకండ్‌వేవ్ వస్తున్నదన్న ఆందోళనతో చాలామంది ముందుగానే స్వస్థలాలకు తరలిపోయారు. ఎన్నికల సందర్భంగా నగరంలో తీవ్ర ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని భావించి శనివారం నుంచి మంగళవారం వరకు వరుస సెలవులు రావడంతో ఊరిలోనే భద్రంగా ఉంటామని వెళ్లారు. ప్రశాంత జీవనం కోరుకుని పూర్తి సెక్యూరిటీలో గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండే ప్రజలు కూడా మనకెందుకులే అని బయటకు రాలేదు.
వెంటాడిన అల్లర్ల భయం
దీనికి తోడు ఎన్నిక ప్రచారం బీజేపీ ఎంఐఎం ల కారణంగా పూర్తిగా మతపరమైన ఎజెండావైపు మళ్లింది. ఈ రెండు పార్టీల నేతలు హద్దులు మీరి ప్రవర్తించారు. హైదరాబాద్‌పై సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన వ్యాఖ్య లు.. ఆందోళనలను పతాకస్థాయికి చేర్చాయి. దీనికి ప్రతిగా పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను కూల్చుతామని ఎంఐఎం చేసిన ప్రకటన అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. దీంతో 30 ఏండ్ల క్రితంనాటి ఘర్షణలను జ్ఞప్తికి తెచ్చుకొన్న ఓటర్లు ఇండ్లు దాటి బయటకు రావడానికే భయపడ్డారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత కూడా కావాలని నగరంలో పలు చోట్ల ఘర్షణలు సృష్టించేందుకు బీజేపీ నేతలు, ఎంఐఎం నేతలు ప్రయత్నించా రు. వీటన్నింటి ఫలితంగా జీహెచ్ఎంసీ ఓటింగ్‌శాతం 43శాతానికి పరిమితమైంది.
ఉదయం నుంచే నిరుత్సాహం
మంగళవారం 7 గంటలకు బల్దియాలోని 150 డివిజన్లలో పోలింగ్ మొదలైంది. మొత్తం 74.67 లక్షల మంది ఓటర్లు ఉండగా 9 వేల పైచిలుకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఉద యం 11 గంటలవరకు చాలాచోట్ల 0.7శాతమే నమోదైంది. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఓల్డ్ మలక్‌పేట డివిజన్ బ్యాలెట్ పేపర్లో సీపీఐ అభ్యర్థి గుర్తు కంకి కొడవలికి బదులు, సుత్తి కొడవలి ముద్రితమైనట్టు గుర్తించడంతో.. అభ్యర్థి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదుచేశారు. దీంతో ఎన్నికల సంఘం సదరు డివిజన్లో ఎన్నికను నిలిపివేసింది. ఈ డివిజన్లో 3వ తేదీన రీపోలింగ్జరుగుతుంది. జియాగూడ డివిజన్ పరిధిలో 200 మంది ఓట్లు గల్లంతైనట్టు కలకలం రేగింది. జియాగూడ డివిజన్లోని పోలింగ్‌స్టేషన్-38లో మొత్తం 914 ఓట్లు ఉండగా, అందులో 268 ఓట్లు మినహా మిగిలిన ఓట్లను మ్యాపింగ్‌లో భాగంగా సుమారు 29, 30, 31 కేంద్రాలకు బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైనట్టు పేర్కొంటున్న ఓట్లు స్థానిక విద్యాశ్రీ పాఠశాల పోలింగ్‌కేంద్రంలో ఉన్నట్లు అధికారులు తెలుపడంతో వివాదం సద్దుమణిగింది.
ప్రశాంతంగా పోలింగ్
ఎన్నికలు ఇన్సిడెంట్ ఫ్రీగా నిర్వహించి ట్రై పోలీస్ కమిషనరేట్ పోలీసులు సక్సెస్ అయ్యారు. హైదరాబాద్‌లో ప్రశాంతతకు భంగం కల్గకుండా ఉండేందుకు నగర పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకొన్నారు. భారీ ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటుచేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌ను సీసీ కెమెరాల నిఘాలోకి తీసుకున్నారు. పోలింగ్ స్టేషన్లవారీగా సమస్యాత్మకమైనవి, అతి సమస్యాత్మకమైన పోలీస్స్టేషన్లను విభజించి అందుకు తగ్గట్టుగా బందోబస్తును నియమించి, ప్రతి జోన్‌కు అదనపు సీపీ, జాయింట్ సీపీలను పర్యవేక్షణాధికారులుగా వారికి బాధ్యతలను అప్పగించారు. ట్రై పోలీస్ కమిషనర్లు క్షేత్ర స్థాయిలో స్వయంగా వెళ్లి బందోబస్తును పరిశీలించారు, దాంతో పాటు కమిషనరేట్ కార్యాలయాలలోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ల (సీసీసీ) నుంచి ఎప్పటికప్పుడు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, మహేష్‌భగవత్, సజ్జనార్ పరిస్థితిని సమీక్షించారు. అక్కడి నుంచి ఎన్నికల సరళిని పరిశీలిస్తూ, ఎక్కడైన చెదురుమదురు ఘటనలకు అవకాశముంటే వెంటనే అక్కడున్న సిబ్బందిని అప్రమత్తం చేసి, సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకొన్నారు.
ఓటుహక్కు వినియోగించుకొన్న ప్రముఖులు
సినీ, రాజకీయ ప్రముఖులు గ్రేటర్ ఎన్నికల్లో ఓటేసి బాధ్యతను చాటుకొన్నారు. మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ కవిత, హీరోలు చిరంజీవి, నాగార్జున తదితరులు ఓటుహక్కు వినియోగించుకున్న ప్రముఖుల్లో ఉన్నారు. నగరంలోని పలు పోలింగ్స్టేషన్లలో వీఐపీల రాకతో సందడి నెలకొన్నది. ఐటీ ఉద్యోగులు పోలింగ్‌పై ఆసక్తి చూపలేదు. మహానగరంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అత్యల్ప ఓటింగ్ నమోదైంది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు జీహెచ్ఎంసీ, ఎన్నికల కమిషన్ భారీగా ప్రచారం నిర్వహించినా ఫలితం లేకుండాపోయింది.
పాతబస్తీలో 25 శాతమే
ఈ ఎన్నికల్లో ఓటింగ్ ఒక్కోచోట.. ఒక్కో విధంగా నమోదైంది. పదిలోపు డివిజన్లలో మాత్రమే 50 % ఓట్లు పోలయ్యాయి. కొన్నిచోట్ల 50 శాతం కంటే తక్కువగా, మరికొన్ని చోట్ల 40%కంటే తక్కువగా పోలింగ్ నమోదైంది. సిటీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని కొన్ని డివిజన్లలో అత్యల్పంగా నమోదైతే. నగర శివారు ప్రాంతాల్లో పాతబస్తీ అంతటా 25 % మించలేదు. పాతబస్తీలో ఆనవాయితీ కంటే కూడా ఓటింగ్‌శాతం పడిపోయింది. పాతబస్తీ వాసులు ఓటింగ్‌కు దూరం గా ఉండి నాయకులపై తమకున్న అసంతృప్తిని పరోక్షంగా వ్యక్తపరిచారు.
గుర్తు మారింది.. ఎన్నిక ఆగింది
- రేపు ఓల్డ్ మలక్‌పేటలో రీపోలింగ్
బ్యాలెట్ పేపర్లో ఓ పార్టీ అభ్యర్థి గుర్తు తారుమారవడంతో ఓల్డ్ మలక్‌పేట డివిజన్లో ఎన్నిక ఆగిపోయింది. జీహెచ్ఎంసీలో పోలింగ్ సందర్భంగా మంగళవారం ఉదయం 26వ డివిజన్ ఓల్డ్ మలక్‌పేట సీపీఐ అభ్యర్థి.. బ్యాలెట్పేపర్లో తమ గుర్తు కనిపించడంలేదని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. బ్యాలెట్లో సీపీఐ గుర్తు మక్కజొన్న కంకి, కొడవలికి బదులు.. సీపీఎం గుర్తు సుత్తి, కొడవలి, నక్షత్రం ముద్రించినట్టు గుర్తించారు. ఓల్డ్ మలక్‌పేటలోని 69 పోలింగ్ కేంద్రాల్లో గురువారం రీపోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలింగ్ ముగిసేవరకు జీహెచ్ఎంసీ ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధం అమల్లో ఉంటుందని ఎస్ఈసీ స్పష్టంచేసింది.
‘విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో అనేక అంతర్జాతీయ, జాతీయ సంస్థలు కొలువుదీరాయంటున్నారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు చెందిన సాఫ్ట్వేర్ రంగ నిపుణులు ఇక్కడ కొలువులు చేస్తున్నారు. ఇలా “గంగా జమున తెహజీబ్” సంస్కృతితో ఉన్న మహానగరంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన మొదటి సారి భయానక వాతావరణం ఏర్పడింది. ఎన్నికల్లో గెలవడం కోసం గింత భయానక వాతావరణం సృష్టించడం అవసరమా?’
- నివాస్, ఓటర్, హైదరాబాద్
తాజావార్తలు
- ఇలా పడుకుంటే నెలసరి నొప్పిని తగ్గించుకోవచ్చు..
- ప్రదీప్ మాట్లాడుతుండగానే స్టేజీపైనే కుప్పకూలిపోయిన డైరెక్టర్
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన నటి నందిత శ్వేత
- నందిగామ పంచాయతీ కార్యదర్శి, ఏపీఎం సస్పెండ్
- ఏపీలో కొత్తగా 158 మందికి కోరోనా
- తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగింది : సీఎం
- మహిళలు, పిల్లలపై హింసను ఎదుర్కొనేందుకు 'సంఘమిత్ర'
- బిజినెస్ ఫ్రెండ్లీకి దెబ్బ: ‘మహా’ సర్కార్‌కు జీఎం వార్నింగ్!
- పాలమూరు-రంగారెడ్డి’ని ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలి : సీఎం కేసీఆర్
- 2020 లో జీవితం ఇంతేనయా! చిన్నారులు పాపం..